- టీపీసీసీ ఎస్సీ సెల్ శిక్షణ శిబిరంలో పొన్నాల, కొప్పుల రాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విభాగాలు కలసికట్టుగా కృషి చేయాలని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ శిక్షణ శిబిరంలో వారు మాట్లాడారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఎస్సీ విభాగం కృషి చేయాలని, క్రియాశీలకంగా పనిచేసేవారితో మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎ.కృష్ణ అధ్యక్షతన జరిగిన శిబిరానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 238 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రతి మండలం నుంచి కనీసం 10 మంది నాయకులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో దళిత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కనీసం 5వేల మందితో త్వరలో దళిత మహాసభను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అనంతరం ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు విలేకరుల సమావేశంలో ఇవే అంశాలను వివరించారు. శిబిరానికి మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మంత్రి చంద్రశేఖర్, అద్దంకి దయాకర్, గ జ్జల కాంతం తదితరులు హాజరయ్యారు.