కాజీపేట : దక్షిణాయణంలో ఉత్తమమైనవి శ్రావణం, కార్తీక మాసాలు. ఈ రెండు మాసాలను చాలా మంది పవిత్రంగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, గృహప్రవేశాలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఆషాఢ అమావాస్య(శనివారం) ఘడియలు ముగియగానే.. ఆదివారం నుంచి శ్రావణ మాసం సందడి మొదలయ్యింది. దీంతో చాలా ఇళ్లలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.
15 నుంచి అన్నీ ముహూర్తాలే...గత నెల ఆరో తేదీతో ముహూర్తాలు ముగిశాయి. అప్పటి నుంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఇతర శుభకార్యాలు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నెల 15నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో శుభ కార్యాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెలలో అత్యధికంగా వివాహ ముహూర్తాలతో పాటు గృహ ప్రవేశాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి.
ఈ నెల 15, 16, 17, 18, 19, 25, 26, 28, 30 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అత్యధిక పెళ్లిళ్లు ఈ నెల 25, 26 తేదీల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని రోజుల్లో గృహ ప్రవేశాలకు కూడా మంచి ఘడియలు ఉన్నాయి. 15 నుంచి సెప్టెంబర్ 3 వరకు అనీ మంచి రోజులే అని పండితులు చెప్తున్నారు. 10వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు మళ్లీ శూన్య మాసం కావడంతో నెల రోజులపాటు శుభకార్యాలు జరగవు. దీంతో ఆగస్టులోనే అధిక సంఖ్యలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు.
మండపాలు, పురోహితులకు మహా గిరాకీ...ఇప్పటికే చాలా మంది ముహూర్తాలు పెట్టుకోవడంతో జిల్లాలోని మండపాలన్నీ బుక్ అయిపోయాయి. వేదపండితులు, వంట సామాన్లు, టెంట్‌హౌస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వరలక్ష్మీ వ్రతం కూడా ఈ నెలలోనే ఉండడంతో వస్త్ర, బంగారు, కిరాణ, పండ్ల దుకాణాలకు మంచి వ్యాపారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment