ఊరూరా వైరా నీరు | lure thousands from around | Sakshi
Sakshi News home page

ఊరూరా వైరా నీరు

Published Fri, Jan 23 2015 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఊరూరా వైరా నీరు

ఊరూరా వైరా నీరు

వైరా : వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వైరా రిజర్వాయర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలకు తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
 
దీనిలో భాగంగా పాలేరు, వైరా, దుమ్ముగూడెం వాటర్‌గ్రిడ్ పథకాల ఇన్‌టెక్‌వెల్ పనులు ప్రారంభమవుతున్నాయి. వైరా వాటర్‌గ్రిడ్ పథకం కోసం గతంలో తయారు చేసిన ప్రతిపాదనల్లో అధికారులు మార్పులు చేశారు. కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించారు. వాటికి ఆమోదం కూడా లభించింది.
 
ఇదీ వైరా వాటర్‌గ్రిడ్ స్వరూపం
వైరా రిజర్వాయర్ నుంచి మూడు నియోజకవర్గాల్లో 12 మండలాలకు తాగునీరు అందించనున్నారు. మొదటి ప్రతిపాదనలో నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏన్కూరు, జూలూరుపాడు మండలాలను చేర్చారు. పూర్తిస్థాయిలో ఈ ప్రతిపాదనలు పూర్తిచేసి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇదే ఖాయమైతే వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, మధిర నియోజకవర్గంలోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల పరిధిలో 493 గ్రామాలు 6.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. అశ్వారావుపేటలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను దుమ్ముగూడెం వాటర్‌గ్రిడ్ పథకంలోకి మార్చారు.
 
ఓ ఇన్‌టెక్‌వెల్- 309 తాగునీటి పథకాలు
వైరా రిజర్వాయర్ వాటర్‌గ్రిడ్ పథకానికి మూడు నియోజకవర్గాల్లో 309 మంచినీటి ట్యాంకులు, రిజర్వాయర్ వద్ద ఓ ఇన్‌టెక్‌వెల్ నిర్మించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 153 ట్యాంకులు వినియోగంలో ఉన్నాయి. కొత్తగా 260 ట్యాంకులు అవసరం ఉన్నాయని సత్తుపల్లి నియోజకవర్గంలో 107 మంచినీటి ట్యాంకులు, మధిర నియోజకవర్గంలో మరో 54 ట్యాంకుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆయా పంచాయతీల అధికారులకు స్థల సేకరణ కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు.
 
భారీగా అంచనా వ్యయం
వాటర్‌గ్రిడ్ పథకానికి 1,220 కోట్లు అవసరం ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 12 మండలాల్లో సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలకు రిజర్వాయర్ నుంచి రా వాటర్‌ను మాత్రమే అందించి వాటి వినియోగాన్ని ఆయా మున్సిపాలిటీలు చూసుకునేలా నిబంధనలు పెట్టారు. వీటిలో కొణిజర్ల మండల బస్వాపురం, కల్లూరు మండలం కనెగిరి, కనెగిరి గుట్టల వద్ద ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం, బోనకల్ క్రాస్ రోడ్డు వద్ద  నీటిశుద్ధి కేంద్రాలు  ఏర్పాటు చేయనున్నారు. వైరా రిజర్వాయర్ వద్ద 300 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ఏడు మోటార్లను ఏర్పాటు చేస్తారు.
 
ఆన్‌లైన్ టెండర్లకు ఏర్పాట్లు
వైరా రిజర్వాయర్ నుంచి 12 మండలాలకు తాగునీటిని అందించేందుకు ఈనెల చివరి వరకు ఆన్‌లైన్ టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు హరి ఉమాకాంతారావు తెలిపారు. ఇటీవల ఆయన రిజర్వాయర్‌ను సందర్శించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించిన పైపులైన్లు, ఇన్‌టెక్‌వెల్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement