ఎనీటైం నో మనీ
టెక్కలిలో కృష్ణారావుకి రూ.10 వేలు అవసరమయ్యాయి. వెంటనే ఏటీఎంకి వెళ్లాడు. ఫలితం లేదు.
ఆ ఏటీఎంలో డబ్బులు లేవని తేలింది. మరో ఏటీఎంకి వెళ్లినా అదే అనుభవం ఎదురైంది. చెమటలు పట్టాయి.
జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని మిత్రులు ఫోన్‌లో చెప్పారు.
ఇప్పుడు జిల్లాలో కరెన్సీ సమస్య ఏర్పడింది. ఏటీఎంలను ఈ సమస్య కుదిపేస్తోంది.
బ్యాంకుల్లో జనం బారులు తీరుతున్నారు. ప్చ్..అయినా ఏం ప్రయోజనం..అక్కడా అదే పరిస్థితి ఎదురవుతోంది .
♦ జిల్లాలో కరెన్సీ కష్టాలు
♦ ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ కరెన్సీ కొరత
♦ అసలే పెళ్లిళ్ల సీజను
♦ ఖాతాదారులకు తప్పని కష్టాలు
♦ రిజర్వు బ్యాంకును కోరిన బ్యాంకర్లు
♦ 10 రోజుల్లో నగదు వస్తుందంటున్న బ్యాంకర్లు
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో పది రోజులుగా కరెన్సీ నోట్లు కరువయ్యాయి. ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనే ఇదే పరిస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు కావాలంటే అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 281 బ్యాంక్ శాఖలు పనిచేస్తున్నాయి. దీనిపరిధిలో 240 ఏటిఎంలున్నాయి. ఒక్కో ఏటిఎం నుంచి రోజుకు రూ.15లక్షల వంతున నగదును తీసుకుంటున్నారు. ఇలా రోజూ రూ.36కోట్లు విత్‌డ్రాయల్స్ జరుగుతున్నాయి. నెల ఆరంభంలో ఎక్కువ లావాదేవీలుంటాయి.
* ఆ మొత్తాలను డిపాజిట్ల రూపంలో తిరిగి బ్యాంకుల్లో జమ చేస్తుంటే వాటిని చలామనీలోకి తీసుకురావడం బ్యాంకర్లకు అలవాటు. జిల్లాలో ఎప్పుడు లేని విధంగా బ్యాంక్ శాఖలతో పాటు ఏటిఎంల్లో కూడా నగదు లేకుండా పోయింది.
* దీంతో వినియోగదారులు ఇబ్బందులు గురవుతున్నారు.
* గత నెలరోజులుగా ధాన్యం లావాదేవీలకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ రైతులకు రూ.250 కోట్లుచెక్కుల రూపంలో చెల్లించింది. వీరంతా ఒకేసారి ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నారు.
* ఉపాధి పనులకు, నీరు చెట్టు పనులకు ఇతర గ్రామీణ రోడ్లకు రూ.కోట్లు చెల్లించారు. ఆర్‌ఆండ్‌బిశాఖలో గత వారం రోజులుగా రూ.42కోట్లు చెల్లింపులు జరిగాయి.
* పంచాయితీరాజ్‌లో రూ.68కోట్లు చెల్లించారు.
* వంశధార, జలవనరుల శాఖ పనులకు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయి.
* ఇసుక టెండర్లకు సుమారు రూ.4కోట్లు బిడ్‌లు రూపంలో నిలిచిపోయింది.
* ప్రతినె లా మొదటి వారంలో పెన్షన్లకు జిల్లా వ్యాప్తంగా రూ.30కోట్లు చెల్లించాల్సి వుంటుంది.
* ఉద్యోగుల జీతాలకు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ల రూపంలో మరో రూ.72కోట్లు చెల్లించాల్సి వుంటుంది.
* ఐసీడీఎస్‌లకు ఈనెలలోనే రూ.19కోట్లు బడ్జెట్ విడుదలయ్యింది.
* ఇతర వ్యాపార అవసరాలకు పెద్ద ఎత్తున ఒకేసారి చేతులు మారడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాఘమాసంలో వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. వీరంతా ఇతర జిల్లాలకు వెళ్లి కొనుగోళ్ళు చేస్తుండడంతో ఇక్కడ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయని ఒక బ్యాంకరు చెబుతున్నారు.
వారంరోజుల్లో ఆర్‌బీఐ నుంచి నగదు
ఏటిఎంలతో పాటు బ్యాంకు కస్టడీల్లో కుడా నగదు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి భువనేశ్వర్ నుంచి కుడా నగదు తెచ్చినప్పటికీ భారీగా విత్‌డ్రా జరిగింది. తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి సంఖ్య తక్కువుగా వుంది. అందువల్లే ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజుల్లోగా ఆర్‌బిఐ నుంచి నగదు రానుంది. అందుకోసం స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా, ఆంధ్రాబ్యాంక్ ఇండెంట్లు ఇచ్చాయి.
-లీడ్‌బ్యాంక్‌మేనేజర్ రామిరెడ్డి
ఇలాగైతే కష్టమే...
కొంతకాలంగా బ్యాంకులో జీతాన్ని తీయకుండా దాచుకుని ఇప్పుడు అవసరమని బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. విత్ డ్రాలు తీసుకుని టోకెన్ ఇస్తున్నారు. అత్యవసరమని చెప్పినా పని జరగడం లేదు. ఈసమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో..
- కోల మురళి, టీపీఎం స్కూల్ దగ్గర, శ్రీకాకుళం
ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే..
ఫిబ్రవరిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి డబ్బుల కొరత తీరుతుందో లేదో. బ్యాంకర్లను అడిగితే ఏం చేయలేమని చెపుతున్నారు. రూ.లక్షల పైబడి డబ్బులు కావాలంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఇలాగైతే ఆర్థిక లావాదేవీలు జరగడం లేదు.
- బడ్డీరు శ్రీనివాసరావు, గ్యాస్ వ్యాపారి