బస్తీకి బంద్‌? | L&T Not Intrested on Old City Metro Route | Sakshi
Sakshi News home page

బస్తీకి బంద్‌?

Published Sat, Jun 8 2019 8:22 AM | Last Updated on Wed, Jun 12 2019 9:46 AM

L&T Not Intrested on Old City Metro Route - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్‌: పాతబస్తీకి మెట్రో రైలు ప్రయాణం కలగానే మిగలనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పనులు చేపట్టేందుకు ఇప్పటికే అలైన్‌మెంట్‌ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ సవాలక్ష సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు దాదాపు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. మరో 69 ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించాలి. పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ ఆఫ్‌ వే స్థలాన్ని సేకరించాలి. ఇవన్నీ నిర్మాణ సంస్థకు కత్తిమీద సాములా మారాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్తుల సేకరణలో భాగంగా నష్టపరిహారం చెల్లించేందుకు దాదాపు రూ.100 కోట్లకు పైగా  అవసరం.

ఇక ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం.. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, షంషీర్‌గంజ్‌ ప్రాంతాల్లో ఐదు స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు రూ.1250 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. మరోవైపు ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ ఆఫ్‌ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. ఇక ఈ రూట్‌లో దాదాపు 69 ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా మెట్రో మార్గాన్ని బహదూర్‌పురా, కాలపత్తర్, ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలని గతంలో డిమాండ్లు వినిపించిన విషయం విదితమే. ఈ సమస్యల కారణంగానే ఎల్‌అండ్‌టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా ఖర్చులతో రూ.4వేల కోట్లు నిర్మాణం వ్యయం పెరిగిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని ఎల్‌అండ్‌టీ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 

మెట్రో కోసం పోరాటం...  
పాతబస్తీకి మెట్రో కోసం రాజకీయ పార్టీలు పోరాటం కూడా చేశాయి. అయితే ప్రాజెక్టు మార్కింగ్‌లకే పరిమితవగా, ఇప్పటి వరకు ఒక్క పిల్లర్‌ ఏర్పాటు కాలేదు. మూసీనదిలో ఎంజీబీఎస్‌ వద్ద మాత్రమే రైలు రివర్సల్‌ సదుపాయం కోసం రెండు పిల్లర్లు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో వెంటనే మెట్రో పనులను ప్రారంభించాలని కోరుతూ ఓల్డ్‌ సిటీ మెట్రో రైల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ గతంలో ఎన్నో ఆందోళనలు చేసింది. మజ్లిసేతర పార్టీల నాయకులందరూ ఏకమై 2017 నవంబర్‌ 21న జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పాటై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార టీఆర్‌ఎస్‌ సహా మిగతా పార్టీల నాయకులు ఈ జేఏసీలో భాగమై పాతబస్తీలో మెట్రో అవసరం, ప్రాధాన్యాన్ని వివరిస్తూ హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2017 డిసెంబర్‌ 17న మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2018 ఆగస్టు 25న మెట్రో రైలు అలైన్‌మెంట్‌ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టడానికి ప్రాజెక్టు అధికారుల బృందం మార్గాన్ని పరిశీలించింది. ఎంజీబీఎస్‌ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్‌ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్‌ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్‌గంజ్‌ ద్వారా ఫలక్‌నుమా వరకు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా... ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు.  

ఆలస్యం ఎందుకు?  
పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టకపోవడం సరైంది కాదు. గతంలో మెట్రో పనులను మజ్లిస్‌ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం మజ్లిస్‌ పనుల ప్రారంభానికి ముందుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పాతబస్తీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.– ఇ.టి.నర్సింహ, జేఏసీ నాయకులు (సీపీఐ)

పనులు ప్రారంభించాలి  
ముందుగా ప్రకటించినట్లుగానే దారుషిఫా నుంచే మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గడువు లోగా మెట్రో పనులు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి.  – కె.వెంకటేశ్, జేఏసీ నాయకులు (కాంగ్రెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement