సాక్షి, హైదరాబాద్: బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్–10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్–10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు.
అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు ఆయనకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరోస్ అవార్డు–2017ను ప్రకటించడం తెలిసిందే. ‘ప్రభుత్వ ప్రాధాన్యమైన మహిళల అక్రమ రవాణాపై భగవత్ ఉక్కుపాదం మోపారు.
రాచకొండ పోలీసు కమిషనర్‌గా 25 వేశ్యా గృహాలను మూయించేశారు. దేశంలోనే అతిపెద్ద సమస్య అయిన బాల కార్మికుల అక్రమ రవాణాను నిలువరించేందుకు కృషి చేశారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న దాదాపు 350 మందికిపైగా పిల్లలను కాపాడి బడి బాట పట్టించారు. 13 ఏళ్లుగా 1,000 మందికిపైగా మహిళలు, పిల్లలకు సెక్స్ ట్రాఫికింగ్, 800 మంది బాల కార్మికులకు పనుల నుంచి ఆయన విముక్తి కల్పించారు’అని బెటర్ ఇండియా ప్రశంసలు కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment