ప్రతీకాత్మక చిత్రం
‘ఎస్సారెస్పీ’ బాగోతంలో మరో కోణం
హసన్‌పర్తి: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న మెడికల్ బిల్లుల బాగోతంలో మరో కోణం వెలుగు చూసింది. బిల్లుల స్వాహా వ్యవహారంలో సదరు ఉద్యోగులపై కేసు నమోదు కాగా.. ఇందులో ప్రధాన çసూత్రధారినే తప్పించినట్లు తెలుస్తోంది. ఎస్సారెస్పీ ఉద్యోగులు కొందరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్లు తప్పుడు మెడికల్ బిల్లులను సృష్టించి సర్కారు నిధులను అప్పనంగా డ్రా చేసుకున్న ఘటన గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
2008 నుంచి ఈ తతంగం సాగగా.. 2016లో వెలుగుచూసింది. ఈ మేరకు శాఖా పరమైన విచారణ ప్రారంభం కాగా.. ప్రాథమికంగా 26 మంది ఉద్యోగులను దోషులుగా తేల్చారు. వారిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు ప్రమోషన్లు, అలవెన్సులు రాకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2017లో విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. అప్పటి నుంచి విచారణ కొనసాగగా.. నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఈ అవినీతి బాగోతాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు.. సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారిని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరు ఉన్నతాధికారి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. అయితే.. ఈ బాగోతానికి అసలు సూత్రధారిని పక్కకు తప్పించినట్లు తెలిసింది.
పెద్దోళ్ల పేర్లు బయటకు వస్తాయనే..
మెడికల్ బిల్లుల వ్యవహారంలో విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా 26 బిల్లులు ఫోర్జరీ చేసినట్లు తేలింది. మరో వంద బిల్లులు కూడా ఫోర్జరీవేనని విజిలెన్స్ అధికారులు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రెండేళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం సుమారు 26 బిల్లులకు సంబంధించి రూ.50 లక్షల మేరకు డబ్బులు స్వాహా అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ విచారణ సందర్భంగా సదరు ఉద్యోగులు.. ఈ బాగోతానికి ప్రధాన సూత్రధారి.. దళారీగా వ్యవహరించిన ఓ వ్యాపారి పేరును వెల్లడించలేదు.
దీంతో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అధికారులు అతడి పేరును చేర్చలేదని సమాచారం. ఈ దళారిని విచారణ పరిధిలోకి తీసుకొస్తే పెద్ద తలల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఫోర్జరీ బిల్లుపై 25 శాతం కమీషన్‌గా తీసుకుని సదరు దళారీ ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు 120 మంది ఉద్యోగులకు బిల్లులు ఇప్పించినప్పటికీ.. 26 మంది మాత్రమే పట్టుబడ్డారని చింతగట్టు క్యాంప్‌లో చర్చించుకుంటున్నారు.
దొంగ బిల్లులతో పాటు నిజంగా చికిత్స పొందిన వారికి సైతం మెడికల్ బిల్లులను ఇప్పించే బాధ్యత కూడా తన భుజాలపై వేసుకుంటాడనే పేరు దళారీగా వ్యహరించిన వ్యాపారికి ఉంది. మొత్తానికి దొంగ మెడికల్ బిల్లుల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన దళారీ వివరాలను పక్కకు తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రముఖ ఆస్పత్రి హస్తం కూడా..
ఫోర్జరీ బిల్లుల కేసులో హన్మకొండలోని ఓ ప్రధాన ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉన్నట్లు.. అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎటువంటి చికిత్స చేయకున్నా చికిత్స జరిగినట్లు బిల్లులు సృష్టించారని.. ఉద్యోగులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులు, ఆస్పత్రి వివరాలు సరిచూడగా ఈ విషయం తేటతెల్లమైందని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
పరారీలో నిందితులు..
విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీని వాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో 18 మంది ఎస్సపారెస్పీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. అయితే.. నిందితులు పరారీలో ఉన్నారు. 20 రోజుల çనుంచి వారు హైదరాబాద్‌లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్సారెస్పీ మెడికల్ స్కాం లో అందిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందని.. ఎస్సారెస్పీ–1 ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేయూసీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment