
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆన్‌లైన్ సేవలకు ‘మాల్‌వేర్’ దెబ్బ తగిలింది. ఐదు రోజుల క్రింతం గుర్తు తెలియని వ్యక్తి హెచ్‌ఎండీఏ సంస్థకు చెందిన ఓ అధికారి జీమెయిల్ స్పామ్‌కు కి పంపించిన ‘మాల్‌వేర్’ను నొక్కడంతో ఆ సంస్థ అందిస్తున్న డీపీఎంఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల డాటా ఎన్‌క్రిప్ట్ (తెరుచుకోకపోవడం) అయింది. దీంతో సేవలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయాయి. సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్ సేవలను నిలిపివేస్తున్నామని పదో తేదీన ప్రకటించిన అధికారులు.. తిరిగి 16వ తేదీ నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే ఇంతవరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం నుంచి సేవలు తిరిగి ప్రారంభించే అవకాశం లేదు. దీంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా హెచ్‌ఎండీఏ డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్), లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) సేవల ప్రక్రియను నిలిపివేస్తామని ప్రకటించిన అధికారులు ఆ సమస్యను పరిష్కరించేందుకు నానాతంటాలు పడుతున్నారు.
మరో ఐదు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని కొంత మంది అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే స్టేట్ డాటా సెంటర్‌లోని సెక్యూరిటీ ఆపరేటర్ సెంటర్‌కు ఆన్‌లైన్‌లో తెరుచుకోలేకపోతున్న అన్ని దరఖాస్తుల ఎన్‌క్రిప్ట్‌లను పంపిస్తే పరిశోధిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు హెచ్‌ఎండీఏ ఉపయోగిస్తున్న సిమెంటస్ యాంటీ వైరస్ సిస్టమ్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికాలోని సంస్థకు హ్యాక్ అయిన డాటాను మొత్తం పంపించామని, సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. అయితే ఈ నెల తొమ్మిదో తేదీ వరకు డాటాను బ్యాకప్ చేసి ఉండడంతో ఎటువంటి ఆందోళన వద్దని ఐటీ సెల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆరు రోజులు ఆన్‌లైన్ సేవలు లేకపోవడం, మరో ఐదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుండడంతో దాదాపు రూ.పది కోట్ల ఆదాయానికి గండిపడినట్టేనని అధికారులు అంటున్నారు.
ఉప్పల్ భగాయత్ వేలానికీ బ్రేక్...
ఉప్పల్ భగాయత్ ప్లాట్లను ఆన్‌లైన్ వేలంలో విక్రయించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 9వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే జరిగిన ఈ మాల్‌వేర్ వైరస్ దెబ్బకు ప్లానింగ్ అధికారులు వెనక్కి తగ్గారు. ఉప్పల్ భగాయత్ గ్రామంలోని కొన్ని సర్వే నంబర్లలోని 67 ప్లాట్ల విక్రయాన్ని అంతా కుదురుకున్నాక చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ప్లాట్ల అమ్మకాల ద్వారా దాదాపు రూ.500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించిన అధికారులు మాల్‌వేర్ వైరస్ దెబ్బతో ఆలోచనలో పడ్డారు. సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆన్‌లైన్ వేలానికి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
సమీపిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌క్లియరెన్స్ గడువు
ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ గడువు ఈ నెలాఖరు 31వ తేదీ కావడంతో దరఖాస్తుదారులు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. ఇన్నాళ్లు మాస్టర్ ప్లాన్‌లో క్షేత్రస్థాయి పరిశీలనకు సిబ్బందికి వెళ్లడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ నిలిచిపోయింది. ఇప్పుడు సాంకేతిక సమస్య కారణంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికితోడు ఎల్‌ఆర్‌ఎస్‌లో నీటిపారుదల శాఖ ఎన్‌ఓసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా భేటీ కాకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈసారైనా తమ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్ అవుతాయా అంటూ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఆరా తీస్తున్నారు. తాజాగా సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో దరఖాస్తుదాల ఆందోళన వర్ణనాతీతంగా మారింది.
ఐటీపై అవగాహన అవసరం
డీపీఎంఎస్ సేవలు అందిస్తున్న సాఫ్‌టెక్ సంస్థతో పాటు ఐటీ అధికారులు ఆన్‌లైన్ ఫైళ్లు కరప్ట్ కాకుండా ఉండేందుకు యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. దీంతో పాటు హెచ్‌ఎండీఏ సిబ్బందికి కూడా సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులు, సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై జాగృతి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది సిబ్బందికి టెక్నికల్ అవగాహన లేక ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహకారంతోనే ఫైళ్లు క్లియర్ చేస్తుండడం వారి పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పంపిన మాల్‌వేర్ వైరస్‌తో ఇప్పుడు ఏకంగా హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ సేవలన్నీ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనుంచైనా ప్లానింగ్ సిబ్బందికి ఐటీ విభాగం అవగాహన కలిగించి దరఖాస్తుదారులకు సక్రమ సేవలు అందించేలా చేయాలని డిమాండ్ హెచ్‌ఎండీఏ వర్గాల్లోనే వినిపిస్తోంది.