కోల్డ్ స్టోరేజీ నుంచి వెలువడుతున్న పొగ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు గాంధీపురం పరిధిలోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా అందులో నిల్వ చేసిన 70వేల బస్తాల మిర్చి, అపరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.30 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు తెలిసింది. కోల్డ్ స్టోరేజీలో అంతర్గతంగా మంటలు చెలరేగి పొగలు కిటికీల గుండా బయటకు వ్యాపించి కనీసం నీళ్లు చల్లేందుకు కూడా వీలు లేని పరిస్థితులు తలెత్తాయి. ఆఖరుకు స్టోరేజీ గోడలకు డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రాలు చేసి కొంత మేరకు మంటలు చల్లార్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న ఫైర్‌సేఫ్టీ కిట్ సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
లక్ష బస్తాల సామర్థ్యం..
మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారులు బ్రిజ్ గోపాల్‌ఝవర్, సిరికిషన్ ముందుడ, తల్లాడ రాంమూర్తి, నాగపూర్‌కు చెందిన రాజుబాయ్ ఆధ్వర్యాన రెండేళ్ల క్రితం ఐదు అంతస్తులతో కూడిన కనకదుర్గ కోల్డ్‌స్టోరేజ్ నిర్మించారు. ఇందులో పలువురు స్టోరేజ్‌లో రైతులు తమ మిర్చి బస్తాలను నిల్వ చేసుకున్నారు. ఇక బుధవారం ఉద యం హమాలీలు ‘సీ’ చాంబర్ వద్ద మిర్చి కాం టాలు పెడుతుండగా మాడువాసన రావడం.. ఆ వెంటనే ఏ, బీ చాంబర్ల నుంచి పొగలు రావడంతో యజమానులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐదో అంతస్తులో ఉండడం వల్ల అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతా నికి వెళ్లి పరిశీలించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అదుపులోకి రాలేదు. విషయం తెలుసుకున్న మానుకోట, డోర్నకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
ఇక ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో మరిపెడ, నర్సం పేట, ఇల్లందుకు చెందిన అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అలాగే, కొంతమేరకు మిర్చి బస్తాలను మరో కోల్డ్ స్టోరేజీలోకి వాహనాల ద్వారా తరలించారు. కోల్డ్‌స్టోరేజీలో మిర్చి నిల్వ చేసుకున్న రైతులు ఘటన స్థలికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే, యజమానిలో ఒకరైన తల్లాడ రాంమూర్తి చిన్న కుమారుడు శ్రీను పొగ వాసనకు అస్వస్థతకు గురయ్యాడు. రైతులకు ఇచ్చిన బాం డ్లు, నిల్వ ఉంచిన సరుకు వివరాల రికార్డులు కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోవడంతో ఎంతమేరకు నష్టం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో పాటు ప్రత్యేకంగా నీటి ని తెప్పించి మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు.
కాగా, ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేఎస్ ఎన్.రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గుండా పోతురాజు, మహ్మద్ ఫరీద్, ముత్యం వెంకన్న, మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్‌జాకీర్, చౌడవరపు రం గన్న, భూక్యా సురేందర్, షఫియోద్దీన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసులు కె.సురేఖ, జి.వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మణ్, రమేష్, ఎస్.రవికుమార్, జె.వెంకటరత్నం, సిరిసిల్ల అశోక్ ఉన్నారు.
ఎందుకు ఆలస్యమైందంటే..
షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో మంటలు అదుపులోకి రాకపోవడానికి గల కారణంపై నిపుణులు ఈ విధంగా స్పందించారు. కోల్డ్ స్టోరేజీలో గోడలకు డాంబర్ పూసి ఉంటుందని.. అమ్మోనియం గ్యాసు ఉంటుందని తెలిపారు. కర్రలపై బస్తాలు ఏర్పాటు చేస్తారని, కూలింగ్ పోకుండా ఉండేందుకు థర్మకోల్ షీట్లు అమరుస్తారని, ఈ కారణాల వల్ల మంటలు ప్రారంభమైనప్పుడు అవి అదుపులోకి రావడం కష్టమవుతుందని చెప్పారు.
నేడు మిర్చి అమ్ముకుందామనుకున్నా...
నేను 102 బస్తాలు (45 క్వింటాళ్ల) మిర్చిని కనకదుర్గ కోల్డ్ స్టోరేజీలో ఐదు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.13వేలు పలుకుతుందని గురువారం అమ్ముకుందామనుకున్నాను. ప్రమాదం జరిగిన చాంబర్‌లో నా మిర్చి బస్తాలు ఉన్నాయి. నాలాగే వందల మంది రైతుల మిర్చికి జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– వీరోజు రమేష్, రైతు, పెత్తాళ్లగడ్డ
Comments
Please login to add a commentAdd a comment