భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన కోవూరి సుదర్శన్(35), అనిత దంపతులు. సుదర్శన్ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా దంపతులు గొడవపడుతున్నారు. ఈక్రమంలో ఈ నెల 23న భర్తతో గొడవపడిన అనిత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో సుదర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా అదే రోజున సుదర్శన్ కూడా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
ఇదిలా ఉండగా శామీర్‌పేట్ పరిధిలోని సెయింట్ పాల్స్ స్కూల్ సమీపంలోని ఓ పాడుబడిన గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా ఓ వ్యక్తి గదిలో ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడిని శామీర్‌పేట్‌కు చెందిన కోవూరి సుదర్శన్‌గా గుర్తించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన అతడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.