బక్కచిక్కిన బాల్యం
- ఆందోళన కలిగిస్తున్న పౌష్టికాహార లోపం
- తక్కువ బరువుతో జన్మిస్తున్న 19% పిల్లలు
- ఐదేళ్లలోపు చిన్నారుల్లో 22% పౌష్టిక సమస్య
- 71% పిల్లల్లో రక్తహీనత లక్షణాలు
సాక్షి, హైదరాబాద్: భావిపౌరుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. పౌష్టికాహార లోపం వారి భవిష్యత్తును ప్రమా దంలో పడేస్తోంది. జనన సమయంతోనే మొదలవుతోన్న ఈ సమస్య.. వారిపై పలు విధాలుగా ప్రభావాన్ని చూపు తోంది. రాష్ట్రంలో సగటున 19% పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తుండగా... 22% చిన్నారులు పౌష్టికాహార సమస్యతో సతమతమవుతున్నారు.
ఈ నెల తొలి వారంలో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పౌష్టికాహార సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 37,500 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 3,15,886 మంది పిల్లలు నమోదు కాగా... క్రమం తప్పకుండా కేంద్రాలకు వస్తున్న పిల్లలు సగం మందే. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు అంగ న్‌వాడీ కేంద్రాలకు వచ్చిన పిల్లల ఆరోగ్య స్థితిని పరిశీలిం చారు. ఇందులో భాగంగా ఎత్తు, బరువు తదితర పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 1,66,229 పిల్లలకు ఈ పరీక్షలు చేశారు. వీరిలో 85,007 మంది బాలురు, 81,222 మంది బాలికలున్నారు.
ప్రమాదంలో 31.42% చిన్నారులు
శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పరిశీలనలో ప్రాథమిక గణాంకాల ప్రకారం 31.42% చిన్నారుల ఆరోగ్య స్థితి ప్రమాదకరంగా ఉంది. వీరిలో ఎక్కువ శాతం ఎత్తుకు తగిన బరువు లేకపోవడం గమనార్హం. 10.79% చిన్నారులు సగటు బరువు కన్నా అతి తక్కువగా ఉన్నారు. 1,66,229 మంది పిల్లలను పరిశీలించగా వీరిలో 45,278 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపం ఉండగా.. ఇందులో 17,944 మంది పిల్లల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపానికి గురవుతున్న పిల్లలకు సంబంధించి ఎక్కువ భాగం తల్లుల ఆహారపు అలవాట్లే ప్రభావం చూపుతున్నాయి.
అన్ని సమయాల్లో ఒకే ఆహారమా..!
గ్రామీణ మహిళల్లో ఆహారపు అలవాట్లు గందరగోళంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంత పేద మహిళలు గర్భిణి దశకు ముందు తీసుకునే ఆహారాన్నే గర్భస్థ సమయంలో, పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ తీసుకుంటున్నారు. సాధారణ సమయాల్లో కంటే గర్భిణిగా ఉండేటప్పుడు మహిళలకు ఎక్కువ పోషకాలు అవసరం. అదేవిధంగా పాలిచ్చే తల్లులు సైతం ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. కానీ పేద మహిళలు అలా తీసుకోకపోవడంతో వారి తర్వాత తరం పిల్లలు బలహీనంగా పెరుగుతున్నారు. వంద మంది చిన్నారుల్లో 71 శాతం మందిలో రక్తహీనత లక్షణాలు బయటపడటం గమనార్హం.