Spine problem
-
65 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్ర చికిత్స
హైదరాబాద్: నగర వైద్య చరిత్రలోనే తొలిసారిగా 65 ఏళ్ల మహిళకు వెన్నెముకలో స్టెంటింగ్ వేశారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కృష్ణచైతన్య ఈ అరుదైన చికిత్స చేశారు. అచ్చం గుండెకు స్టెంట్ వేసినట్లే ఎముకకు సైతం మెటల్ స్టెంట్ వేయడం ద్వారా రోగికి ఊరట కల్పించారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ.. గత నెలలో ఓ మహిళ ఇంట్లో నేలపై పడిపోయింది. విపరీతంగా వెన్నునొప్పితో బాధ పడుతూ.. కనీసం నడిచే స్థితిలో లేకపోవడంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లగా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆమెకు గ్యాస్టైటిస్, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ గ్రాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సృజన్ వద్దకు వెళ్లగా.. ఆయన తన వద్దకు పంపడంతో వెన్నెముక విరిగిన విషయం గుర్తించానని డాక్టర్ కృష్ణచైతన్య చెప్పారు. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయడం ముప్పుతో కూడుకున్నదని, సెడేషన్ మాత్రం ఇచ్చి స్టెంటింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్లు, ఇతర చిన్నపాటి సమస్యలు ఉన్న పెద్ద వయసువారికి వెన్నెముకలోని ఎముకలు విరిగితే ఈ చికిత్స చాలా ఉపయోగకరమన్నారు. సాధారణంగా శస్త్ర చికిత్స చేసే 3– 4 గంటలు పట్టడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి శస్త్ర చికిత్సల్లో అయితే స్క్రూలు బిగిస్తామన్నారు, దాని వల్ల కోలుకోవడానికి కూడా చాలా నెలలు పడుతుందన్నారు. కానీ ఈ ప్రక్రియలో స్టెంట్‌ను కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ రంధ్రం ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. ఇది లోపలకు వెళ్లి ఎముక వద్ద విస్తరిస్తుందన్నారు. దానివల్ల ఎముక తన సాధారణస్థితికి వచ్చేస్తుందన్నారు. ఎలాంటి నొప్పి కూడా లేకపోవడంతో ఆపరేషన్ అయిన కొద్ది గంటలకే రోగి లేచి నడవగలిగారని వివరించారు. -
వెన్నెముక సర్జరీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ
-
ఆ నొప్పి వెన్ను నుంచి వేళ్ల వరకు
ఓ వయసు దాటాక వెన్నెముకలోని మెడ దగ్గర ఉండే ఎముకలుఅరిగిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంటుంది. మెడ దగ్గరనొప్పి భుజం నుంచి మోచేతి మీదుగా వేళ్లకూ పాకుతూ చికాకు పెడుతుంటుంది. నొప్పి, తిమ్మిరులతో ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి చేయి బలహీనంగా అయినట్లుగానూ అనిపిస్తుంది. ఈ సమస్య పేరే సర్వైకల్ స్పాండిలోసిస్. జీవనశైలి, పని ప్రదేశం (వర్క్‌ప్లేస్)లో కూర్చునే భంగిమల వల్ల ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. ఈ కారణంగా వెన్నుకు వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన పెంచుకుందాం. అదే పనిగా సరైన తీరులో కాకుండా... ఇష్టం వచ్చినట్లు కూర్చోవడంతోపాటు వెన్నుమీద తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల డిస్కులు పక్కకు తప్పుకోవచ్చు. ఇలా వచ్చే సమస్యను సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అంతేకాకుండా ఈ సమస్య చాలాకాలం పాటు కొనసాగినా లేదా వయసు మీరాక మెడలోని వెన్నెముకలు అరగడం వల్ల ఆ ఎముకల మధ్య ఉన్న నాడులపై ఒత్తిడి పడి వచ్చే సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇటీవల దాదాపు అన్ని వర్గాల్లోనూ మెడమీద ఒత్తిడి తీవ్రమయ్యేలా చేసే ఉద్యోగాలు, వృత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య సర్వసాధారణమయ్యింది. అందుకే ఓ వయసు దాటాక వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ముందర వచ్చే డిస్క్ప్రొలాప్స్లు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెడ దగ్గరి ఎముకలనుతెలుసుకుందాం... మన మెడ భాగంలోని వెన్నెముకలో ఏడు ఎముకలు ఉంటాయి. వాటినే వరసగా సీ1, సీ2, సీ3, సీ4, సీ5, సీ6, సీ7గా చెబుతారు. ఈ ఎముకలు తలను నిటారుగా నిలబెట్టి ఉంచేందుకు ఉపయోగపడతాయి. మెడను అటు ఇటు తిప్పడానికి (ఫ్లెక్సిబుల్‌గా ఉంచేందుకు) ఉపయోగపడతాయి. లోపల ఉన్న వెన్నుపాము (స్పైనల్‌కార్డ్)ను కాపాడతాయి. ఆ ఎముకల మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్) నివారించేందుకు ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ ఉంటుంది. ఈ ఎముకల మధ్యనుంచి నరాలు బయటకు వచ్చి వేర్వేరు అవయవాలను చేరి వాటిని నియంత్రిస్తుంటాయి. మెడలోని ఈ వెన్నెముకలు ఎముకలు, లేదా వాటిమధ్యన ఉండే మెత్తలాంటి డిస్క్ అరుగుదల వల్ల, లేదా ఒక్కోసారి డిస్క్‌లు పక్కకు జరగడం వల్ల నరాలపై ఒత్తిడి పడి ఈ తిమ్మిరి, నొప్పి వస్తుంది. ఇలా డిస్క్‌లు పక్కకు తొలగడాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. మెడలో ఉండే వెన్నెముకలు సీ1–సీ7 అరిగి, వాటి మధ్య ఉండే ఫేసెటల్ జాయింట్స్ కూడా అరిగి, రియాక్షన్‌గా ఆ అరిగిన మేరకు ఎముక పెరగడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కొద్దిగా యంగ్ ఏజ్‌లో వస్తుంది. ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ వల్ల దీర్ఘకాలికంగా అరుగుదల (డ్యామేజీ) జరిగితే అది సర్వైకల్ స్పాండిలోసిస్‌కు దారితీయవచ్చు. చికిత్స ప్రక్రియలివి... సర్వైకల్స్పాండిలోసిస్ కండిషన్ కనిపించిన రోగుల్లో జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ ప్రక్రియ వల్ల గణనీయమైన మెరుగుదల కనిపించేందుకు అవకాశం ఉంది. ఇక కొన్ని నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎన్‌ఏఐడీ) అని చెప్పే నొప్పి నివారణ మందులు వాడటం ఈ చికిత్సల్లో ఒక భాగం. వీటితోపాటు శస్త్రచికిత్స ద్వారా ఎముకలు అరిగిన, తొలగిన ప్రాంతంలో సరిచేయడం చివరగా చేసే చికిత్స ప్రక్రియ. జీవనశైలి మార్పులతో... మనం పనిచేసే చోట మెడపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం ప్రధానం. నిద్రపోయేప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు తలను సరైన భంగిమలో ఉంచడం, మెడ కండరాలపై అసమతౌల్యంగా బరువు పడుతుంటే నివారించడం వంటివి జీవనశైలిలో మార్పులు. గంటలకొద్దీ కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ వంటి వృత్తుల్లో ఉన్నవాళ్లు తమ తల బరువు మెడపై అసహజమైన రీతిలో పడుతుంటే దాన్ని నివారించడం కూడా ముఖ్యం. ఫిజియోథెరపీ... మెడ కండరాలకు వ్యాయామాన్ని ఇవ్వడం ద్వారా వాటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మంచిది. దీనివల్ల వయసు పెరగడం వల్ల వెన్నెముక అరుగుదల ప్రక్రియ వేగంగా జరగకుండా చూడవచ్చు. ఫలితంగా ఈ అరుగుదలతో వచ్చే స్పాండిలోసిస్ అంత త్వరగా రాదు. కాబట్టి మెడ కండరాలకు వ్యాయామం అవసరం. ఇక ఈత వల్ల వెన్నెముకతోపాటు అన్ని కండరాలకూ తగినంత వ్యాయామం లభిస్తుంది. ఇలా వెన్నెముకతో పాటు మెడ కండరాలకు వ్యాయామం అందించేందుకు ఫిజియో థెరపీ ఉపయోగిస్తుంది. ఇందులోనూ రెండు దశల్లో ఫిజియోథెరపీ చికిత్స జరుగుతుంది. మొదటిది నొప్పి నివారణకు ఐఎఫ్‌టీ, అల్ట్రాసోనిక్ థెరపీ లేదా షార్ట్వేవ్ డయాథెర్మీ, రెండో దశలో మెడ, చేతులు, కాళ్లకు (లింబ్) ఎక్సర్సైజ్లు. ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ (ఐఎఫ్‌టీ): ఈ ప్రక్రియలో ఒక రకం విద్యుత్తరంగాలను (వీటిని) ఉపయోగించి నొప్పి నివారణ చేస్తారు. శరీరంపై ఏదైనా గాటు లేదా గాయం ఉన్నవారికి లేదా పుండు వంటివి ఉన్నవాళ్లకు, గర్భిణులకు వీటిని ఉపయోగించరు. అల్ట్రాసోనిక్ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇక షార్ట్వేవ్ తరంగాలను ఉపయోగించి కూడా నొప్పి నివారణ చేస్తారు. ఇది స్వల్పకాలికంగా జరిగే చికిత్స. ఇక రెండోదశలో మెడ, చేతులు, కాళ్లకు నిత్యం వ్యాయామం చేయించడం, దీర్ఘకాలం పాటు చేయించడం ద్వారా వాటిని మరింత దృఢతరం అయ్యేలా చూసి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. సాధారణంగా సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఫిజియోథెరపీ ప్రధానమైన చికిత్స ప్రక్రియలా పరిగణిస్తారు. సర్వైకల్ కాలర్: తల బరువు అరిగిన మెడ వెన్నెముకలు (సీ1 టు సీ7) వరకు పడుతుంటే ఆ బరువును వాటిపై పడకుండా చేసే ఒక ఉపకరణం ‘సర్వైకల్ కాలర్’. అయితే ఇది అంతగా ఉపయోగపడదు కూడా. పైగా ఈ ఉపశమనం చాలా తాత్కాలికం మాత్రమే కావడంతో కొందరు డాక్టర్లు దీన్ని సూచించరు కూడా. దానికి కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు సర్వైకల్ కాలర్‌ను కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఉపయోగిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలగడం వల్ల అలా అదేపనిగా దాన్నే ఉపయోగిస్తూ ఉండటం వల్ల మెడ కండరాలు బలహీనపడి దానిపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే అది చాలాకాలం ఉపయోగించడం అంతగా సరికాదు. సర్వైకల్ ట్రాక్షన్: నరం దెబ్బతిన్నదని తెలిసినప్పుడు సర్వైకల్ ట్రాక్షన్‌ను అమర్చకూడదు. కేవలం ఎలాంటి నర్వ్ డ్యామేజీ లేదనుకున్నప్పుడే నొప్పి ఉన్న కొందరిలో దీన్ని ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు. శస్త్రచికిత్స... సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్‌లో... ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలు, సాంత్వన ప్రక్రియలు అవలంబించి కనీసం ఆరు నుంచి పన్నెండు వారాలు గడిచాక కూడా తగినంత ఉపశమనం లేకపోతే అప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలు కంఠం ముందు భాగం నుంచీ కొన్ని, మెడ వెనక భాగం నుంచి చేసేవి... ఇలా రకరకాలుగా ఉంటాయి. డిస్క్ లేదా ఎముకల అరుగుదలతో నరాలమీద కలిగే ఒత్తిడి స్థానాన్ని బట్టి ఎటువైపు నుంచి శస్త్రచికిత్స చేయాలన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అయితే శస్త్రచికిత్స ఎటువైపునుంచి జరిగినా చివరిలక్ష్యం మాత్రం రోగికి నొప్పి నివారణ కలిగేలా చూడటమే. శస్త్రచికిత్స ముందువైపు నుంచి జరిగితే (అది చాలా చిన్న గాటుతో) డిస్కెసెక్టమీ రూపంలో చేస్తారు. ఐదు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల గాటు పెట్టి డిస్క్‌ను తొలగిస్తారు. రోగి తుంటిఎముక నుంచి తొలగించిన భాగాన్ని (మనం చేత్తో తడిమినప్పుడు తుంటి వద్ద పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఎముక) ఆ డిస్క్‌ను తొలగించిన చోట అమరుస్తారు. లేదా దీనికి బదులు డిస్క్ తొలగించిన ఆ గ్యాప్‌లో టైటానియం లోహంతో చేసిన ఒక డిస్క్‌ను అమర్చుతారు. దీన్ని ఎలా అమర్చాలన్న దాన్ని రోగికి అవసరమేమిటన్న అంశంపై డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. అంటే.. ఇక్కడ జరిగే ప్రక్రియ ఒక్కటే. గతంలో ఎముకల భారం పడే డిస్క్ భాగాన్ని తొలగించి శస్త్రచికిత్స తర్వాత మెడ కదలికలతో పడే ఒత్తిడి అక్కడి చాలా కండరాలు ఆ భారాన్ని తీసుకునేలా చూస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలివి... సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలతో పాటు స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. సాధారణ ఎక్స్–రే వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి తెలిసిపోతుంది. అదే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఎమ్మారై పరీక్షల వల్ల నిర్దిష్టంగా డిస్క్‌లు, వెన్నుపాము, నరాల పొజిషన్ వెన్నుపాము వ్యవస్థపై ఎముకల అరుగుదల, డిస్క్‌ల అరుగుదల వల్ల పడుతున్న ప్రభావం... ఇవన్నీ ఎమ్మారైలో స్పష్టంగా తెలుస్తుంది. సీటీ స్కాన్ అయితే కాస్తంత పరిమితమైన వివరాలే తెలుస్తాయి. అవి కూడా కొందరు పేషెంట్లలోనే కొంతమేరకే తెలుస్తుంది. డాక్టర్నుకలవాల్సిందెప్పుడు...? మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా కొందరు పెయిన్‌కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పే అయినా... అలా పెయిన్‌కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా వచ్చే అని అనుమానించాల్సి ఉంటుంది ∙నొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా అనిపించడం కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణమే ∙పై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉండవచ్చు ∙కాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్నెస్తో) ఉండవచ్చు ∙మెడలో ఇబ్బందిగా (టెండర్నెస్) కూడా ఉండవచ్చు ∙శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్ను సూచిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలివి... మెడ నొప్పిగా ఉంటుంది. మెడను మునుపటిలా ఫ్రీగా తిప్పడం సాధ్యం కాకపోవచ్చు ∙మన దేహంలోని వివిధ అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి ∙చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంటుంది ∙పరిస్థితి తీవ్రమైన కొందరిలో కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్నెస్) కూడా అనిపించవచ్చు ∙నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ∙కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు. డాక్టర్ టి.దశరథ రామారెడ్డిసీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
19 ఏళ్లుగా మంచంపైనే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అబ్దుల్మియా. ఈయన వయస్సు››42 సంవత్సరాలు. అయినా మంచం దిగలేడు. తన పని తాను చేసుకోలేడు. స్నానం, మల, మూత్ర విసర్జన మంచం మీదే. ఒకటి, రెండు కాదు 19 ఏళ్లుగా ఇదే దుస్థితి. కుటుంబ భారం మోయాల్సిన ఆ యజమానిని భార్య, పిల్లలు చిన్న పిల్లాడిలా సాకుతున్నారు. తినిపించడం నుంచి కాలకృత్యాలు, స్నానం చేయించడం వరకు అన్నీ బల్లపై చేసి కాపాడుకుంటున్నారు. కడుపేదరికంలో ఉన్న ఆ కుటుంబం..ఖరీదైన వైద్యం చేయించలేకపోతున్నారు. దాతలు ఆదుకుంటే పెద్దాస్పత్రికి తీసుకెళ్లి ఆ కుటుంబ పెద్దదిక్కును కాపాడుకుంటామని కుటుంబ సభ్యులు, పిల్లలు వేడుకుంటున్నారు. కండరాల క్షీణతతో కాళ్లు, వెన్నుముక పనిచేయని మహ్మద్ అబ్దుల్మియాపై ప్రత్యేక కథనం. రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్మియాకు భార్య ముంతాజ్‌బేగం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లయిన అనంతరం టైలరింగ్ షాపుతో కష్టం చేసి కుటుంబాన్ని పోషించిన అబ్దుల్ 19 ఏళ్ల క్రితం అనుకోకుండా కండరాల క్షీణత వ్యాధికి గురయ్యాడు. దీంతో కాళ్లు, చేతులు చచ్చు బడడంతోపాటు వెన్నుముక కూడా పని చేయడం లేదు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సొంతిల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటూ జీవనం గడుపుతున్నారు. అబ్దుల్ వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.5 లక్షలు అప్పు చేసి వైద్య చికిత్సకు ఖర్చు చేశారు. మీ సేవ కేంద్రమే జీవనాధారం.. అబ్దుల్‌కు 23వ ఏటా వెన్నుముకకు వ్యాధి సోకి కాళ్లు, నడుం చచ్చు బడిపోయాయి. కదలలేని స్థితిలో ఉన్న అతనికి అన్నీ మంచంపైనే. వికలాంగుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన మీ సేవ కేంద్రమే వారి జీవనాధారం. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రాకపోవడంతో అప్పు చేసి చికిత్స చేయిస్తున్నారు. రోజు రోజుకు శరీరం కుప్పగా మారుతుండటంతో కుటుంబ సభ్యులకు సపర్యలు చేయడం కష్టమవుతోంది. భర్తను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుకోవాలనుకుంటున్న ముంతాజ్‌బేగం ఆశలు నెరవేరడం లేదు. పూణెలో అందుబాటులో ఉన్న ‘ఏమో స్టెమ్ సెల్’ చికిత్స ద్వారా వ్యాధి నయమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నా.. అందుకు రూ.30 లక్షలు అవసరం. అంత స్థోమత లేని ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్‌కు లేఖ పంపారు. వైద్యానికి ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరి చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 85000 41711 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఫైన్... స్పైన్
ఏ నెట్వర్క్కి అయినా బ్యాక్‌బోన్ చాలా ముఖ్యం. అలాగే మన శరీరంలో వెన్నెముక చాలా కీలకమైనది. మొత్తం 33 వెన్నుపూసలలో 24పూసలు కదిలేవి కాగా మిగిలిన 9 పూసలు క్రింది భాగంలో ఒకదానికి ఒకటి అతికించబడినట్టుగా ఉంటాయి. వీటి మధ్యలో ఉండే డిస్కులు వెన్నుపూసల మధ్య రాపిడి లేకుండా కాపాడుతుంటాయి. వీటిని ఒక దగ్గరగా ఉంచడానికి చుట్టూ లిగమెంట్లు, 3 రకాలైన మెంబ్రేన్లతో కప్పబడి ఉంటాయి. ఆధునిక జీవనశైలిలో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, తద్వారా వెన్నెముక సమస్యలైన డిస్క్ ప్రొలాప్స్, స్లిప్డ్ డిస్క్, డిస్క్ హెర్నియేషన్... కలుగుతాయి.అంగ చాలనములలో చివరగా చేసే మేరు చాలనములు వెన్నెముక సమస్యలకు సంబంధించిన స్ట్రెచెస్. ఇవి రోజులో ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. పైకి చేసే స్ట్రెచెస్, పక్కలకు తిప్పే ట్విస్టులు ఆహారం తీసుకున్న కాసేపటి తర్వాత కూడా చేయవచ్చు. అయితే ఫార్వర్డ్, బ్యాక్వార్డ్ బెండింగ్స్ చేసేటప్పుడు మాత్రం పొట్ట కొంచెం ఖాళీగా, తేలికగా ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. వెన్నెముక సమస్యల పరిష్కారంగా చేసే మేరు చాలనములలో కొన్ని... 1. ఊర్థ్వచాలన సమస్థితిలో నిలబడి పాదాల మధ్య కావల్సినంత దూరం ఉంచాలి. చేతులు ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందుకు స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ కాలి మడమలను కొంచెం కొంచెం పైకి లేపుతూ చేతుల్ని పూర్తిగా పైకి తీసుకెళ్లాలి. చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసిన స్థితిలోనే ఉంచి ఆకాశంవైపు చూపిస్తూ కాలి ముందు వేళ్ల మీద పైకిలేచి నిలబడే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మది నెమ్మదిగా చేతులు అలానే తలపైన ఆనించి కాలి మడమలను నేల మీద ఉంచాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి మడమలు పైకి శ్వాస వదులుతూ చేతులు తల మీదకు మడమలు కిందకు తీసుకురావాలి. దీనిని లేటరల్ ట్రాక్షన్ అనే స్పాండిలైటిస్ సమస్య ఉన్న ఉన్నవారికి ఫిజియోథెరపీలో భాగంగా తప్పక చేయిస్తారు. 2. కటి చాలన (పక్కలకు) వేరియంట్ ఇందులో పైకి ఇంటర్‌లాక్ చేసి స్ట్రెచ్ చేసిన చేతులను అలానే ఉంచి కుడి పక్కకు పూర్తిగా వంగే ప్రయత్నం చేయాలి. తర్వాత శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్లీ శ్వాస తీసుకుని ఎడమ పక్కకు నడుమును వంచాలి. ఇక్కడ కాలి మడమలు పైకి లేపవలసిన అవసరం లేదు. పాదాలు స్థిరంగా ఉంచాలి. చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కాళ్లను రిలాక్స్డ్గా ఉంచి చేసినట్లయితే చాలా తేలికగా చేయగలుగుతారు. ఎటువంటి ఆసనం అయినా టెన్షన్ పడుతూ చేస్తే శరీరం బిగుసుకు పోతుంది. దీంతో కండరాలలో బిగుతు పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా జరగదు. ఆసనం వలన కలగాల్సిన ప్రయోజనం లభించక పోగా నష్టం కలుగుతుంది. 3. కటి చాలన (వేరియంట్ 2) ఈ ఆసనంలో చేతులను సాగదీసి కాకుండా చేతులను మడిచి భుజం తలకు సపోర్ట్‌గా ఆనించాలి. ఫొటోలో చూపిన విధంగా కుడి పక్కకు నడుమును వంచి పక్కలకు పైకి కిందకు స్వింగ్ చేయాలి. కనీసం 5 నుంచి 10సార్లు, ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. స్వింగ్ చేసేటప్పుడు జర్క్‌లు జర్క్‌లుగా శ్వాస వదులుతూ చేస్తే చాలా రిలాక్స్డ్గా చేయవచ్చు. – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: రీనా ఫొటోలు: ఠాకూర్ - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
చిన్నారి ప్రాణం..కోరుతోంది ఆపన్నహస్తం..
ఎర్రగుంట్ల: అసలే పేద కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది.. ఎలాగోలా పిల్లలను చదివించు కుంటున్నారు.. ఈ నేపథ్యంలో వారిపై విధి చిన్న చూపు చూసింది. పెద్ద కుమార్తె నాగకల్యాణికి మెదడు, వెన్నెముకలకు సంబంధించిన వ్యాధి వచ్చింది... ఆర్థిక సమస్యలతో వారు ఇబ్బందులు పడుతున్నా... శక్తికి మించి పలు ఆసుపత్రుల్లో చూపించారు... తీరా ఆస్పత్రిలో ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో వారు కుంగిపోయారు. ఎర్రగుంట్ల నగర పంచా యతీ పరిధిలో కడప రోడ్డులోని మహేశ్వరనగర్ కాలనీకి చెందిన మాన పెద్దయ్య, నారా యణమ్మల కూతురు నాగకల్యాణి 8వ తరగతి చదువుతోంది. తండ్రి పెద్దయ్య నాపరాయి గనుల్లో ట్రాక్టర్‌కు కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి నారాయణమ్మ ఇంటి వద్ద నే ఉండి కూతురి ఆలనాపాలన చూస్తోంది. పుట్టిన మూడు నెలల నుంచే నాగకల్యాణికి మెదడుకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆర్థికలేమి కారణంగా ఈ వ్యాధిని నయం చేయించే విషయంలో వారు దృష్టి సారించలేకపోయారు. బాలిక వయసు పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత పెరగసాగింది. దీనికితోడు వెన్నెముక కూడా పనిచేయలేదు. దీంతో సరిగ్గా నడవలేని.. కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మాటలు కూడా సక్రమంగా రావడం లేదు. ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రులతో పాటు కర్నూలు, తిరుపతిలలోని పెద్ద ఆస్పత్రుల్లో చూపించి మందులు ఇప్పించారు. ప్రస్తుతం సమస్య తీవ్రంగా మారింది. ఇలాగే కొనసాగితే బాలిక కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్య చేయించడానికి వారికి ఆర్థికి స్థోమత ఏదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిద్దామని ప్రయత్నిస్తే ఆ జాబితాలో ఈ జబ్బు లేదని వైద్యులు తెలిపారు. ఈ స్థితిలో ఓ వైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కన్న కూతురు.. మరోవైపు చేతిల చిల్లిగవ్వలేని దీన స్థితి మధ్య ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. దాతలు కరుణించి సాయం అందిస్తే తమ బిడ్డను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు. -
కొవ్వుకు కండకు
1. అర్ధ శలభాసన: కుర్చీలో రెండు కాళ్లు సీటు చివరి భాగంలో ఆధారంగా ఉంచి, రెండు చేతులు వీలైతే తొడల కిందకు తీసుకువెళ్లి, అరచేతులు భూమి మీద ఉంచి (వీలు కాకపోతే ఫొటోలో చూపిన విధంగా చేతులు నడుము పక్కన ఉంచి) ఎడమ చెంప భాగం నేల మీద ఉంచి, శ్వాస తీసుకుంటూ కుడి కాలుని పైకి లేపే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 శ్వాసలు తీసుకుని శ్వాస వదులుతూ కుడికాలును క్రిందకు తీసుకురావాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. ఒక కాలుతో చేసినప్పుడు అర్ధ శలభాసనంగా పిలుస్తారు. అదే రెండు కాళ్లను కలిపి చేసినప్పుడు స్వర్ణ శలభాసనంగా వ్యవహరిస్తారు. అర్ధ శలభాసనంలో చెంపభాగం నేల మీద ఉంచడం గమనించాలి. అదే స్వర్ణ శలభాసనంలో గడ్డం నేలమీద ఉంచి నేలకు అదుముతూ మోకాళ్లు పాదాలను కలిపి ఉంచుతూ కాళ్లు రెండూ పైకి తీసుకువెళ్లడం గమనించాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్లు రెండు నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం. లేకపోతే ఈ ఆసనం వల్ల వచ్చే లాభాలు చేకూరవు. జాగ్రత్తలు: సయాటికా సమస్య ఉన్నవాళ్లు మోకాలు సమస్యలు ఉన్నవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయడం ముఖ్యం. కుర్చీ ఆధారంగా చేసేటప్పుడు ఈ ఆసనం చేయడం చాలా తేలిక. ఎందువల్ల అంటే కుర్చీ సీటు ఎత్తు వరకే కాళ్లు లేపగలిగే వారికి చక్కటి సపోర్ట్ దొరుకుతుంది. కేవలం మోకాళ్లు నిటారుగా ఉంచి ఇంకా పైకి లేపే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే కుర్చీలో పాదాలు పెట్టేస్తూ ఆసనంలో వెనుకకు రావచ్చు. గమనిక: మంచి ఫలితాల కోసం ఈ ఆసనాన్ని కుడి కాలుతోను, ఎడమకాలుతోనూ 5 లేక 10 సార్లు రిపీట్ చేయవచ్చు. ఉపయోగాలు: ఎల్ 1 నుంచి ఎల్ 5 భాగంలో ఉన్న సమస్యలకు సయాటికా సమస్యకు, పించ్ నెర్వ్ సమస్యకు చాలా మంచిది. నడుం చుట్టూ, తొడలు, పిరుదులలో ఉన్న కొవ్వు కర గడానికి, సర్వైకల్ సమస్యకు మంచి పరిష్కారం కాగలదు. గ్లూటియస్, ఫెమరిస్ కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. 2ఎ) పరిపూర్ణనావాసన: ఆసనంలో వెల్లికిలా పడుకుని కాళ్లు రెండు కుర్చీ సీటు భాగంలో చివరకు ఉంచి చేతులు రెండూ శరీరానికిరువైపుల పక్కన అరచేతులు భూమి మీద ఉంచి శౠ్వస వదులుతూ తల వీపు భాగాలను పైకి లేపి చేతులను కూడా శరీరానికి సమాంతరంగా కాని, ఇంకా కొంచెం పైకి కాని లేపి కాళ్లకు సమాంతరంగా స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని, మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి. కొంచెం రిలాక్స్ అవుతూ అంటే మధ్యలో కొన్ని సాధారణ శ్వాసలు తీసుకుని ఆ ఆసనాన్ని 5 లేదా 10 సార్లు రిపీట్ చేయడం వలన త్వరగా సత్ఫలితాలు సాధించవచ్చు. 2బి. చాలన నావాసన: పైన చెప్పిన ఆసనానికి కంటిన్యూ అవుతూ చేసే ఆసనం ఇది. అంటే ఆసనం చేసి నేల మీద పడుకుని రిలాక్స్అ వడం కన్నా దానిని రిపీట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండాలి అంటే చేతులు రెండూ స్ట్రెచ్ చేస్తే తల పైకి తీసుకువెళ్లి సీటు నడుము భాగాలను నేలమీద నుండి పైకి లేపాలి. తిరిగి శ్వాస వదులుతూ చేతులు తల వీపు భాగాన్ని పైకి లేపి చేతులు ముందుకు పాదాలకు దగ్గరగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. దీనిని 10 లేదా 20 సార్లు శ్వాస తీసుకుంటూ వెనుకకు శ్వాస వదులుతూ ముందుకు రావడం వలన పొట్ట దగ్గర కొవ్వు త్వరగా ఎక్కువగా కరగడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగాలు: వెన్నెముక, పిరుదుల భాగం, పొత్తికడుపు బలంగా అవుతాయి. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. హ్యాన్స్ట్రింగ్స్ బాగా స్ట్రెచ్ చేయబడతాయి. జీర్ణవ్యవస్థకి చాలా మంచిది. కుర్చీ ఆధారంగా చేయడం వలన చాలా ఎఫెక్టివ్‌గా పొట్ట భాగం దగ్గర ప్రెజర్ ఎక్కువ క్రియేట్ చేస్తూ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తలు: రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, గర్భిణీ స్త్రీలు చేయరాదు. క్రింద వెన్నెముక సమస్య ఉన్నవాళ్లు, గుండె సమస్య ఉన్నవాళ్లు, ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది. – సమన్వయం: సత్యబాబు - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్