తెలంగాణలో ఎండలు ఎక్కువగా పెరుగుతుండడంతో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. జిల్లాల్లో వీటి దాడికి గురై పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులు వీటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. జమ్మికుంట మండలం సీతంపేట, బూజునూర్ గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న 21 మందిపై దాడి చేసి గాయపరిచింది. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా వారికి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందించారు. తహశీల్దార్ రజిని బాధితులను పరామర్శించారు. అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రేగడిచిలకలమర్రి గ్రామంలో సోమవారం ఉదయం 12 మందిని పిచ్చికుక్క గాయపరిచింది. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక చికిత్స అందించి అక్కడి నుంచి షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.