mahammad ali
-
పోలీస్ చూపు.. వీక్లీఆఫ్ వైపు!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు వారాంతపు సెలవుల అంశాలు కొన్నేళ్ల నుంచి నానుతూ వస్తున్నాయి. నూతన హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమూద్ అలీ వారాంతపు సెలవులపై చర్యలు చేపడతామని ప్రకటించడంతో మరోసారి పోలీస్ సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఈ రెండు అంశాలపై హోంమంత్రి మహమూద్ అలీ ఎంతమేరకు సమస్య పరిష్కరిస్తారన్న దానిపై పోలీస్‌శాఖలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ రెండు విభాగాల్లోనే కష్టం.. పోలీస్ శాఖలో శాంతి భద్రతల విభాగం, ట్రాఫిక్ విభాగం ఈ రెండు చాలా కీలకమైనవి. ఈ విభాగా ల్లో పనిచేస్తున్న సిబ్బంది 24 గంటలు, 365 రోజులు డ్యూటీలోనే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, అర్బన్, రూరల్ 3 విధాలుగా స్టేషన్ల విభజన ఉంటుంది. కమిషనరేట్ల పరిధిలో స్టేషన్ల ఇన్చార్జిలుగా ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారి ఉంటారు. ఈ ఠాణాల్లో సీఐతో కలిపి మొత్తం సిబ్బంది 42 నుంచి 50 మంది వరకు ఉంటారు. అర్బన్ పోలీస్ స్టేషన్లలో మొత్తం సిబ్బంది 28 నుంచి 34 వరకు ఉంటారు. రూరల్ పోలీస్ స్టేషన్లు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి స్టేషన్ ఇన్చార్జిగా ఉండ గా, 22 నుంచి 28 మంది సిబ్బంది ఉంటారు. ఈ మూడు రకాల ఠాణాల్లో ప్రతీ ఒక్క సిబ్బందికి వారి వారి విధులు నిత్యం ఉంటూనే ఉంటాయి. అలాగే ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర వీఐపీ పర్యటనలు తదితరాల కారణంగా వీక్లీ ఆఫ్ అమలు చేస్తే శాంతి భద్రతల పరిరక్షణపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుం దని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. అర్బన్ ప్రాంతాలు, రాజధాని, దాని చుట్టుపక్కల కమిషనరేట్లలో ట్రాఫిక్ నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వలేకపోయినా షిఫ్ట్‌ల వారీగా పనులు విభజన చేస్తున్నారు. డిప్యుటేషన్లో ఓకే.. పోలీస్‌శాఖలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కాకుండా డిప్యూటేషన్ విభాగాల్లో వీక్లీ ఆఫ్‌కు పెద్దగా ఇబ్బంది లేదు. నేర పరిశోధన విభాగం (సీఐడీ), విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అవినీతి నిరోధక శాఖ (ఏసీ బీ), రాష్ట్ర పోలీస్ అకాడమీ, పోలీస్ కంప్యూటర్స్ అండ్ టెక్నికల్ సర్వీస్ తదితరాల్లో ప్రతీ ఆదివారం సెలవు దినం కావడంతో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది వీక్లీ ఆఫ్‌గా తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖలో నియా మకాల ప్రక్రియ అన్ని విభాగాల కన్నా వేగంగా, ఎక్కువ సంఖ్యలో జరిగింది. 12 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీ పూర్తయి రెండేళ్లు గడిచింది. అలాగే మరో దఫాలో 16 వేల కానిస్టేబుల్, 1,000కి పైగా సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ 50 శాతం మేర పూర్తయింది. ఈ భర్తీ పూర్తయితే రాష్ట్ర పోలీస్ శాఖలో 70 వేల మంది పైగా సిబ్బంది అందు బాటులో ఉంటారు. దీంతో సిబ్బంది పెరుగు దలను దృష్టిలో పెట్టుకొని వీక్లీ ఆఫ్ అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గెజిటెడ్ హోదా ఎప్పుడు? రాష్ట్రంలో 8 వేల మందికి పైగా సబ్ ఇన్స్పెక్టర్లు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మండల స్థాయితో పాటు అర్బన్, కమిష నరేట్లలో ఎస్సైల పాత్ర చాలా కీలకం. మండలా ల్లో పనిచేస్తున్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఈఓపీఆర్ డీ..తదితర అధికారులంతా గెజిటెడ్ అధికారులే. వారితో సమానంగా మండలాల్లో కీలకంగా పనిచే స్తున్న తమకు గెజిటెడ్ హోదా ఇవ్వకపోవడం ఎస్సైలను ఏళ్లుగా నిరాశకు గురిచేస్తోంది. ప్రతీ క్షణం ఉద్యోగం చేసే తమకు ఈసారైనా గెజి టెడ్ హోదా కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
ఎవరినీ ఉపేక్షించబోం
కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ బద్మాష్ పనిచేశారు: మహమూద్ అలీ అక్రమాలకు పాల్పడే సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు బద్మాష్ పనిచేశాడు. బాధ్యత కలిగిన రిజిస్ట్రేషన్ల శాఖ పరువును పూర్తిగా బద్నాం చేశాడు. దొంగపని చేయడం వల్లే జైలు పాలయ్యాడు..’ అని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో వందల ఎకరాల భూముల కుంభకోణం, కూకట్‌పల్లిలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసేపుడు కనీసం పైఅధికారులను సంప్రదించకుండా కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు దుర్మార్గమని.. దీనిపై ఆ శాఖ మంత్రిగా తాను తీవ్రంగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. బాలానగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్లపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ముఖ్యమంత్రి భారీగా వేతనాలు పెంచారని.. అయినా కొందరు అధికారులు ఇలా వ్యవహరించడంపై దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే మియాపూర్ భూకుంభకోణంలో రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు. కొంత ఆలస్యమైంది.. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా రిజిస్ట్రార్లదేనని, కూకట్పల్లి ఆఫీసులో జరిగిన అక్రమాలను తెలుసుకునే విషయంలో కొంత ఆలస్యమైందని మహమూద్ అలీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా మూడు లేదా ఆరు నెలలకోసారి తప్పనిసరిగా ఆడిట్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. అక్రమాల నియంత్రణ కోసం అధికారులతో చర్చించి రెండు మూడు రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని.. ఒకేచోట సంవత్సరాల తరబడి ఉన్న అధికారులను బదిలీ చేస్తామని తెలిపారు. కాగా.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వలన ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. అయితే కొందరు దొంగలకు కూడా ఉపయోగపడుతోందని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసే విషయమై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కేబినెట్ కూర్పుపై కేసీఆర్ కసరత్తు
-
కొత్తవాళ్లకు నో చాన్స్!
మహమూద్‌కు డిప్యూటీ, హోం! స్పీకరుగా పోచారం? కేబినెట్ కూర్పుపై కేసీఆర్ కసరత్తు తొలుత 15 మందితో మంత్రివర్గం ఈటెలకు ఆర్థికం, హరీశ్‌కు సాగునీరు, విద్యుత్ కేటీఆర్, కొప్పుల, చందూలాల్, పద్మారావులకు ఖాయం రేసులో సురేఖ, జూపల్లి, పద్మ, సోలిపేట, స్వామి గౌడ్ దాస్యం, మధుసూదనాచారి, మహేందర్ రెడ్డి, రాజయ్య నల్లగొండకు మాత్రం మినహాయింపు హైదరాబాద్: తెలంగాణలో తొలి మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ కసరత్తును ముమ్మరం చేశారు. కనీసం రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన వారికే అవకాశం కల్పించాలనిభావిస్తున్నారు. పాలన, ప్రభుత్వ వ్యవహారాల వంటివాటిపై అవగాహనలేని కొత్తవారిని కేబినెట్లోకి తీసుకుంటే ఇబ్బందని అంచనా వేస్తున్నారు. సీనియర్లు లేని నల్లగొండ జిల్లాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపును ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ముఖ్యులు, కేసీఆర్ సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం.. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తును చాలావరకు పూర్తి చేశారు. జిల్లాలవారీగా సీనియారిటీ, విధేయత, సామాజిక సమతూకం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నారు. తనతో కలిపి మొత్తం 15 మందికే కేబినెట్‌ను తొలుత పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయిం చారు. అవసరాన్ని బట్టి విస్తరణకు వీలుగా కొంత అవకాశం ఉంచుకోవాలనుకుంటున్నారు. చీఫ్ విప్‌తో పాటు ముగ్గురు విప్‌లను నియమించనున్నారు. లోక్‌సభకు నాయిని! ముస్లిం మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానం నేపథ్యంలో ఎమ్మెల్సీ మహమూద్ అలీకి ఆ పదవితో పాటు హోం శాఖను కూడా అప్పగిస్తారని సమాచారం. జంటనగరాల ప్రతినిధిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావుకు కేబినెట్లో చోటు దక్కనుంది. సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా స్థానం ఆశిస్తున్నారు. అవకాశమివ్వాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నా నాయినికి ప్రస్తుతానికి అసెంబ్లీలో గానీ, మండిలిలో గానీ సభ్యత్వం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజీనామా చేయబోయే మెదక్ లోక్‌సభ స్థానంలో ఆయనకు అవకాశం ఇచ్చే యోచనా ఉన్నట్టు సమాచారం. జగదీశ్‌కు బెర్తు ఖాయమే కరీంనగర్ నుండి ఈటెల రాజేందర్(హుజూరాబాద్), కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు(సిరిసిల్ల), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి)కు కేబినెట్లో స్థానం దక్కనుంది. ఈటెలకు ఆర్థికశాఖను కేటాయించనున్నారు. మెదక్ నుంచి కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు(సిద్దిపేట)కు నీటిపారుదల, విద్యుత్తు శాఖలు కేటాయించవచ్చని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు. జిల్లా నుండి పద్మా దేవేందర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా రేసులో ఉన్నారు. వారికి విప్‌లుగా అవకాశం రావచ్చంటున్నారు. నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ)కి స్పీకరుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అందుకాయన విముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో సీనియర్లు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మా రెడ్డి(జడ్చర్ల)లకు కేబినెట్ బెర్తు దక్కనుంది. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన జూపల్లికి చీఫ్ విప్ వంటి ముఖ్యమైన పదవులను ఇచ్చేఅవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోటాలో ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. పి.మహేందర్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన జి.జగదీశ్‌రెడ్డి(సూర్యాపేట)కి బెర్తు ఖాయమైంది. జిల్లా నుంచి గొంగిడి సునీత (ఆలేరు), పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి) కూడా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఎ.చందూలాల్ (ములుగు)కు మంత్రివర్గంలో స్థానం ఖాయమైంది. అయితే జిల్లా నుంచి సీనియర్లు సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి), దాస్యం వినయ్‌భాస్కర్ (వరంగల్ పశ్చిమ) కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడుతున్న మధసూదనాచారికి ఇవ్వాలనే డిమాండు తీవ్రంగాఉంది. బీసీ వర్గానికి చెందిన మహిళగా కొండా సురేఖ (వరంగల్ తూర్పు) కూడా అవకాశం కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ టి.రాజయ్య (స్టేషన్ ఘన్పూర్) కూడా ఆశిస్తున్నారు. కానీ ఒక జిల్లా నుంచి గరిష్టంగా ఇద్దరికి మించి అవకాశం లేని నేపథ్యంలో వరంగల్ విషయంలో కేసీఆర్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న(ఆదిలాబాద్)కు అవకాశముంది. ఖమ్మం జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం)కు దాదాపుగా బెర్తు ఖాయమేనంటున్నారు. ప్రజాకాంక్షలకు ప్రతిరూపం: టీవీవీ ఎన్నికల తీర్పు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ సాధించిన విజయానికి ఆయన అభినందనలు తెలియజేశారు.