సేవానిరతి... చదువుకు హారతి | making best facilities to students | Sakshi
Sakshi News home page

సేవానిరతి... చదువుకు హారతి

Published Wed, Jun 17 2015 4:46 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

సేవానిరతి... చదువుకు హారతి - Sakshi

సేవానిరతి... చదువుకు హారతి

- విద్యార్థుల సేవలో వైశ్య హాస్టల్
- వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు కల్పన
- వందలాది మందికి విద్యా దానం
సాక్షి, సిటీబ్యూరో:
పేదరికం... ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ... చదువుకు దూరమవుతున్న చిన్నారులకు అండగా నిలుస్తోంది కాచిగూడలోని వైశ్య హాస్టల్ ట్రస్ట్ బోర్డు. చదువుతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తనవంతు తోడ్పాటునందిస్తోంది. బోర్డు ఆధ్వర్యంలోని షాపింగ్ క్లాంపెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యార్థుల చదువులకు వెచ్చిస్తూ... వారి బంగారు భవితకు బాటలు వేస్తోంది.  
 
ఇంటర్ నుంచి పీజీ వరకు...
వైశ్య హాస్టల్‌లో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఒక్క వైశ్య విద్యార్థులకే కాకుండా 50 శాతం  ఇతరులకూ అవకాశం కల్పిస్తున్నారు. విశాలమైన భోజన శాల, అన్ని వసతులతో కూడిన చక్కటి ఆడిటోరియం, టీవీ హాలు, మినీ మీటింగ్ హాలు, గ్రంథాలయం, జిమ్, టీటీ హాల్, మినీ డైనింగ్ హాలు, రీడింగ్ రూము వంటి సౌకర్యాలు హాస్టల్‌లో ఉన్నాయి. ఇక్కడ ఉంటూ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు దేశ, విదేశాలలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు.
 
విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు
1965 నుంచి జంట నగరాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లతో పాటు, స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నారు.   వాసవి బుక్ బ్యాంక్ నెలకొల్పి అన్ని తరగతుల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, అవసరమైన కిట్‌లు పంపిణీ చేస్తున్నారు. నర్సింగ్ కోర్సు, డిప్లమో ఇన్ అప్తోమెట్రీ కోర్సుల విద్యార్థులకు పూర్తి ఫీజులను చెల్లిస్తున్నారు. 2013 నుంచి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్,  పర్సనల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తున్నారు. విద్యార్థినులకూ హాస్టల్ వసతి కల్పించారు. వైశ్య హాస్టల్ ట్రస్టు బోర్డు సభ్యులందరం కలిసి ఏ పనికైనా సమైక్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు నడుస్తున్నామని చైర్మన్ కొట్రికె భాస్కర్ గుప్త తెలిపారు.  
 
ఏడున్నర దశాబ్దాలుగా...
సుమారు ఏడున్నర దశాబ్దాలుగా ఈ బోర్డు విద్యా రంగంలో సేవలందిస్తోంది. 1939 జులై 5న ఫీల్‌ఖానాలోని అద్దె భవనంలో ఏడుగురు విద్యార్థులతో... ఉప్పల గౌరీశంకర్ అనే వ్యక్తి ‘వైశ్య హాస్టల్’ను ప్రారంభించారు. 1950లో కార్యనిర్వహణ కమిటీ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కె.ఎన్.గుప్త ఆధ్వర్యంలో దాతల నుంచి విరాళాలు సేకరించి 1951లో కాచిగూడ చౌరస్తాలో సుమారు 8 వేల చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 1963 ఆగస్టు 20న 13 మందితో వైశ్య హాస్టల్ ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. 1982లో 14 గదులతో సొంత భవనాన్ని నిర్మించి.. హాస్టల్‌ను అక్కడికి తరలించారు. ప్రస్తుతం 270 గదులతో 800 మందివిద్యార్థులతో ఆహ్లాదకరవాతావరణంలో హాస్టల్ పని చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement