* క్రెయా లెర్నింగ్ సృజనాత్మక స్టూడియో పాఠాలు
* విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యం
* 18 కోట్ల పెట్టుబడులు పెట్టిన ముంబై సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్లు, కార్లు, సిటీలూ.. అన్నీ ఇపుడు స్మార్టే! గత కొన్నేళ్లలో ప్రపంచంలో ఎన్నో మార్పులు. కానీ క్లాస్ రూమ్ మాత్రం పెద్దగా మారలేదు. బల్లలూ, బోర్డు, చాక్‌పీస్, డస్టర్... అలాగే ఉన్నాయి.
ఇక పరీక్షలూ, ప్రోగ్రెస్ కార్డులతో విద్యా వ్యవస్థలోనూ పాత పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూ హరి కె వర్మ ఏమంటారంటే విద్యార్థి దశలోనే డిజిటలైజేషన్ అలవాటవ్వాలని. అలాగైతేనే ప్రపంచంతో పోటీ పడగలమని చెబుతారాయన. అందుకే ఆయన క్రెయా లెర్నింగ్.కామ్‌ను ఆరంభించారు. విద్యార్థులకు నైపుణ్యాన్ని, సృజనను అలవాటు చేయడానికి స్టూడియో ప్రయోగాలు, పాఠాలను పరిచయం చేస్తున్నారు. తమ సంస్థ గురించి ఇంకా ఆయన ఏమంటారంటే... మొక్కను మనం పెంచలేం.
అవి పెరిగే వాతావరణాన్ని కల్పిస్తాం. అంతే!!. అలాగే పిల్లలకూ మనమేమీ నేర్పించలేం. వారికి వారే నేర్చుకునే వాతావరణాన్ని కల్పించాలంతే. 2011లో క్రెయా లెర్నింగ్‌ను స్థాపించడానికి ముందు దేశంలోని విద్యా వ్యవస్థ తీరుపై నేను, ప్రవీణ్ ఉదయగిరి, వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి అధ్యయనం చేశాం. నగరం, పట్టణం, గ్రామీణ చిన్నారుల్లో విషయ సంగ్రహణ, జ్ఞాపక శక్తుల్లో భారీ వ్యత్యాసం ఉంది. దానికి పరిష్కారం ఆయా ప్రాంతాలకనుగుణంగా పాఠ్య ప్రణాళిక తయారు చేయడం. అప్పుడే పదో తరగతి పూర్తయ్యేలోపు అందరినీ నైపుణ్యమున్న విద్యార్థులుగా చేయగ లం. అదే ఉద్దేశంతో ముగ్గురం కలిసి రూ.80 లక్షల పెట్టుబడితో క్రెయా లెర్నింగ్ సంస్థను స్థాపించాం.
ఇదో ప్రయోగశాల..: పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంచడటమే క్రెయా లెర్నింగ్ పని. ఇందుకోసం గణితం, సాంకేతికత, భౌతిక, సామాజిక శాస్త్రాలకు చెందిన ప్రయోగాల పుస్తకాలను తరగతుల వారీగానే కాక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సిలబస్‌లల్లో వేర్వేరుగా రూపొందించాం. స్టూడియో లెర్నింగ్‌కు అవసరమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ అని పిలిచే (ఎస్‌టీఈఎం) స్టెమ్‌లను కొరియా, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం.
వీటి ద్వారా రొబోటిక్స్, కెమెరా, ఇంజనీరింగ్, ఆడియో వీడియో రికార్డింగ్స్, బ్రిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలను నేర్పిస్తాం. ఉదాహరణకు క్రేన్‌తో భారీ ఓడ నుంచి కార్గోను అన్‌లోడ్ చేయాలనుకోండి. ఈ ప్రయోగంలో క్రేన్, ఓడ, కంటైనర్లు, లారీలు, నిల్వ కేంద్రాలు అవసరం. ఇలాంటి నిజమైన వీడియో దృశ్యాన్ని మొదట పిల్లలకు చూపిస్తాం. తర్వాత ఆ వాహనాలు, అవసరమైన వస్తువులను వారి ముందు ఉంచితే... వాటిలోంచి ఉపయోగపడే వాటిని ఎంచుకునేందుకు మేధోమథనం చేస్తారు. నిర్మాణాత్మక ప్రయోగంతో ఫలితం సాధిస్తారు. చేసిన ప్రయోగాల్ని పుస్తకంలో రాసి తోటివారికి వివరించాలి. విద్యార్థులంతా సమూహంలా పనిచేయడం వల్ల సందేహాలను పరిష్కరించుకోగలుగుతారు.
విదేశీ స్కూళ్లలోనూ...
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 10 స్కూళ్లతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 65 పాఠశాలల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులకు క్రియా లెర్నింగ్ స్టూడియో ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. హైదరాబాద్‌లో సమష్టి, గాంగ్స్ వ్యాలీ, గీతాంజలి, నీరజ్ వంటి అంతర్జాతీయ పాఠశాలలతో పాటు ఈ సంవత్సరం హెదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలోనూ ఇది అందుబాటులోకి వస్తోంది. నేపాల్, అబుదాబి, దుబాయ్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో 90 పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్‌ను విస్తరిస్తున్నాం. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్రియా లెర్నింగ్ విద్యనందించేందుకు విద్యా శాఖను సంప్రదించాం. అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాం.
ఆన్‌లైన్, రిటైల్ మార్కెట్లోకీ..
పాఠశాలలకే పరిమితమైన క్రియో లెర్నింగ్ పాఠాలను తమ పిల్లలకు ఇంట్లోనే నేర్పించాలని చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ ఏడాది ముగింపు కల్లా మా పాఠాల్ని ఆన్‌లైన్, రిటైల్ మార్కెట్లోకి తెస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 36 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ సంస్థ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 2014 సంవత్సరానికి రూ.14 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. స్టూడియో లెర్నింగ్ బోధనకు ఏడాదికి ఒకో విద్యార్థికి రూ.1,800 చార్జి చేస్తాం. పిల్లల్లో నైపుణ్యం మెరుగుదలపై 2 నెలలకొకసారి మా బృందం వెళ్లి పర్యవేక్షిస్తుంది కూడా.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
పిల్లలిక సాకులు చెప్పలేరు!
Published Sat, Apr 18 2015 12:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement