సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై చర్చిద్దామన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, చట్ట సభలను బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ శాసన సభ సమావేశాలు ఏక పక్షంగా జరిగాయని ధ్వజమెత్తారు. ఒక రోజు సంతాప తీర్మానం పోగా, మిగతా మూడు రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీని దూషించడానికే అధికార పార్టీ ఎక్కువ సమయం తీసుకుందన్నారు. ప్రజల సమస్యలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కిందని మండిపడ్డారు.
శాసనసభ సమావేశాలు ఈ ఏడాది 60 రోజుల పాటు జరగాల్సి ఉండగా 11 రోజులే జరిపి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని భట్టి నిప్పులు చెరిగారు. దేశంలో అతి తక్కువ రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నమోదు అవుతుందన్నారు. సభలో సీఎం రెండు గంటల పాటు మాట్లాడినా కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికే సరిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశాం? ఏం చేయబోతున్నాం? అన్నది చెప్పకుండా గాలికి వదిలేశారని, కొత్త ఉద్యోగాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, కృష్ణా, గోదావరి నదీ జలాలు, సింగరేణి విషయాన్ని గాలికి వదిలేశారన్నారు.
చట్టసభలను బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి బల్లలపై చప్పుడు చేస్తూ, స్లోగన్స్ ఇస్తూ, కొనసాగిన ఉపన్యాసాలు చూసినప్పుడు సీనియర్ శాసనసభ్యుడిగా ఆవేదన కలిగిందన్నారు. ప్రజాసమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పొదేం వీరయ్య, సీతక్కలు ప్రయత్నం చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment