సపర్యలు చేస్తున్న భార్య, పిల్లలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్‌మియా. ఈయన వయస్సు››42 సంవత్సరాలు. అయినా మంచం దిగలేడు. తన పని తాను చేసుకోలేడు. స్నానం, మల, మూత్ర విసర్జన మంచం మీదే. ఒకటి, రెండు కాదు 19 ఏళ్లుగా ఇదే దుస్థితి. కుటుంబ భారం మోయాల్సిన ఆ యజమానిని భార్య, పిల్లలు చిన్న పిల్లాడిలా సాకుతున్నారు. తినిపించడం నుంచి కాలకృత్యాలు, స్నానం చేయించడం వరకు అన్నీ బల్లపై చేసి కాపాడుకుంటున్నారు. కడుపేదరికంలో ఉన్న ఆ కుటుంబం..ఖరీదైన వైద్యం చేయించలేకపోతున్నారు. దాతలు ఆదుకుంటే పెద్దాస్పత్రికి తీసుకెళ్లి ఆ కుటుంబ పెద్దదిక్కును కాపాడుకుంటామని కుటుంబ సభ్యులు, పిల్లలు వేడుకుంటున్నారు. కండరాల క్షీణతతో కాళ్లు, వెన్నుముక పనిచేయని మహ్మద్ అబ్దుల్‌మియాపై ప్రత్యేక కథనం.
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్‌మియాకు భార్య ముంతాజ్‌బేగం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లయిన అనంతరం టైలరింగ్ షాపుతో కష్టం చేసి కుటుంబాన్ని పోషించిన అబ్దుల్ 19 ఏళ్ల క్రితం అనుకోకుండా కండరాల క్షీణత వ్యాధికి గురయ్యాడు. దీంతో కాళ్లు, చేతులు చచ్చు బడడంతోపాటు వెన్నుముక కూడా పని చేయడం లేదు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సొంతిల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటూ జీవనం గడుపుతున్నారు. అబ్దుల్ వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.5 లక్షలు అప్పు చేసి వైద్య చికిత్సకు ఖర్చు చేశారు.
మీ సేవ కేంద్రమే జీవనాధారం..
అబ్దుల్‌కు 23వ ఏటా వెన్నుముకకు వ్యాధి సోకి కాళ్లు, నడుం చచ్చు బడిపోయాయి. కదలలేని స్థితిలో ఉన్న అతనికి అన్నీ మంచంపైనే. వికలాంగుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన మీ సేవ కేంద్రమే వారి జీవనాధారం. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రాకపోవడంతో అప్పు చేసి చికిత్స చేయిస్తున్నారు. రోజు రోజుకు శరీరం కుప్పగా మారుతుండటంతో కుటుంబ సభ్యులకు సపర్యలు చేయడం కష్టమవుతోంది. భర్తను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుకోవాలనుకుంటున్న ముంతాజ్‌బేగం ఆశలు నెరవేరడం లేదు.
పూణెలో అందుబాటులో ఉన్న ‘ఏమో స్టెమ్ సెల్’ చికిత్స ద్వారా వ్యాధి నయమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నా.. అందుకు రూ.30 లక్షలు అవసరం. అంత స్థోమత లేని ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్‌కు లేఖ పంపారు. వైద్యానికి ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరి చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 85000 41711 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment