సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం.
‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment