సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 12 వరకు గడువు ఇచ్చింది. 16 రాష్ట్రాల్లోని ఖాళీల కోసం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ కార్యదర్శికి నామినేషన్లను సమర్పించాలి. 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
తెలంగాణలో మూడు ఖాళీలకు మూడు నామినేషన్లే దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే అధికారులు ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తవగానే ఫలితాలను ప్రకటిస్తారు.
11న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన?
రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలూ టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. వాస్తవానికి టీఆర్‌ఎస్ బీ ఫారాలపై 63 మంది ఎమ్మెల్యేలే గెలవగా ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ నుంచి గెలిచిన 28 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌కు 90 మందికిపైగా ఎమ్మెల్యేల బలం పెరిగింది.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నెల 12 దాకా నామినేషన్ల దాఖలుకు గడువు ఉండటంతో అభ్యర్థులు ఎవరనే దానిపై పార్టీ నేతలు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా సన్నిహితులతోనూ చర్చించలేదని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ మనోగతాన్ని పార్టీ ముఖ్యనేతలు, సన్నిహితులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
సాధారణ ఎన్నికలకు కేవలం ఏడాది ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల వ్యవహారంపై రాజకీయంగా లబ్ధి పొందేలా టీఆర్‌ఎస్ ఆచితూచి వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు అత్యంత కీలకమైన ప్రాతిపదికగా ఈ ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు.
సంతోష్ కుమార్ పేరు ఖరారు..!
యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని సీఎం గతంలో ప్రకటించిన నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో సీటు కోసం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పేరు వినిపిస్తోంది. సంతోష్ పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
మిగిలిన ఒక సీటును దళితులు లేదా మైనారిటీలకు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, 11న సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని కేసీఆర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment