
ఎవరినీ ఉపేక్షించబోం
కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ బద్మాష్ పనిచేశారు: మహమూద్ అలీ
అక్రమాలకు పాల్పడే సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ‘కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు బద్మాష్ పనిచేశాడు. బాధ్యత కలిగిన రిజిస్ట్రేషన్ల శాఖ పరువును పూర్తిగా బద్నాం చేశాడు. దొంగపని చేయడం వల్లే జైలు పాలయ్యాడు..’ అని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో వందల ఎకరాల భూముల కుంభకోణం, కూకట్‌పల్లిలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసేపుడు కనీసం పైఅధికారులను సంప్రదించకుండా కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు దుర్మార్గమని.. దీనిపై ఆ శాఖ మంత్రిగా తాను తీవ్రంగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. బాలానగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్లపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ముఖ్యమంత్రి భారీగా వేతనాలు పెంచారని.. అయినా కొందరు అధికారులు ఇలా వ్యవహరించడంపై దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే మియాపూర్ భూకుంభకోణంలో రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు.
కొంత ఆలస్యమైంది..
రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా రిజిస్ట్రార్లదేనని, కూకట్‌పల్లి ఆఫీసులో జరిగిన అక్రమాలను తెలుసుకునే విషయంలో కొంత ఆలస్యమైందని మహమూద్ అలీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా మూడు లేదా ఆరు నెలలకోసారి తప్పనిసరిగా ఆడిట్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు.
అక్రమాల నియంత్రణ కోసం అధికారులతో చర్చించి రెండు మూడు రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని.. ఒకేచోట సంవత్సరాల తరబడి ఉన్న అధికారులను బదిలీ చేస్తామని తెలిపారు. కాగా.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వలన ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. అయితే కొందరు దొంగలకు కూడా ఉపయోగపడుతోందని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసే విషయమై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు.