రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాహుల్ ఇన్‌సెట్ రాహుల్ (ఫైల్ )
తాండూర్(బెల్లంపల్లి) మంచిర్యాల : మరో రెండు రోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంటిపై విధి కన్నెర్ర జేసింది. బంధుమిత్రులు, సన్నిహితులతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు యువకుడి ప్రాణాన్ని కబలించడంతో ఆ ఇంట్లో కన్నీళ్లే మిగిలాయి. తాండూర్ మండలంలోని రేచిని రైల్వేస్టేషన్ కోల్‌యార్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివరాత్రి రాహుల్ (19) అనే యువకుడు మృతి చెందడంతో తాండూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశ్వరి–రామస్వామి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రాహుల్ ఉన్నారు. రామస్వామి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ నెల 9న వారి పెద్ద కుమార్తె మౌనిక వివాహం జరగాల్సి ఉంది. ఈ పెళ్లి శుభలేఖలను పంచేందుకు రాహుల్ సోమవారం బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రేచిని కోల్‌యార్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఐచర్ వ్యాన్ వేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రాహుల్ తలకు తీవ్ర గాయాలు కాగా ప్రశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన రాహుల్‌ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. రాహుల్ బెల్లంపల్లి ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు తాండూర్ ఎస్సై రవి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మిన్నంటిన రోదనలు
రాహుల్ అకాల మరణంతో పెళ్లి ఇంట్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. భర్త రామస్వామి కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment