అంతుచిక్కని ప్రశ్నలెన్నో!
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతిపై సందేహాలు
- అది హత్యా.. ఆత్మహత్యా అనే అనుమానాలు
- ఎస్సై సూసైడ్‌నోట్ రాసినట్లుగా చెబుతున్న బంధువులు
- గజ్వేల్ ఏసీపీ దానిని మాయం చేశారంటూ ఆరోపణలు
- కేసును పక్కదారి పట్టించేందుకే తెరపైకి శిరీష వ్యవహారం!
- విచారణకు ఇద్దరు అధికారుల నియామకంతో గందరగోళం
- డీఎస్పీ, అదనపు డీజీపీలలో ఎవరు విచారణాధికారి?
- కేసుపై అధికారికంగా స్పష్టత ఇవ్వని పోలీస్ శాఖ
- స్వగ్రామంలో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్, సిద్దిపేట రూరల్, ఆలేరు: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు అది హత్యా.. ఆత్మహత్యా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పోలీసు క్వార్టర్‌లో ఎస్సై మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ముందు సూసైడ్‌నోట్ రాసి ఉంటాడని, తొలుత వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు దానిని మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే శిరీష ఘటనతో లింకుపెడుతూ లీకులు ఇచ్చారని పేర్కొంటున్నారు.
మరోవైపు ఎస్సై ఆత్మహత్య ఘటనపై విచారణ అంశం తీవ్ర గందరగోళంగా మారింది. ఈ ఘటనపై విచారణాధికారిగా సంగారెడ్డి డీఎస్పీని నియమిస్తున్నట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ప్రకటించగా... అదనపు డీజీపీ గోపీకృష్ణకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. దీంతో అసలు విచారణ అధికారి ఎవరనే సందేహం తలెత్తింది. దీనిపై పోలీసు శాఖ ఇప్పటివరకూ అధికారికంగా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
సంగారెడ్డి డీఎస్పీతో విచారణా?
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరుపుతారని, పై అధికారుల వేధింపులు ఉంటే నివేదికలో స్పష్టం చేయాలని ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే డీఎస్పీ తిరుపతన్న మీద నయీమ్‌తో అంటకాగారనే ఆరోపణలున్నాయి. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల డీజీపీ పత్రికా ముఖంగా తెలిపారు కూడా. అలాంటి అధికారిని ఇంత సున్నితమైన కేసులో విచారణాధికారిగా నియమించడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలనే అభిప్రాయాలు వస్తున్నాయి.
అదనపు డీజీపీ పని ఏమిటి?
మరోవైపు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు డీజీపీ గోపీకృష్ణను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. ఇప్పటికే తిరుపతన్నకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మరి ఈ ఘటనపై ఇద్దరు అధికారులు విచారణ చేయడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు చేసే విచారణ వేర్వేరుగా ఉంటుందా? బాధ్యతలు పంచుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు.
డ్యామేజీని కంట్రోల్‌కే రోజంతా?
వరుసగా జరుగుతున్న ఎస్సైల ఆత్మహత్యలతో పోలీసు శాఖ ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. కీలకమైన జిల్లా, పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకే అధికారులు రోజంతా వెచ్చించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్సై ఆత్మహత్య చేసుకుంటే. రాత్రి వరకు దానిపై ఒక అధికారిక ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం నుంచి బయటపడానికే ఉన్నతాధికారులు ప్రాధాన్యత ఇచ్చారని... ఎస్సై ఆత్మహత్య కారణాలను విశ్లేషించడం, విచారణకు ఆదేశించడంపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కేసు సంగతీ అంతేనా..?
దాదాపు పది నెలల కింద ఇదే పోలీసుస్టేషన్‌లో ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు డీఎస్పీ, సీఐలు వసూళ్ల కోసం వేధిస్తున్నారంటూ సూసైడ్‌నోట్ రాశారు. ఆ కేసు దర్యాప్తు ఏమైందో ఇప్పటికీ తేలలేదు. అదే కాదు గతంలో జరిగిన ఏడుగురు ఎస్సైల ఆత్మహత్యల ఘటనలపైనా ఇప్పటికీ విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క వ్యవహారంలోనూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేగాకుండా విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలూ జరిగాయనే ఆరోపణలున్నాయి.
రామకృష్ణారెడ్డి తాగుబోతు అని, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కాల్చుకుని ఉంటాడంటూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తర్వాత దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్న ఘటనలోనూ.. ఆయన కుమారుడు, కోడలు మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులోనూ బ్యూటీషియన్ శిరీష వ్యవహరాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సై సూసైడ్‌నోట్.. మాయం?
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలతో కచ్చితంగా సూసైడ్‌నోట్ రాసి ఉంటారని ఆయన బంధువులు, సన్నిహితులు చెబుతున్నారు. ఎస్సై ఆత్మహత్య చేసుకున్న తర్వాత తొలుత ఏసీపీ గిరిధర్ (ఈ ఘటనలో బదిలీ అయిన అధికారి) తలుపులు పగలగొట్టి క్వార్టర్ లోపలకి వెళ్లారని... సూసైడ్‌నోట్‌లో ఉన్నతాధికారుల పేర్లు ఉండడంతో మాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆత్మహత్యతో ఏ సంబంధమూ లేకుంటే గజ్వేల్ ఏసీపీ గిరిధర్‌ను ఆగమేఘాల మీద ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన పక్క గదిలోని టేబుల్‌పై నోట్‌బుక్, కొన్ని తెల్ల కాగితాలు, పెన్ను ఉన్నాయని.. దానిని బట్టి ఆత్మహత్యకు ముందు ప్రభాకర్‌రెడ్డి ఏదైనా లేఖ రాసి ఉంటారని స్పష్టం చేస్తున్నారు.
ఇక ప్రభాకర్‌రెడ్డి యూనిఫామ్ షర్టు కుడివైపు జేబుకు ఉన్న బటన్ (గుండీ) తీసి ఉంది. ప్రభాకర్‌రెడ్డి సూసైడ్‌నోట్‌ను ఆ జేబులో పెట్టుకోగా.. సూసైడ్‌నోట్‌ను తీసేందుకు గుండీ తీశారా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక ప్రభాకర్‌రెడ్డి కణతపై రివాల్వర్‌తో కాల్చుకోగా.. తల నుంచి ఇరువైపులా రక్తపుధారలు కారాయి. కానీ ఎడమవైపు రక్తం కింది వరకు కారినట్లుగా ఆనవాళ్లు ఉండగా.. కుడివైపు మాత్రం రక్తం ఆ జేబు బటన్ వరకు వచ్చి ఆగడం, తర్వాత మళ్లీ రక్తపు చారలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
45 రోజుల్లో 20 మెమోలు!
తనను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, తరచూ మెమోలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తోటి సిబ్బందికి చెప్పుకొని బాధపడే వారని పోలీసులు చెబుతున్నారు. ఆయనకు గజ్వేల్ ఏసీపీ గిరిధర్ దాదాపు నెలా పదిహేను రోజుల వ్యవధిలో ఏకంగా 20కి పైగా మెమోలు ఇచ్చారని సిద్దిపేట పోలీసు కమిషనరేట్ వర్గాల ద్వారా తెలిసింది.
స్వగ్రామంలో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలు
కుకునూరుపల్లి ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి గురువారం తెల్లవారుజామున సిద్ధిపేట జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. వీడియో చిత్రీకరణ మధ్య.. గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి డీఐజీ శివశంకర్‌రెడ్డి, సీపీ శివకుమార్‌లు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు తరలించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన భార్య రచన, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది కంటతడి పెట్టారు. ప్రభాకర్‌రెడ్డి మృతదేహంపై డీసీపీ యాదగిరి, ఏసీపీ సాధుమోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి బంధువులు, స్నేహితులు డీసీపీని నిలదీశారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ప్రభాకర్‌రెడ్డి మరణిస్తే.. టీవీ చానళ్లలో తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వేధింపులతో తన భర్తను పొట్టన పెట్టుకున్నారని రచన వాపోయారు.