విదేశీ షోకులు తప్ప.. ఓయూలో శోకాలు పట్టవా
• ఎంపీ కవితను ప్రశ్నించిన మధుయాష్కీ
• నోరు అదుపులో లేకుంటే తీవ్ర పరిణామాలు: పొన్నం, దానం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండి పడింది. రాహుల్‌పై స్థాయికి మించి మాట్లా డితే తీవ్ర పరిణామాలుంటాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గురువా రం యాష్కీ మాట్లాడుతూ.. విదేశీ పర్యటన ల్లో షోకులు చూసి రావడం తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శోకాలు పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు వర్సిటీకి వెళ్లడానికి ఎందుకు భయపడు తున్నారని ప్రశ్నించారు.
అధికా రంలోకి వచ్చిన తర్వాత కమీషన్లతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మనీలాం డరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చిందని యాష్కీ అన్నారు. ఈడీ కేసుల నుంచి తప్పించుకోడానికే నవంబర్ 18న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్లు కేసీఆర్ మొక్కారని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శిం చే స్థాయి కవితకు లేదని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఇందిరాగాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామా లుంటాయని హెచ్చరించారు. రాహుల్‌పై నోరు పారేసుకున్న కవితకు విద్యార్థి లోకమే బుద్ధి చెబుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతుల్లో కవితకు తగిన గుణపాఠం తప్పదన్నారు. శవాల దగ్గర ఏడ్చే జాతి సీఎం కేసీఆర్ కుటుంబానిదేనని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. మహిళలపై ఉన్న గౌరవం పోగొట్టేలా కవిత మాట్లాడుతున్నారని.. అసలైన రుడాలీ జాతి ఎంపీ కవితదే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎంపీ కవిత అనుచితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కవిత దిష్టిబొమ్మను టీపీసీసీ మహిళా విభాగం నేతలు గాంధీభవన్‌లో చెప్పులతో కొట్టారు.