కొత్తవాళ్లకు నో చాన్స్!
మహమూద్‌కు డిప్యూటీ, హోం! స్పీకరుగా పోచారం? కేబినెట్ కూర్పుపై కేసీఆర్ కసరత్తు
తొలుత 15 మందితో మంత్రివర్గం
ఈటెలకు ఆర్థికం, హరీశ్‌కు సాగునీరు, విద్యుత్
కేటీఆర్, కొప్పుల, చందూలాల్, పద్మారావులకు ఖాయం
రేసులో సురేఖ, జూపల్లి, పద్మ, సోలిపేట, స్వామి గౌడ్
దాస్యం, మధుసూదనాచారి, మహేందర్ రెడ్డి, రాజయ్య
నల్లగొండకు మాత్రం మినహాయింపు
హైదరాబాద్: తెలంగాణలో తొలి మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ కసరత్తును ముమ్మరం చేశారు. కనీసం రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన వారికే అవకాశం కల్పించాలనిభావిస్తున్నారు. పాలన, ప్రభుత్వ వ్యవహారాల వంటివాటిపై అవగాహనలేని కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకుంటే ఇబ్బందని అంచనా వేస్తున్నారు. సీనియర్లు లేని నల్లగొండ జిల్లాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపును ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యులు, కేసీఆర్ సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం.. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తును చాలావరకు పూర్తి చేశారు. జిల్లాలవారీగా సీనియారిటీ, విధేయత, సామాజిక సమతూకం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నారు. తనతో కలిపి మొత్తం 15 మందికే కేబినెట్‌ను తొలుత పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయిం చారు. అవసరాన్ని బట్టి విస్తరణకు వీలుగా కొంత అవకాశం ఉంచుకోవాలనుకుంటున్నారు. చీఫ్ విప్‌తో పాటు ముగ్గురు విప్‌లను నియమించనున్నారు.
లోక్‌సభకు నాయిని!
ముస్లిం మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానం నేపథ్యంలో ఎమ్మెల్సీ మహమూద్ అలీకి ఆ పదవితో పాటు హోం శాఖను కూడా అప్పగిస్తారని సమాచారం. జంటనగరాల ప్రతినిధిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావుకు కేబినెట్‌లో చోటు దక్కనుంది. సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా స్థానం ఆశిస్తున్నారు. అవకాశమివ్వాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నా నాయినికి ప్రస్తుతానికి అసెంబ్లీలో గానీ, మండిలిలో గానీ సభ్యత్వం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజీనామా చేయబోయే మెదక్ లోక్‌సభ స్థానంలో ఆయనకు అవకాశం ఇచ్చే యోచనా ఉన్నట్టు సమాచారం.
జగదీశ్‌కు బెర్తు ఖాయమే
కరీంనగర్ నుండి ఈటెల రాజేందర్(హుజూరాబాద్), కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు(సిరిసిల్ల), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి)కు కేబినెట్‌లో స్థానం దక్కనుంది. ఈటెలకు ఆర్థికశాఖను కేటాయించనున్నారు. మెదక్ నుంచి కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు(సిద్దిపేట)కు నీటిపారుదల, విద్యుత్తు శాఖలు కేటాయించవచ్చని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు. జిల్లా నుండి పద్మా దేవేందర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా రేసులో ఉన్నారు. వారికి విప్‌లుగా అవకాశం రావచ్చంటున్నారు. నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ)కి స్పీకరుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అందుకాయన విముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో సీనియర్లు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మా రెడ్డి(జడ్చర్ల)లకు కేబినెట్ బెర్తు దక్కనుంది. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన జూపల్లికి చీఫ్ విప్ వంటి ముఖ్యమైన పదవులను ఇచ్చేఅవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోటాలో ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. పి.మహేందర్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన జి.జగదీశ్‌రెడ్డి(సూర్యాపేట)కి బెర్తు ఖాయమైంది. జిల్లా నుంచి గొంగిడి సునీత (ఆలేరు), పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి) కూడా ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ జిల్లా నుంచి ఎ.చందూలాల్ (ములుగు)కు మంత్రివర్గంలో స్థానం ఖాయమైంది. అయితే జిల్లా నుంచి సీనియర్లు సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి), దాస్యం వినయ్‌భాస్కర్ (వరంగల్ పశ్చిమ) కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడుతున్న మధసూదనాచారికి ఇవ్వాలనే డిమాండు తీవ్రంగాఉంది. బీసీ వర్గానికి చెందిన మహిళగా కొండా సురేఖ (వరంగల్ తూర్పు) కూడా అవకాశం కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ టి.రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్) కూడా ఆశిస్తున్నారు. కానీ ఒక జిల్లా నుంచి గరిష్టంగా ఇద్దరికి మించి అవకాశం లేని నేపథ్యంలో వరంగల్ విషయంలో కేసీఆర్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న(ఆదిలాబాద్)కు అవకాశముంది. ఖమ్మం జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం)కు దాదాపుగా బెర్తు ఖాయమేనంటున్నారు.
ప్రజాకాంక్షలకు ప్రతిరూపం: టీవీవీ
ఎన్నికల తీర్పు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సాధించిన విజయానికి ఆయన అభినందనలు తెలియజేశారు.