టీఆర్‌ఎస్ ఆఫీసుగా అసెంబ్లీ
♦ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అధికారపక్షం పని అని విమర్శ
♦ బడ్జెట్ కేటాయింపుల్లో 30–40 శాతం కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని టీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చారని సీఎల్పీ ఉప నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల గొంతునొక్కడానికే అధికార టీఆర్‌ఎస్ పనిచేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, వట్టి మాటలతోనే సభను మొక్కుబడిగా పూర్తి చేశారని దుయ్య బట్టారు. బడ్జెట్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో 30–40 శాతం కూడా ఖర్చు చేయకుండా, కేవలం అంకెల్లో మాయా జాలం చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కేటాయింపుల్లేవని ధ్వజ మెత్తారు. ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడి తోనే కేజీ టు పీజీ అమలుచేయడం లేదని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం దురదృష్టకర మన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కొత్త విద్యుత్ ప్రాజెక్టు రాలేదని, ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కొత్తగా కూడా ఉత్పత్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో నియం తృత్వ ప్రభుత్వం నడుస్తున్నదని, ప్రతిపక్షాలను నిరంకుశంగా గొంతునొక్కుతున్నారని భట్టి విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిపై చర్చించకుండా అసెంబ్లీ సమావే శాలను ప్రభుత్వం ముగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలను సాగులోకి తెస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీలేదన్నారు. ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేస్తున్న దొకటని ఆయన విమర్శించారు.