సాక్షి, హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ.. సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. రానున్న మరికొద్ది గంటలూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.
మియాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, నాగోల్, మలక్ పేట్ లతో పాటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. రహదారులపై చేరిన నీటిని తొలగించడానికి కనీసంగా మరో మూడు గంటల సమయం పట్టే అవకాశాలున్నందున అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. భారీ నీటి వరద వస్తున్న కారణంగా మొజాంజాహీ నుంచి బేగంబజార్ వైపునకు వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లించాలని అధికారులను ఆదేశించారు.
ఆస్మాన్ గఢ్, చార్మినార్, బేగంబజార్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. రహదారులపై పడిన విద్యుత్ వైర్లను తాకరాదని సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. విద్యుత్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయని, తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.విద్యుత్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
⇒ విద్యుత్ వైర్లు తెగిపడిన కారణంగా సైఫాబాద్, బేగంబజార్, ఆస్మాన్ గఢ్, సైనిక్ పురి, సరూర్ నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాతబస్తీలోని చందూలాల్బరదారిలోని హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం గోడ కూలి పక్కన ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బంజారాహిల్స్ లోని నాయుడు నగర్ లో మట్టిపెల్లలు కూలగా, ఆ మట్టిలో ఇద్దరు వ్యక్తులు కూరుకుపోయినట్టు సమాచారం. ఈ ఘటనలో తండ్రి, కొడుకులిద్దరూ మృతిచెందినట్టు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
⇒ నాగారం గ్రామంలో, సమీపంలోని ఎగువ ప్రాంతంలో భారీ వరద నీరు అన్నరాయుని చెరువుకు చేరుతోంది. ఆ కారణంగా సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
⇒ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.
⇒ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఈ రాత్రి అందించడానికి తక్షణం వెయ్యి ప్యాకెట్ల మేరకు ఆహార పదార్థాల పంపిణీ ప్రారంభించినట్టు చెప్పారు. రేపు ఉదయం మరో 5 వేల ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసి పంపిణీ చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇప్పటివరకూ నమోదైన వర్షపాతం వివరాలు..
సోమవారం సాయంత్రం నుంచి మొదలై రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం భారీగా కురిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా బహదూర్ పుర ప్రాంతంలో 12.6 సెం.మీ., వర్షం కురిసింది. రాజేంద్రనగర్ లో 11.2 సెం.మీ., అంబర్ పేటలో 11.5 సెం.మీ., గోల్కొండ ప్రాంతంలో 9.5 సెం.మీ., సికింద్రాబ్ద్ మోండా మార్కెట్ ప్రాంతంలో 9.5 సెం.మీ., నారాయణగూడ ప్రాంతంలో 8.8 సె.మీ., ముషీరాబాద్ లో 8.7 సెం. మీ., మల్కాజిగిరి కాప్రాలో 8.7 సె.మీ., సరూర్ నగర్ ప్రాంతంలోని డీఎంఆర్ఎల్ సమీపంలో 8.6 సె.మీ., సైదాబాద్ లోని ఆస్మాన్ గఢ్ ప్రాంతంలో 8.6 సెం.మీ. మేరకు వర్షపాతం నమోదైంది. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో మూడు నుంచి అయిదు సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు : పలు రైళ్ల వేళల్లో మార్పులు
భారీ వర్షాల కారణంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల మధ్య కాలంలో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, నాగులపల్లి, మౌలాలి, గట్కేసర్ మార్గంలో నాలుగు సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. నాలుగు సర్వీసులను నిలిపివేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి వెళ్లింది. భారీ వర్షాల కారణంగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ను మౌలాలి వద్ద, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ను చెర్లపల్లి వద్ద, తాండూరు-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను శంకర్ పల్లి వద్ద, వరంగల్-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను హుస్సేన్ సాగర్ వద్ద కొద్దిసేపు నిలుపుదల చేశారు. రాత్రి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కో రైలు కదిలింది. ప్రస్తుతం మిగతా అన్ని రైళ్లు షెడ్యూలు ప్రకారం నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.