కుమార్తెతో తల్లిదండ్రులు, పెద్దయ్య, నారాయణమ్మ
ఎర్రగుంట్ల: అసలే పేద కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది.. ఎలాగోలా పిల్లలను చదివించు కుంటున్నారు.. ఈ నేపథ్యంలో వారిపై విధి చిన్న చూపు చూసింది. పెద్ద కుమార్తె నాగకల్యాణికి మెదడు, వెన్నెముకలకు సంబంధించిన వ్యాధి వచ్చింది... ఆర్థిక సమస్యలతో వారు ఇబ్బందులు పడుతున్నా... శక్తికి మించి పలు ఆసుపత్రుల్లో చూపించారు... తీరా ఆస్పత్రిలో ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో వారు కుంగిపోయారు. ఎర్రగుంట్ల నగర పంచా యతీ పరిధిలో కడప రోడ్డులోని మహేశ్వరనగర్ కాలనీకి చెందిన మాన పెద్దయ్య, నారా యణమ్మల కూతురు నాగకల్యాణి 8వ తరగతి చదువుతోంది. తండ్రి పెద్దయ్య నాపరాయి గనుల్లో ట్రాక్టర్‌కు కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి నారాయణమ్మ ఇంటి వద్ద నే ఉండి కూతురి ఆలనాపాలన చూస్తోంది. పుట్టిన మూడు నెలల నుంచే నాగకల్యాణికి మెదడుకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆర్థికలేమి కారణంగా ఈ వ్యాధిని నయం చేయించే విషయంలో వారు దృష్టి సారించలేకపోయారు. బాలిక వయసు పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత పెరగసాగింది.
దీనికితోడు వెన్నెముక కూడా పనిచేయలేదు. దీంతో సరిగ్గా నడవలేని.. కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మాటలు కూడా సక్రమంగా రావడం లేదు. ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రులతో పాటు కర్నూలు, తిరుపతిలలోని పెద్ద ఆస్పత్రుల్లో చూపించి మందులు ఇప్పించారు. ప్రస్తుతం సమస్య తీవ్రంగా మారింది. ఇలాగే కొనసాగితే బాలిక కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్య చేయించడానికి వారికి ఆర్థికి స్థోమత ఏదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిద్దామని ప్రయత్నిస్తే ఆ జాబితాలో ఈ జబ్బు లేదని వైద్యులు తెలిపారు. ఈ స్థితిలో ఓ వైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కన్న కూతురు.. మరోవైపు చేతిల చిల్లిగవ్వలేని దీన స్థితి మధ్య ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. దాతలు కరుణించి సాయం అందిస్తే తమ బిడ్డను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment