Marriages season
-
ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి. వివాహం.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం ఉండేలా.. తమ హృదిలో ఆ మధుర స్మృతులు పదిలంగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నేటి యువత. దీనికి ప్రేమికుల రోజుకంటే మంచిరోజు ఏముంటుంది. ప్రేమికుల రోజు సాక్షిగా వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు జంటలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 14న కృష్ణాజిల్లా వ్యాప్తంగా వేల ముహుర్తాలు ఉండడమే దానికి తార్కాణం. సాక్షి, కోడూరు(అవనిగడ్డ): మాఘమాసంలో శుభకార్యాలకు కొదవుండదు. జనవరి 25 నుంచి మాఘమాసం ప్రారంభం కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నెలకొంది. అయితే ఈ నెల 13,14,15 బలమైన సుముహూర్తాలు ఉండడంతో ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, నూతన వస్త్రాల బహూకరణ, ఉపనయనం, అన్నప్రాసనలకు ఈ మూడు రోజులు శుభదినాలుగా పండితులు చెబుతున్నారు. వాలెంటైన్స్ డే రోజే వివాహం.. ఈ మూడు రోజుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కూడా కావడంతో ఈ రోజున పెళ్లిలఘ్నాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేమికుల రోజున పెళ్లి చేసుకుంటే జీవితకాలం తమకు ఆతేదీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుందనే ఆలోచనతో యువత ఆరోజున పెళ్లి చేసుకొనేందుకు ఇష్టం చూపుతున్నారు. దీంతో 14న తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని కల్యాణమండలాలు ఒక నెలరోజుల ముందే బుక్ అయిపోయినట్లు సమాచారం. ఈ మూడు రోజుల పాటు శుభకార్యాలకు కొదవలేకపోవడంతో 90శాతానికి పైగా కల్యాణమండపాలు, ప్రైవేటు అసోసియేషన్ భవనాలు బుక్ అయిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రెట్టింపైన పెళ్లి ఖర్చు ! ప్రస్తుతం వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో కల్యాణమండలపాల నిర్వాహకులు, బాజా భజంత్రీలు వారు తమ రేట్లు పెంచేశారు. డెకరేషన్, సౌండ్సిస్టమ్స్, లైటింగ్ నిర్వాహకులు, పండితులు కూడా రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఫొటోగ్రాఫర్లకు కూడా మంచి గిరాకీ ఏర్పడింది. అయితే జీవితంలో వివాహఘట్టం జరిగేది ఒకసారి కావడంతో ఖర్చులకు ఎక్కడా వెనుకాడడం లేదు. బంగారం షాపులు, పచారీ, వస్త్ర దుకాణాలు, కూరగాయల, పూలదుకాణాలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. కోడూరులో సిద్ధమైన ఒక కల్యాణ మండపం వేదిక -
మూడు ముళ్లు.. మూడు తేదీలు
సాక్షి, నరసన్నపేట : మూఢం ముంచుకొస్తోంది. వివాహాది శుభకార్యాలు జరుపుకునే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ముహూర్తాల్లోనే వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనేందుకు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. కల్యాణ మండపాలు ఖాళీ లేవు. శుభకార్యక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. మార్చి నుంచి వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నెల 27 వతేదీ చివరి ముహూర్తం. ఆ తర్వాత శుక్ర మూఢం కారణంగా మరో మూడు నెలల పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో శుభకార్యాలు చేసుకోలేని వారు ఆశ్వయుజ మాసమైన అక్టోబర్ 2 వరకూ వేచి ఉండాల్సిందే. ఈ మూఢమి కాలం ముగిసే వరకూ పెళ్లి వారితో పాటు పురోహితులు, కేటరింగ్, పూలు, మండపాలు డెకరేషన్ చేసేవారూ, కల్యాణ మండపాల యజమానులు నిరీక్షించక తప్పదు. మరో మూడు నెలలు శుభ కార్యాక్రమాలకు ముహూర్తాలు లేక పోవడంతో శుభకార్యాలుఈ నెల 27 లోగా ముగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతటా హడావుడి నెలకొంది. వస్త్ర, బంగారు దుకాణాల్లో రద్దీ నెలకొంది. మండపాల డెకరేషన్, పురోహితులు బిజీబిజీగా కనిపిస్తున్నారు. శ్రావణ మాసంలోనూ శూన్యమే జూలై నెల ఆషాఢం కావడంతో అది శూన్యమా సం. ఆ తర్వాత వచ్చేది ఆగస్టు (శ్రావణమాసం) లో ఏటా వివాహాది శుభ కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు గతంలో ఉండేవి. ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢం వచ్చి చేరింది. అలాగే సెప్టెంబర్ (భాద్రపద మాసం) కూడా శూన్యమాసమైంది. దీంతో వరుసగా ఈ మూడు నెలలు శుభకార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. తిరిగి అక్టోబర్ 2 నుంచి శుభ ముహూర్తాలు ఉన్నట్లు సత్యవరాగ్రహరానికి చెందిన ప్రముఖ పురో హితులు జోష్యుల సంజీవ శర్మ, ఆకేళ్ల సుబ్రహ్మణ్యంలు తెలిపారు. -
మోగనున్న పెళ్లి భాజా..
కాజీపేట : దక్షిణాయణంలో ఉత్తమమైనవి శ్రావణం, కార్తీక మాసాలు. ఈ రెండు మాసాలను చాలా మంది పవిత్రంగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, గృహప్రవేశాలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఆషాఢ అమావాస్య(శనివారం) ఘడియలు ముగియగానే.. ఆదివారం నుంచి శ్రావణ మాసం సందడి మొదలయ్యింది. దీంతో చాలా ఇళ్లలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. 15 నుంచి అన్నీ ముహూర్తాలే...గత నెల ఆరో తేదీతో ముహూర్తాలు ముగిశాయి. అప్పటి నుంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఇతర శుభకార్యాలు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నెల 15నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో శుభ కార్యాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెలలో అత్యధికంగా వివాహ ముహూర్తాలతో పాటు గృహ ప్రవేశాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ నెల 15, 16, 17, 18, 19, 25, 26, 28, 30 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అత్యధిక పెళ్లిళ్లు ఈ నెల 25, 26 తేదీల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని రోజుల్లో గృహ ప్రవేశాలకు కూడా మంచి ఘడియలు ఉన్నాయి. 15 నుంచి సెప్టెంబర్ 3 వరకు అనీ మంచి రోజులే అని పండితులు చెప్తున్నారు. 10వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు మళ్లీ శూన్య మాసం కావడంతో నెల రోజులపాటు శుభకార్యాలు జరగవు. దీంతో ఆగస్టులోనే అధిక సంఖ్యలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. మండపాలు, పురోహితులకు మహా గిరాకీ...ఇప్పటికే చాలా మంది ముహూర్తాలు పెట్టుకోవడంతో జిల్లాలోని మండపాలన్నీ బుక్ అయిపోయాయి. వేదపండితులు, వంట సామాన్లు, టెంట్హౌస్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వరలక్ష్మీ వ్రతం కూడా ఈ నెలలోనే ఉండడంతో వస్త్ర, బంగారు, కిరాణ, పండ్ల దుకాణాలకు మంచి వ్యాపారం జరుగనుంది. -
ఎనీటైం నో మనీ
టెక్కలిలో కృష్ణారావుకి రూ.10 వేలు అవసరమయ్యాయి. వెంటనే ఏటీఎంకి వెళ్లాడు. ఫలితం లేదు. ఆ ఏటీఎంలో డబ్బులు లేవని తేలింది. మరో ఏటీఎంకి వెళ్లినా అదే అనుభవం ఎదురైంది. చెమటలు పట్టాయి. జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని మిత్రులు ఫోన్లో చెప్పారు. ఇప్పుడు జిల్లాలో కరెన్సీ సమస్య ఏర్పడింది. ఏటీఎంలను ఈ సమస్య కుదిపేస్తోంది. బ్యాంకుల్లో జనం బారులు తీరుతున్నారు. ప్చ్..అయినా ఏం ప్రయోజనం..అక్కడా అదే పరిస్థితి ఎదురవుతోంది . ♦ జిల్లాలో కరెన్సీ కష్టాలు ♦ ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ కరెన్సీ కొరత ♦ అసలే పెళ్లిళ్ల సీజను ♦ ఖాతాదారులకు తప్పని కష్టాలు ♦ రిజర్వు బ్యాంకును కోరిన బ్యాంకర్లు ♦ 10 రోజుల్లో నగదు వస్తుందంటున్న బ్యాంకర్లు శ్రీకాకుళం టౌన్: జిల్లాలో పది రోజులుగా కరెన్సీ నోట్లు కరువయ్యాయి. ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనే ఇదే పరిస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు కావాలంటే అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 281 బ్యాంక్ శాఖలు పనిచేస్తున్నాయి. దీనిపరిధిలో 240 ఏటిఎంలున్నాయి. ఒక్కో ఏటిఎం నుంచి రోజుకు రూ.15లక్షల వంతున నగదును తీసుకుంటున్నారు. ఇలా రోజూ రూ.36కోట్లు విత్డ్రాయల్స్ జరుగుతున్నాయి. నెల ఆరంభంలో ఎక్కువ లావాదేవీలుంటాయి. * ఆ మొత్తాలను డిపాజిట్ల రూపంలో తిరిగి బ్యాంకుల్లో జమ చేస్తుంటే వాటిని చలామనీలోకి తీసుకురావడం బ్యాంకర్లకు అలవాటు. జిల్లాలో ఎప్పుడు లేని విధంగా బ్యాంక్ శాఖలతో పాటు ఏటిఎంల్లో కూడా నగదు లేకుండా పోయింది. * దీంతో వినియోగదారులు ఇబ్బందులు గురవుతున్నారు. * గత నెలరోజులుగా ధాన్యం లావాదేవీలకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ రైతులకు రూ.250 కోట్లుచెక్కుల రూపంలో చెల్లించింది. వీరంతా ఒకేసారి ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నారు. * ఉపాధి పనులకు, నీరు చెట్టు పనులకు ఇతర గ్రామీణ రోడ్లకు రూ.కోట్లు చెల్లించారు. ఆర్ఆండ్బిశాఖలో గత వారం రోజులుగా రూ.42కోట్లు చెల్లింపులు జరిగాయి. * పంచాయితీరాజ్లో రూ.68కోట్లు చెల్లించారు. * వంశధార, జలవనరుల శాఖ పనులకు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయి. * ఇసుక టెండర్లకు సుమారు రూ.4కోట్లు బిడ్లు రూపంలో నిలిచిపోయింది. * ప్రతినె లా మొదటి వారంలో పెన్షన్లకు జిల్లా వ్యాప్తంగా రూ.30కోట్లు చెల్లించాల్సి వుంటుంది. * ఉద్యోగుల జీతాలకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ల రూపంలో మరో రూ.72కోట్లు చెల్లించాల్సి వుంటుంది. * ఐసీడీఎస్లకు ఈనెలలోనే రూ.19కోట్లు బడ్జెట్ విడుదలయ్యింది. * ఇతర వ్యాపార అవసరాలకు పెద్ద ఎత్తున ఒకేసారి చేతులు మారడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాఘమాసంలో వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. వీరంతా ఇతర జిల్లాలకు వెళ్లి కొనుగోళ్ళు చేస్తుండడంతో ఇక్కడ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయని ఒక బ్యాంకరు చెబుతున్నారు. వారంరోజుల్లో ఆర్బీఐ నుంచి నగదు ఏటిఎంలతో పాటు బ్యాంకు కస్టడీల్లో కుడా నగదు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి భువనేశ్వర్ నుంచి కుడా నగదు తెచ్చినప్పటికీ భారీగా విత్డ్రా జరిగింది. తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి సంఖ్య తక్కువుగా వుంది. అందువల్లే ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజుల్లోగా ఆర్బిఐ నుంచి నగదు రానుంది. అందుకోసం స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా, ఆంధ్రాబ్యాంక్ ఇండెంట్లు ఇచ్చాయి. -లీడ్బ్యాంక్మేనేజర్ రామిరెడ్డి ఇలాగైతే కష్టమే... కొంతకాలంగా బ్యాంకులో జీతాన్ని తీయకుండా దాచుకుని ఇప్పుడు అవసరమని బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. విత్ డ్రాలు తీసుకుని టోకెన్ ఇస్తున్నారు. అత్యవసరమని చెప్పినా పని జరగడం లేదు. ఈసమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో.. - కోల మురళి, టీపీఎం స్కూల్ దగ్గర, శ్రీకాకుళం ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. ఫిబ్రవరిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి డబ్బుల కొరత తీరుతుందో లేదో. బ్యాంకర్లను అడిగితే ఏం చేయలేమని చెపుతున్నారు. రూ.లక్షల పైబడి డబ్బులు కావాలంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఇలాగైతే ఆర్థిక లావాదేవీలు జరగడం లేదు. - బడ్డీరు శ్రీనివాసరావు, గ్యాస్ వ్యాపారి