
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జేఏసీ) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించాలనుకున్న అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు చూపిన కారణాల్లో కొన్ని సహేతుకంగా లేవని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ దేశ పౌరులందరికీ నిరసన తెలియచేసే హక్కు ఉందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని గుర్తు చేసింది. యాత్రలో పాల్గొనడానికి వచ్చే వారిని ముందుగానే అరెస్ట్ చేస్తున్న అంశానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. యాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఇతర తేదీల్లో యాత్ర నిర్వహణకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అలాగే తేదీలతోపాటు యాత్ర సందర్భంగా పాటించాల్సిన షరతులను సైతం తామే నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతివ్వాలంటూ ఆగస్టు 29న చేసుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పందించడం లేదని, తాము తలపెట్టిన యాత్రకు అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీజేఏసీ కో–కన్వీనర్ ఐ.గోపాల శర్మ దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.
పోలీసులు కావాలనే జాప్యం చేశారు...
అంతకుముందు పిటిషన్‌పై వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో యాత్రకు అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు స్పష్టత కోరారని, ఘర్షణలు, రాజకీయ వైషమ్యాలు చోటుచేసుకోవచ్చంటూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో యాత్రకు అనుమతి నిరాకరించారన్నారు. నెలన్నర కిందట చేసుకున్న దరఖాస్తుపై కావాలనే జాప్యం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులిచ్చారన్నారు. అంతేగాక యాత్రకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని, చౌటుప్పల్ వద్ద పలువురిని అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మీరే రూట్ నిర్ణయించాల్సింది...
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా న్యాయమూర్తి స్పందిస్తూ నిరాకరణ ఉత్తర్వుల ద్వారా పిటిషనర్లకు వాటిని ఆమోదించడం మినహా మరో అవకాశం లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం రామచంద్రరావు వాదిస్తూ టీజేఏసీ గతంలోనూ యాత్రలు చేపట్టిందని, కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో షరతులను ఉల్లంఘించడంతో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. టీజేఏసీ నాయకులు రూట్ మ్యాప్ కూడా ఇవ్వలేదని, దీనివల్ల ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ప్రజల ఆస్తులకు జరిగే నష్టం–పౌర హక్కుల మధ్య సమతౌల్యత చూపాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని, ఆ బాధ్యతను తాము సమర్థంగా నిర్వర్తిస్తామన్నారు. పిటిషనర్ రూట్ మ్యాప్ ఇవ్వకుంటే, పోలీసులే యాత్రా మార్గాన్ని నిర్ణయించి ఉండాల్సిందని, అప్పుడు యాత్ర చేసుకోవాలా వద్దా అనే అంశాన్ని పిటిషనరే నిర్ణయించుకొని ఉండేవారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment