మావో నేత అశోక్ లొంగుబాటు
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్న అశోక్
1991లో సోదరుడు ఆజాద్ ప్రోద్బలంతో పీపుల్స్‌వార్‌లోకి..
అప్పట్నుంచీ పలు కమిటీల్లో కీలక పాత్ర
వరంగల్ క్రైం: మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మంగళవారం వరంగల్ డీఐజీ మల్లారెడ్డి ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నాడు. ఐదుగురు అన్నదమ్ముల్లో అశోక్ చిన్నవాడు. ఐటీఐ చదివిన ఈయన.. 18 ఏళ్ల ప్రాయంలోనే తన సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ప్రోద్బలంతో 1991లో అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపులో చేరాడు. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో వరంగల్‌లో పనిచేశాడు. అనంతరం పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏరియూ కమిటీలతోపాటు రాష్ట్రంలోని పలు కమిటీలలో పని చేశాడు. 1996లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో అశోక్ కుడిచేతిలోని మూడు వేళ్లను కోల్పోయాడు.
2000లో వరంగల్ డివిజనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత పాలెం సుదర్శన్‌రెడ్డి అలియాస్ ఆర్కే, జంపన్న నేతృత్వంలో పనిచేశాడు. 2001 నుంచి 2006 వరకు కిషన్‌జీ భార్య సుజాతక్క నేతృత్వంలో పనిచేశాడు. 2008 నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ సోదరుడు సారయ్య అలి యాస్ ఆజాద్ 2009లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, మరో సోదరుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ప్రస్తుతం ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు.
అనారోగ్య కారణాల వల్లే: గాజర్ల అశోక్
అనారోగ్య కారణాలతోనే తాను లొంగి పోయినట్లు గాజర్ల అశోక్ తెలిపాడు. లొంగుబాటు వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఏడాదిగా ఆరోగ్యం సహకరించడం లేదని వివరించాడు.
రిక్రూట్‌మెంట్ జరుగుతోంది: డీఐజీ
మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ జరుగుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న వారు పునరాలోచించుకోవాలని కోరారు. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్నారు.