షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యాపారస్తుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్వరనగర్‌కు చెందిన శామర్తి రమేష్(60) ఎన్నో ఏళ్లుగా పట్టణంలో ఫైనాన్స్‌తో పాటు చిట్టీలు నిర్వహిస్తున్నాడు. నమ్మకస్తుడైన వ్యాపారిగా, సౌమ్యుడిగా పేరున్న రమేష్ కొందరికి చిట్టీ డబ్బులు బాకీ పడ్డాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావటంతో మనస్తాపం చెందిన రమేష్ మంగళవారం ఉదయం ఎడమ మణికట్టును కత్తితో కోసుకున్నాడు. పనిమనిషి ఇంటికి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ కనిపించాడు. ఇరుగు పొరుగు వారు వచ్చేలోగా రమేష్ ప్రాణాలొదిలాడు. అతని ఇద్దరు కుమారులు వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్నారు. వారం క్రితం రమేష్ భార్య కుమారుల వద్దకు వెళ్లింది. తన మరణానికి ఎవరూ కారణం కాదని రమేష్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.