కలవరపెడుతున్న కరపత్రాలు | Maoist Warning To Government Officials With Pampliment In mulugu | Sakshi
Sakshi News home page

కలవరపెడుతున్న కరపత్రాలు

Published Tue, Nov 26 2019 10:57 AM | Last Updated on Tue, Nov 26 2019 10:57 AM

Maoist Warning To Government Officials With Pampliment In mulugu - Sakshi

కుక్కతోగు వాగు సమీపంలో వెలసిన పోస్టర్‌

సాక్షి, ములుగు : జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో  వరుసగా జరుగుతున్న మావోయిస్టు కరపత్రాల విడుదల జిల్లా యంత్రాంగానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల కావడంతో కలకలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపి నాయకులు, ఆదివాసీ సంఘాలు, అధికారులను టార్గెట్‌ చేస్తూ విడుదల కావడంతో ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

తిప్పి కొట్టిన ప్రజాప్రతినిధులు..
గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో గుబులు మొదలయ్యింది. తాము చేయని తప్పుకు తలదించాల్సిన అవసరం లేదని కొంతమంది ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలపై ఈ నెల 18న జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ ఘాటుగా స్పందించారు. భూ ఆక్రమణలకు, అవినీతి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేటతెల్లం చేశారు. అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అప్రమత్తమైన పోలీసులు
కరపత్రాల విషయంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు కరపత్రాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులను ఏటూరునాగారం స్టేషన్‌కి పిలిపించి తగిన వివరాలను సేకరించారు. స్థానికంగా ఉండకుండా పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ముందస్తు సమాచారం  అందించాలని సూచించారు. దీంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఆరా తీస్తున్నారు. 

మొదటి కరపత్రంలో ఇలా..
లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 17న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరునాగారం–మహదేవపూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఇందులో ఏటూరునాగారంలోని కొంత మంది నాయకులు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, ఉమ్మడి భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ రియల్‌ ఎస్టేట్‌ దందాలు,  భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అలాగే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వైద్యుల కారణంగానే సామాన్య గిరిజనులు వైద్యసేవలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటును ఆశ్రయించి వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించినా వాటిని గిరిజనుల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని ఐటీడీఏ పీఓ, ఏపీఓల వైఖరిని తప్పుబట్టారు.

రెండో కరపత్రంలో..
జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల ప్రోత్భలంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్‌ ఈ నెల 24న ఓ కరపత్రంలో పేర్కొన్నారు.  మండలంలోని సుడిబాక గ్రామానికి చెందిన 56 మంది రైతుల 150 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కబ్జా చేశారని కరపత్రంలో తెలిపారు. జీఎస్పీ, ఏవీఎస్పీ సంఘాలకు చెందిన వారు కూడా వత్తాసు పలుకుతూ లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. లక్ష్మీనగరం, దానవాయిపేట గ్రామాల ఆదివాసీలకు చెందిన 27 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్నారని, అమాయక ఆదివాసీలు నిత్యం అధికారులు, కోర్టుల చుట్టూ న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. రైతుల నుంచి ఆక్రమించిన భూమిని వెంటనే వారికి అప్పగించాలని, లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్షతప్పదని కరపత్రంలో హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement