PV Ghat
-
పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పీవీ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో దేశానికి పీవీ చేసిన సేవలను ప్రశంసించారు. ఇక, పీవీ ఘాట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘తెలుగు వారికి, తెలంగాణకు, భారత దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహారావు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలు అందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్‌ను నిర్మించాలి. భారతరత్న ఇచ్చి పీవీని గౌరవించాలి. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఆయన వర్థంతి సభకు బీఆర్ఎస్ రాకపోవడం బాధాకరం’ అని విమర్శించారు. -
పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఒక శక్తి..
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 16వ వర్థంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయి. దేశానికి దిక్సూచి పీవీ. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం. ‘దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు. భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. పీపీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎన్నారైలు కోరుతున్నారు. మేం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో ఒక తపాల బిళ్లను విడుదల చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. -
అదే జరిగితే.. దారుసలాంని కూల్చుతాం
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు కౌంటర్‌కి ఎన్కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దిన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు అంటూ బండి సంజయ్ తీవ్రగా హెచ్చరించారు. దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తుందని.. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పాలన ఉందని అన్నారు. కనుక ఓటేసే ముందు అది ఏ పార్టీకి చేరుతుందో ప్రజలు గమనించాలని బండి సంజయ్ సూచించారు. (చదవండి: అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్) మాది ఢిల్లీ పార్టీయే అయినా గల్లీ గల్లీకి మా ప్రధాన మంత్రి పథకాలు ప్రజలకు అందుతున్నాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది అని కేసీఆర్ అంటున్నారు, అలా అయితే కేంద్ర నిధుల లేకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులకు పేర్లు, ఫోటోలు మార్చి తన పథకాలుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ,ఈ విషయాన్నిదుబ్బాక ప్రజలు గ్రహించారు కాబట్టే టీఆర్ఎస్ కు అక్కడ బుద్ది చెప్పారన్నారు బండి సంజయ్. -
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
-
ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..
-
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్ రమేశ్.. జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్‌కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. చదవండి : ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్ -
ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు. అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, జైపాల్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు వరకు జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర సాగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సిద్ధరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్, మల్లికార్జున ఖర్గేలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మధుయాష్కి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హారయ్యారు. -
గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గాంధీభవన్‌లో జైపాల్‌కు ఘన నివాళి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డికి ఘనంగా అంజలి ఘటించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...‘జైపాల్‌రెడ్డి మన మధ్య లేరు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1964 నుంచి జైపాల్ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. -
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
-
మాజీ ప్రధాని పివికి ఘన నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 11వ వర్ధంతి సంస్మరణ సభ బుధవారం నెక్లెస్ రోడ్డులోని పి.వి.జ్ఞానభూమిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని నరసింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రధానిగా పివి అందించిన సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం పి.వి.జ్ఞానభూమిలో ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులోభాగంగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం పివి నరసింహరావు ఛాయ చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.