డోర్నకల్(వరంగల్) : ‘మైనార్టీ తీరకుండానే నాకు వివాహం చేయాలని చూస్తున్నారు.. నాకు చదువుకోవాలని ఉంది. ఈ వివాహాన్ని ఎలాగైనా అడ్డుకోండి సార్’ అంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, బాలికను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసేందుకు సిద్ధం కావడంతో ఆ బాలిక.. చైల్డ్‌లైన్ నంబర్ 1098కు సమాచార మిచ్చింది. దీంతో బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు మంగళవారం గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనార్టీ తీరాకే వివాహం చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. అనంతరం బాలికను సన్మానించారు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది లక్ష్యమని బాలిక తెలిపింది. కాగా, గ్రామంలో మరో బాల్య వివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు.
చదవండి: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ
Comments
Please login to add a commentAdd a comment