
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన రాణి
పరకాల (వరంగల్): నువ్వే నా ప్రాణం.. నువ్వు తోడుగా లేకపోతే బతకలేను అంటూ ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకొని తిరిగిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సంఘటన పరకాల పట్టణంలో మంగళవారం జరిగింది. పరకాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అల్లె రాము, రావుల రాణి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ప్రియురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరి మేజర్లు కావడంతో రాఖీ పౌర్ణమి మరుసటి రోజే ఓ మిత్రురాలి సమక్షంలో పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు. రాము కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పెళ్లికి నిరాకరించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాము కుటుంబసభ్యుల ఒత్తిడితో తాను ప్రేమించలేదంటూ ముఖం చాటేశాడు. దీంతో అవాక్కయిన రాణి ప్రియుడి ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేసేంత వరకు ఇంటి ముందే ఉంటానని, లేదంటే ఆత్మహత్యకైనా సిద్ధమంటూ వాపోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. రాము కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు వేసి మాయమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రియుడి ఇంటి ఎదుటే బైఠాయించినా స్థానికులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment