మహా’యజ్ఞం మొదలు! | Mahayajnam start! | Sakshi
Sakshi News home page

మహా’యజ్ఞం మొదలు!

Published Mon, Dec 15 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

మహా’యజ్ఞం మొదలు!

మహా’యజ్ఞం మొదలు!

  • మహానది-గోదావరి-కృష్ణా-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం
  •  ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశాలతో కేంద్ర ప్రత్యేక బృందాల చర్చలు
  •  ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టుల అనుసంధానం
  •  గోదావరి నీటిని కృష్ణాకు తరలించేలా ప్రణాళిక
  •  ఇచ్చంపల్లి-సాగర్ లింకుకు రూ. 26,289 కోట్ల ఖర్చు
  • సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రధాన నదుల అనుసంధాన ప్రక్రియ ఆరంభమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ప్రణాళికలు రచిస్తోంది. నదుల అనుసంధాన పథకం కింద దక్షిణాది ప్రాంతానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా తొలుత తెలంగాణ, ఒడిశాలను సంప్రదించనుంది. మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ంపై కేంద్రం నియమించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రానున్నాయి. ఇప్పటికే అనుసంధాన సాధ్యాసాధ్యాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. తదుపరి కార్యాచరణలో.. పర్యావరణ, అటవీ అనుమతులు, ప్రణాళిక వ్యయం, నీటి లభ్యతపై బృందాల ప్రతినిధులు అధికారులతో చర్చించి ఓ అంచనాకు రానున్నారు.
     
    బృహత్తర ప్రణాళిక.. భారీ ఖర్చు!

    అదనపు జలాల లభ్యత ఉన్న నది నుంచి మరో నదికి నీటిని మళ్లించడమే అనుసంధాన ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరీలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యం కల్పించారు. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించాలన్నది ప్రణాళిక.

    మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి(గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించేందుకు చర్యలు చేపడతారు. ఇందుకు ఒక్క 299 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధాన ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టారు.

    ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కు రూ. 14,636 కోట్ల అవసరమని అంచనా వేశారు. ఇక 312 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-పులిచింతలకు సైతం భారీ ప్రణాళికే రచించారు. దీని పూర్తి అంచనా ఎంతన్నది తెలియకున్నా ప్రధాన కెనాల్‌కు మాత్రం రూ. 4,252 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు.

    మరో 51 వేల అటవీ, 70 వేల వ్యవసాయ భూమి కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక బృందాలు వీటన్నింటిపై కూలంకషంగా రెండు రాష్ట్రాలతో చర్చించనున్నాయి. అనుసంధానంపై రాష్ట్రాల అభ్యంతరాలు తెలుసుకుంటాయి. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి(60 టీఎంసీలు), దేవాదుల(38 టీఎంసీలు), కంతనపల్లి(50 టీఎంసీలు) ప్రాజెక్టుల నీటి అవసరాలపైనా బృందం చర్చించనుంది.
     
    లబ్ధి అంచనాలు ఇలా..

    అనుసంధానించనున్న ఇచ్చంపల్లి-పులిచింతల, ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో తెలంగాణలో మొత్తంగా 9 లక్షల హెక్టార్ల మేర అదనపు సాగు అందుబాటులోకి వస్తుం దని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అలాగే గృహ, సాగునీటి అవసరాలకు మరో 15 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి వస్తుందని, 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.

    ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధానంతో కరీంనగర్ జిల్లాలో 2 మండలాలు, వరంగల్ 11, నల్లగొండలోని 9 మండలాల్లో 2.87లక్షల హెక్టార్లకు అదనపు సాగునీరు లభిస్తుంది. ఇచ్చంపల్లి-పులిచింతలతో వరంగల్  2 మండలాలు, ఖమ్మం 13 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 2, కరీంనగర్‌లో ఒక మండల పరిధిలో 6.13 లక్షల హెక్టార్ల సాగు భూమికి నీరందనున్నట్లు అంచనా వేశారు.

    అనుసంధాన కార్యక్రమానికి ఖర్చు భారీగానే ఉన్నా పథకం ఫలితాలు.. పదేళ్ల తర్వాత తెలుస్తాయని, అవి వందేళ్ల పాటు నిలిచి ఉంటాయని భావిస్తున్నారు. ప్రాథమిక  అంచనా మేరకు పదో ఏడాది తర్వాత విద్యుత్ అవసరాలు, సాగు రూపేనా ఇచ్చంపల్లి-సాగర్‌ల కింద ఏటా రూ.3 వేల కోట్లు, ఇచ్చంపల్లి-పులిచింతల కింద రూ.2,201.67 కోట్ల మేర ప్రయోజనాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement