కృష్ణా కష్టమే.. గోదావరే గతి!
అడుగంటిన కృష్ణా జలాలు
సింగూరు, గోదావరి జలాలపైనే భారమంతా...
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు కనిష్టానికి పడిపోవడంతో హైదరాబాద్ జంట నగరాలకు వచ్చే రెండు, మూడు నెలలు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి మరో 3.8 టీఎంసీల నీటి లభ్యతే ఉండటం, దానినే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సి రావడం పాలనా యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇక గోదావరి జలాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మిగిలింది మూడే...
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 360 ఎంజీడీల మేర నీటి అవసరాలు ఉండగా ప్రస్తుతం కృష్ణా జలాల నుంచే 270 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సాగర్ జలాలే ఎక్కువగా జంట నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టాలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయాయి. ఎగువన ఉన్న శ్రీశైలంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 504.4 అడుగులకు చేరగా నీటి నిల్వ 122.36 టీఎంసీలకు చేరింది. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టానికిగానూ 785.2 అడుగుల్లో 22.38 టీఎంసీల నీటి లభ్యత ఉంది. సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల్లో వినియోగార్హమైన నీటి లభ్యత 8 టీఎంసీలు ఉండగా దాన్ని ఇటీవలే బోర్డు ఇరు రాష్ట్రాలకూ పంచింది.
తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు దక్కాయి. సాగర్‌లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉంది. ఆ స్థాయి మట్టాల్లో లభ్యతగా ఉన్నది కేవలం 3.8 టీఎంసీలే. ఇందులో ఆవిరి, సరఫరా నష్టాలు 0.8 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసినా గరిష్టంగా లభ్యమయ్యేవి 3 టీఎంసీలే. ఆ నీటినే ఇరు రాష్ట్రాలు జూన్, జూలై, ఆగస్టు వరకు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కృష్ణా జలాల్లో 8 టీఎంసీల మేర తెలంగాణ ఎక్కువగా వాడిందని ఏపీ అంటుండగా బోర్డు దానికి వత్తాసు పలుకుతోంది. దీన్నే బోర్డు పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు చుక్క నీరు దక్కదు. జంట నగరాలకు జూన్, జూలైలలో నీటి అవసరాలు కనిష్టంగా 4 టీఎంసీల వరకు ఉంటాయి. లభ్యతగా ఉండే 3 టీఎంసీల్లో బోర్డు కనికరించి రెండు రాష్ట్రాలకు చెరిసగం నీటిని పంచినా రాష్ట్రానికి తాగునీటి కటకట తప్పదు. అదే జరిగితే రాష్ట్రం పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
గోదావరిపైనే ఆశలన్నీ..
హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా జలాలు అందించడం క్లిష్టమైతే రాష్ట్రం ఇక గోదావరి ప్రాజెక్టులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎల్లంపల్లిలో ఆశించిన స్థాయిలో నీరుండటం కొంత ఊరటనిస్తోంది. ఎల్లంపల్లి సామర్ధ్యం 20.17 టీఎంసీలుకాగా ప్రస్తుతం 10.64 టీఎంసీల నిల్వలున్నాయి. దీంతోపాటే సింగూరులో మరో 18.24 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ నీటితో జంట నగరాల ప్రజల దాహార్తి తీర్చే అవకాశముందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.