Brain disease
-
కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..!
తిరువనంతపురం: కేరళలో మరో అరుదైన బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి వెలుగులోకి వచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు.. షాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు. చికిత్సను ప్రారంభించామని తెలిపారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. కలుషిత నీటితో స్నానం చేయకూడదని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైరానా పెడుతున్న హెచ్ఐవీ -
తెలియకుండానే ప్రాణాంతకమయ్యే మెదడు వ్యాధులు.. డాక్టర్ల సూచనలివే!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు. దాని పనితీరు బాగుంటేనే ఎవరైనా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇటీవలి కాలంలో మెదడుకు సోకుతున్న వ్యాధులు పెరిగాయి. ముఖ్యంగా పలు రకాల ఎన్‌సెఫలైటీస్‌లతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అలా వస్తున్న వారిలో ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటీస్, హెర్పిస్ ఎన్సెఫలైటీస్, జపనీస్ ఎన్‌సెఫలైటీస్‌లతో పాటు, రెసిస్టెన్స్ ఎపిలెప్సీ, అటాక్సియా వంటి సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాతే ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి నెలకు 20 నుంచి 30 మంది మెదడు సంబంధిత సమస్యలతో వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇటీవల ఈ కేసులు ఎక్కువ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం లేకుండా బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సోకుతున్న ఎన్సెఫలైటీస్లు, వాటి లక్షణాలు, చికిత్సలు ఇలా.. ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటీస్ శరీరంలోని యాంటీబాడీస్ ఒక్కోసారి కండరాలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్న వారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పలు రకాల కీళ్లవాతం సమస్యలు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిన వారికి మొదటి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్‌తో పాటు, అవసరమైతే డయాలసిస్ చేసి యాంటీబాడీస్‌ను అదుపుచేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. హెర్పిస్ ఎన్సెఫలైటీస్ ఇది హెర్పిస్ వైరస్ కారణంగా సోకే తీవ్రమైన మెదడు వాపు జబ్బు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. తీవ్రమైన జ్వరంతో ప్రారంభమై, ఫిట్స్ రావడం, 24 గంటల్లోనే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని వెంటనే గుర్తిస్తే నయం చేసేందుకు మంచి మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకితే కోలుకోవడానికి వారం నుంచి పదిరోజులు పడుతుంది. తొలిదశలో గుర్తించకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అటాక్సియా ఇది సోకిన వారు నడిచేటప్పుడు, నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంటారు. నడవడం కష్టంగా మారుతుంది. పిల్లలు, పెద్దవారిలో ఎవరికైనా రావచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జన్యు లోపం, క్రోమోజోముల్లో తేడాలతో ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ రకమైన జన్యుపరమైన లోపం ఉంటుంది. దీనిని గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చు. రెసిస్టెన్స్ ఎపిలప్సీ సరిగా మందులు వాడని ఫిట్స్ రోగులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి మెదడు మొద్దుబారిపోవడంతో మందులు సరిగా పనిచేయక ఫిట్స్ వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. మందులు వేసినప్పటికీ పనిచేయవు. స్పృహ కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వారికి ఎక్కువ సమయం పనిచేసే మందులు ఇస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి, మెదడు ఎంత వరకు డ్యామేజీ అయిందో నిర్ధారిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. అందువలన ఫిట్స్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిది. చికిత్సతో నయం చేయొచ్చు ఇటీవల ఎన్సెఫలైటీస్ రోగులు తరచూ వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఓపీకి నెలలో 20 మందికి పైగా ఇలాంటి రోగులు వస్తున్నారు. తీవ్రమైన జ్వరంలో ఫిట్స్ రావడం, మాట కోల్పోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో వస్తున్నారు. వారు ఏ రకమైన ఎన్సెఫలైటీస్తో బాధపడుతున్నారో ముందుగా నిర్ధారించి చికిత్స చేస్తున్నాం. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌కు తొలుత స్టెరాయిడ్స్ ఇచ్చి, తగ్గకుంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ఇస్తాం –డాక్టర్ దారా వెంకటరమణ, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!
చలికాలంలో చాలా ముప్పులు ΄పొంచి ఉంటాయి. దెబ్బ చిన్నగా తగిలినా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అలర్జీలు కనిపిస్తాయి. చర్మం ΄పొడిబారి పగులుతుంటుంది. కీళ్లనొప్పులు పెరుగుతాయి. నిజానికివన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్య... అందునా మెదడుకు సంబంధించిన ముప్పు ఒకటి ΄పొంచి ఉంటుంది. అదే మెదడుకు కలిగే రిస్క్. దాని పేరే ‘సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్’, సంక్షిప్తంగా దీన్ని ‘సీవీఏ’గా చెబుతారు. సెరిబ్రో వాస్కులార్ యాక్సిడెంట్ (సీవీఏ) అంటే ఏమిటి, అదెందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే అనర్థాలు, దాని నివారణ వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. చలికాలంలో కొన్ని సమస్యలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు వాతావరణంలో తేమ తగ్గడం... చర్మం నుంచి ఆ తేమను వాతావరణం లాక్కోవడంతో చర్మం పగుళ్లు, అలర్జీలు ఎక్కువ. అలాగే చలి కారణంగా చర్మం ఉపరితలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ తగ్గడం (వాసో కన్‌స్ట్రిక్షన్) మాత్రమే కాదు... చర్మంలో ఉండే నాడీ కణాలు బాగా ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో చిన్న చిన్న దెబ్బలకు సైతం నొప్పి తీవ్రంగా తెలుస్తుంటుంది. ఇవన్నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టని మామూలు సమస్యలు. కానీ సెరెబ్రో వాస్కులార్ యాక్సిడెంట్స్ అనే ముప్పు వల్ల మాత్రం పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చి అరుదుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. సెరెబ్రో–వాస్కులార్ యాక్సిడెంట్స్ ఎందుకంటే...? ముందుగా చెప్పుకున్నట్లుగా వాతావరణంలో తేమ (హ్యుమిడిటీ) తగ్గిపోవడంతో దాన్ని భర్తీ చేసుకునేందుకు పర్యావరణం మన దేహాల్లోని తేమను లాగేస్తుంది. (ఈ కారణంగానే చర్మం΄పొడిబారినట్లుగా కనిపించడం, గీరితే చారలు పడటం వంటివి సంభవిస్తాయి). అంతేకాదు వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడమూ తగ్గిపోతుంది. ఇంకా సాయంత్రాలు, రాత్రుళ్లు, తెల్లవారుఝామున బాగా చల్లగా ఉండటంతో రక్తం వేగంగా ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది మెదడులో రక్తస్రావానికి (బ్రెయిన్ హెమరేజ్)కి కారణం కావచ్చు. ఇక శీతకాలం బాగా చల్లగా ఉండటం వల్ల మనం నీళ్లు తాగడం బాగా తగ్గిపోతుంది. దాంతో రక్తం పలుచగా కాకుండా, చిక్కగా మారడంతో΄ాటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరుగుతాయి. ఫలితంగా ఈ క్లాట్స్ రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్), మరికొన్ని సార్లు మెదడులో కీలకమైన భాగాలకు రక్తం అందక పక్షవాతం రావచ్చు. (ఇవే క్లాట్స్ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో వస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది). ముప్పును మరింత పెంచే అంశాలు... దీనికి తోడు ‘సీవీఏ’ ప్రమాదాన్ని మరింత పెంచడానికి కొన్ని అంశాలు దోహదం చేస్తాయి. అవి... డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, మూత్రపిండాల జబ్బులు, ΄పొగతాగే అలవాటు వంటివి ఈ ముప్పును మరింత పెంచే అంశాలని చెప్పవచ్చు. రెండు రకాలుగా ‘సీవీఏ’ అనర్థాలు... మెదడులో ఏయే ప్రాంతాల్లో, ఏ రకంగా అనర్థాలు ఏర్పడ్డాయనే అంశం ఆధారంగా ‘సీవీఏ’ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మెదడులో రక్తస్రావమైతే దాన్ని ఇంట్రాసెరెబ్రల్ హేమరేజ్ (ఐసీహెచ్) అని, మెదడులోని రక్తనాళాల్లో రక్తపు ఉండలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. నివారణ / చికిత్స : ఇంతటి ప్రాణాపాయం తెచ్చిపెట్టే ఈ ‘సీవీఏ’కు నివారణ చాలా తేలిక. ఈ సీజన్లో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది నీళ్లు బాగా తాగుతూ ఉండటమే. దీనివల్ల దేహానికి హైడ్రేషన్ సమకూరుతుంది. వాటితో ΄ాటు... ∙గదిలో వెచ్చని వాతావరణంలో ఉండటం (ఒంటిని వెచ్చగా ఉంచుకోవడం) ∙సమయానికి టాబ్లెట్లు (డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండెజబ్బుకు వాడే మందులు) తీసుకోవడం ∙ పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం ∙అన్ని పోషకాలు ఉన్న సమతులాహారం తీసుకోవడం ∙చక్కెరలు చాలా తక్కువగా తీసుకోవడం ∙ఉప్పు చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడటం ∙క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌కు వెళ్తుండటం ∙మెదడుకు సంబంధించిన ఏ లక్షణం కనిపించినా తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి. అక్కడ లక్షణాలను గమనించి, అవసరాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. లక్షణాలు: తలలో తీవ్రమైన నొప్పి, వాంతులు∙ తల తిరగడం (డిజ్జీనెస్)∙ పూర్తిగా స్పృహ కోల్పోవడం. ఇవేగాక మరికొన్ని లక్షణాలను (బీఈఎఫ్ఏఎస్టీ) అనే ఇంగ్లిష్ అక్షరాల కలబోతతో ‘బీఫాస్ట్’ గా చెప్పవచ్చు. అంటే... ∙‘బీ’ ఫర్ బ్యాలెన్స్ అంటే సరిగ్గా నడవలేక బ్యాలెన్స్ కోల్పోవడం ∙‘ఈ’ ఫర్ ఐస్ (కళ్లు) అంటే కళ్లు మసకలు బారడం ∙‘ఎఫ్ ఫర్ ఫేస్ అంటే... ముఖంలో ఏదో ఒక వైపు జారిపోయినట్లుగా కావడం (పక్షవాతం లక్షణాల్లో ఒకటి) ∙‘ఏ’ ఫర్ ఆర్మ్స్ (భుజాలు) అంటే రెండు చేతుల్లో ఏదో ఒకటి బలహీనంగా మారడం పనిచేయకపోవడం ∙‘ఎస్’ ఫర్ స్పీచ్ అంటే మాట్లాడలేకపోవడం లేదా మాట ముద్దగా రావడం ∙‘టీ’ ఫర్ టైమ్ అంటే... అది ఆంబులెన్స్ అవసరమైన సమయం (టైమ్) అని అర్థం. -డా‘. ఎస్.పి.మాణిక్ ప్రభు సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా..
Regularly Consuming Fish May Protect Brain Health: సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్ బ్రెయిన్ డిసీజ్ గురించే ఇప్పుడు అంతటా చర్చజరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో సెరెబ్రోవాస్కులర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏట అమెరికాలోని ప్రతి లక్ష మందిలో 37.6 మరణాలు ఈ వ్యాధివల్లనే సంభవిస్తున్నాయి. మెదడులోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్ వంటి సమస్యలకు ఈ వ్యాధి కారణమవుతుందట. ఏమిటీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్? సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.. వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు సమస్యలతో ప్రారంభమై.. ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరితే డిమెన్షియాకు దారితీస్తుంది. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! చేపలకు - ఈ వ్యాధికి మధ్య సంబంధం ఏమిటి? జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, శారీరక వ్యాయామం, ఆరోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో సెరెబ్రోవాస్కులర్ వ్యాధి తాలూకు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇది మెదడుకు, సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. ఏదిఏమైనప్పటికీ అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధ్యయన నివేదికల ఫలితాలు ఇలా.. క్రాస్ సెక్షనల్ అధ్యయనాల తాజా నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశోధించింది. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చర్ డా. సిసిలియా సమీరి ఏంచెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడం పరిశోధనల్లో కనుగొన్నాము. ఐతే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు. అంటే చిన్నతనం నుంచే క్రమంతప్పకుండా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..
ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో మానసిక సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెల్లువలో పడి మెదడుకు తగిన వ్యాయామం ఇవ్వడమే మరచిపోతున్నాం. ఐతే పోషకాహారం ద్వారా ఏ విధంగా మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చో ఈ కింది అధ్యయనాల ద్వారా తెలుసుకుందాం.. చాక్లెట్స్ మీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమా.. ఐతే మీకో గుడ్ న్యూస్! చాక్లెట్స్ బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కోకో బీన్స్‌లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురించిన నివేధిక తెలియజేస్తుంది. మామూలు చాక్లెట్లకంటే డార్క్ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ పండ్లలో కూడా ఫ్లావోనాయిడ్స్ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనాలు వెల్లడించాయి. టీ మన అలవాట్లలో ముఖ్యమైనది ప్రతి ఉదయం ఒక కప్పు టీ తాగడం. దీనిలో అల్లం, మిరియాలువంటి భిన్న పదార్థాలను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం తెలిసిందే! ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట. చేపలు గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణ వరకు చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు డైమెన్షియా (చిత్తవైకల్యం) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆకు కూరలు బ్రొకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్ డామేజ్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్ ‘కె’, బేటా కెరోటిన్, లూటిన్, ఫోలెట్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. శారీరక వ్యాయామాలు, యోగా, డిజిటల్ గాడ్జెస్ను తక్కువగా వాడటం వంటి అలవాట్లతోపాటు ఈ ఆహార అలవాట్లు కూడా పాటించడం వల్ల మీ మెంటల్ హెల్త్‌ను పదికాలాలపాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..
గత రెండు మూడు యేళ్లుగా కోవిడ్ సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో వింత వ్యాధి జనాల్లో వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా వింతగానే ఉన్నాయట.. అంతుచిక్కని ఈ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్స్విక్ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు ఆనారోగ్యబారీన పడుతున్నారు. అక్కడి ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం 48 మంది ఇప్పటికే ఈ వ్యాధి బారీన పడ్డట్టు సమాచారం. వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తుతెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు. మరణించిన వారంతా మానసిక వ్యాధితో మృతిచెందినట్టు నివేదికలో చెప్పబడింది. ఈ వ్యాధి బారీన పడ్డవారిలో ఉద్రేకం, మైకం, భ్రమలు, మతిమరుపు, కండరాల నొప్పులు అధిక స్థాయిలో పెరిగినట్టు గుర్తించారు. అక్కడి అధికారులు దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా గత యేడాది చివరిలో కూడా ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో అబ్నార్మల్ న్యూరోలాజికల్ కేసులు బయటపడినట్టు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా హెచ్చరించింది. మరణించిన వారి మృతదేహాలను పరీక్షించడం ద్వారా దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రకరకాల వ్యాధులతో విసిగివేసారిపోయిన ప్రజలు.. ఎటునుంచి ఏ కొత్త వైరస్ రూపంలో ఏ వ్యాధి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకుని క్షణక్షణ గండంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడుకు సంబంధించిన ఈ కొత్త వ్యాధి ప్రజల్లో భయందోళనలు రేకెత్తిస్తోంది. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!!
మానవశరీర పనితీరును మెదడు నియంత్రిస్తుందని మీకు తెలుసా? మీ శరీరం ఒక కంప్యూటర్ ఐతే, మెదడు సీపీయూలా పనిచేస్తుందన్నమాట. అంటే శరీర అన్ని భాగాలకు మెదడు సమాచారాన్ని చేరవేస్తూ, మార్గనిర్ధేశం చేస్తూఉంటుంది. ఐతే యంత్రమైనా, మనిషైనా కాలక్రమేణా సామర్థ్యాన్ని కోల్పోవడమనేది అనివార్యం. మెదడు విషయానికొస్తే వృద్ధాప్య ఛాయలు పెరిగేకొద్దీ న్యూరోడిజెనరేషన్ ప్రారంభమవుతుంది. అయితే మెదడును చురుకుగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయని, ఏ వయసువారైనా వాటిని అనుసరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. కొత్త భాషలను నేర్చుకోవాలి మీకు ఏవైనా రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్నట్లయితే మీ మెదడు సుదీర్ఘకాలం మరింత చురుగ్గా పనిచేయగలుగుతుంది. ఇప్పటికే అనేక పరిశోధనలు ఈ విషయాన్ని దృవీకరించాయి. పబ్మెడ్ సెంట్రల్ ‘ది కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ బైలింగ్వల్’ పేర ప్రచురించిన నివేధిక ప్రకారం.. రెండు భాషల్లో ప్రావీణ్యత కలిగి ఉండటం వల్ల సృజనాత్మకత, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెంపుకు దోహదపడుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్ది పరిణమించే రుగ్మతల నుంచి కూడా కాపాడుతుంది. బ్రెయిన్ గేమ్స్ ఆడాలి పిల్లల్ని ఎప్పుడైనా గమనించారా? ఫజిల్స్, సమస్యా పరిష్కారం వంటి ఆటలు ఎక్కువగా ఆడటాన్ని ఇష్టపడతారు. ఇది వారి జ్ఞాన వృద్ది ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. చిన్నతనం (నేర్చునే వయసు) లోనేకాకుండా జీవితం తర్వాత దశల్లో కూడా మెదడు పనితీరును మెరుగుపరచుకునే అలవాటును కొనసాగించాలని సైన్స్ చెబుతోంది. జిగ్‌జాగ్ ఫజిల్స్, కార్డ్ గేమ్స్, క్విజ్.. వంటి ఆటలు మీ మెదడుకు పని పెట్టడమేకాకుండా పదునుగా ఉండేలా చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విశ్లేషాత్మక నైపుణ్యాలు, జ్ఞాపక శక్తి, సృజనాత్మక ఆలోచన తీరు పెంపుకు బ్రెయిన్ గేమ్స్ ఉపయోగపడతాయి. సంగీతం నేర్చుకోవాలి పియానో, గిటార్, ఫ్లూట్.. ఇతర వాయిద్యకారులు ఎంతో నైపుణ్యంతో, వేగంగా ఎలా వాయించగలుగుతాన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు మెదడే కారణం. ప్లస్ ఒన్ లో ‘హ్యాపీ క్రియేటివిటీ’ పేరుతో ప్రచురించబడిన ఒక నివేధిక ప్రకారం సృజనాత్మకత, మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మ్యూజిక్ మెరుగుపరుస్తుందని పేర్కొంది. వాయిద్యాలను నేర్చుకోవడం అనేది ఒక నైపుణ్యం. జ్ఞాపకశక్తి పెరుగుదలను, సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ధ్యానం చేయాలి ప్రాచీనకాలం నుంచే భారతీయ సంస్కృతిలో ధ్యానం అంతర్భాగంగా ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారా శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం మానసిక సమస్యలను తగ్గించడంలో, సమాచార విశ్లేషణ సామర్థ్యం పెంపుకు, మెరుగైన భావోధ్వేగ స్థితి స్థాపనకు ధ్యానం దోహదపడుతుంది. ఇంద్రియాలన్నింటికీ పనిచెప్పాలి మీ ముక్కుకు తాకిన ఏదైనా ఒక వాసన మీగతంలోని విషయాలను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చిందా? వాసనతో ఈవెంట్ యొక్క అనుబంధం కారణంగా మీ మెదడులో ముద్రించిన జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేస్తుందన్నమాట. వాసన, ధ్వని, దృశ్యాలు.. కూడా అలాగే పనిచేస్తాయి. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెప్పేదేంటంటే.. పంచేంద్రియాల (వాసన, రుచి, స్వర్శ, వినికిడి, చూపు) కార్యకలాపాలు మీ మెదడును చురుగ్గా ఉంచడానికి దోహద పడతాయని వెల్లడించింది. ఇది మెదడు పనితీరును బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది. చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న ‘అమీబా’
వాషింగ్టన్/టెక్సాస్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యధిక కేసులతో అగ్రరాజ్యం అమెరికా కకావికలమై పోతుంది. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు మరో కొత్త సమస్య వెలుగు చూసింది. మెదడుకు ఘోరమైన నష్టం కలిగించే.. సరిగా చెప్పాలంటే మెదడును తినే అమీబాను ఒకదాన్ని స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో గుర్తించారు టెక్సాస్ అధికారులు. ఈ అమీబా కారణంగా ఇప్పటికే ఓ ఆరేళ్ల బాలుడు మరణించడంతో ఇక్కడి ప్రభుత్వం విపత్తు ప్రకటనను జారీ చేసింది. జాక్సన్ సరస్సులో నీటిని పరీక్షించిన తర్వాత దానిలో మెదడును తినే అమీబా చేరినట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు. వివరాలు.. ఆరేళ్ల జోసియా మైక్ ఇంటైర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యి మరణించాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జోసియా తలలో అరుదైన మెదడును తినే అమీబాను గుర్తించారు. దీని కారణంగానే అతడు మరణించినట్లు వెల్లడించిన వైద్యులు మూలాలను కనుగోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జాక్సన్ సరస్సులో ఈ అమీబా బయటపడింది. జోసియా ఈ నీటితో ఆడటం లేదా తాగడం చేసినప్పుడు అమీబా తలలోకి చేరి.. మరణానికి దారి తీసిందని వెల్లడించారు వైద్యులు. నీరు తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి క్రమంగా తినడం ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణం తప్పదని హెచ్చరించారు. దాతో అధికారులు ప్రజలు ఎవరూ కూడా టాప్ వాటర్ తాగొద్దని, వంట చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. స్నానం ఇతర అవసరాలకు నీటిని వాడాలంటే కాసేపు కుళాయిలను ఒపెన్ చేసి ఉంచాలని సూచించారు. అత్యవసరమైతే బాగా వేడి చేసిన తర్వాతే తాగడానికి వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ క్లోరినేషన్ జరుగుతుది. (చదవండి: మరో భయకరమైన వ్యాధి మహారాష్టలో హై అలర్ట్) నీటిని ఇష్టపడే అమీబా తరచుగా వెచ్చని సరస్సులు, నదులు, హోస్ట్ స్ప్రింగ్‌లలో కనిపిస్తుంది అన్నారు అధికారులు. ఈ ప్రదేశాలలో ఈత కొట్టేటప్పుడు ప్రజలు సాధారణంగా వ్యాధి బారిన పడతారు. ఎందుకంటే సూక్ష్మజీవి ముక్కు పైకి చేరి అక్కడి నుంచి మెదడులోకి ప్రయాణిస్తుంది. అక్కడ ఇది కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫలితంగా మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇక ఈ వ్యాధి సోకినవారిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
ఆదుకోండయ్యా!
వారిది నిరుపేద కుటుంబం.. భర్త ప్రమాదంలో గాయపడి మెదడు సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు.. భార్య అన్నీ తానై సేవలు చేస్తోంది.. కనీసం మందులు తెచ్చుకునే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతోంది.. భర్తను చంటి పిల్లాడి కన్నా ఎక్కువగా చూసుకుంటూ కష్టించి పనిచేస్తున్నా బువ్వకు కూడా సరిపడడం లేదు. ఖరీదైన మందులు కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నెల్లూరు, రాపూరు: నాయుడుపేటకు చెందిన దూర్జటి రవికుమార్–లక్ష్మి దంపతులు. వీరికి సంతానం లేరు. రవికుమార్ 12 సంవత్సరాల క్రితం అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడి తలకు తీవ్రగాయాలు కావడంతో మంచం పట్టాడు. అప్పటి నుంచి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అన్ని వైద్యశాలల్లో చూపించారు. లక్ష్మి తమ్ముడికి తెలిసిన, లండన్‌లో ఉంటున్న వైద్యుడు వినోద్‌రెడ్డి నెల్లూరుకు వస్తే రవికుమార్‌ని చూపించారు. ఖరీదైన ఇంజెక్షన్ వేసి చూడాలని ఆయన సూచించారు. అలాగే పలు ఆస్పత్రుల వైద్యులు కూడా ఆ జబ్బుకు ఖరీదైన వైద్యం చేయించాలని, లేకపోతే నిత్యం మందులు వాడుతూ ఉండాలని వైద్యులు సూచించారు. మందుల కోసం ప్రతి నెలా సుమారు రూ.7 వేలు ఖర్చవుతోంది. మందులు వాడితే కొంతమేర మామూలుగా ఉంటాడు.. మందులు వాడకపోతే నడవలేని పరిస్థితి.. మతిస్థిమితం లేని వ్యక్తిలా మంచానికే పరిమితమవుతాడు. రవికుమార్ తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. అతనికి వచ్చే పెన్షన్‌లో ప్రతి నెలా రూ.5 వేలు ఇచ్చేవాడు. ఆయన గత డిసెంబర్ 11న మృతిచెందడంతో ఇక రవికుమార్‌కు సాయం చేసే వారు లేకపోయారు. దీంతో రవికుమార్–లక్ష్మి దంపతులు పెంచలకోనలోని ఒక సత్రం పంచన చేరారు. లక్ష్మి సత్రానికి వచ్చి పోయే వారికి అన్నం వండిపెడుతూ భర్తను చూసుకుంటోంది. వీరికి పిల్లలు లేకపోవడంతో లక్ష్మి రవికుమార్‌ను కన్న కొడుకులా చూసుకుంటోంది. ఖరీదైన మందులు వాడితే ప్రయోజనం ఉంటుందన్న వైద్యుల సూచనలు కొంత ఆశ కలిగిస్తున్నాయి. దయ గల దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సాయం చేయదలుచుకుంటే పెంచలకోనలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నంబర్ – 91107012907కు నగదు సాయం అందించాలని, లేదా 9390190202 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని లక్ష్మి కోరుతోంది. -
ఫుట్‌బాల్‌తో మెదడుకు డేంజర్
న్యూఢిల్లీ : సాకర్‌గా పిలిచే ఫుట్‌బాల్ ఆట పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో క్రేజీ ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం ప్రత్యర్థి పద్మ వ్యూహాలను తప్పించుకుంటూ క్రీడాకారులు ఫుట్‌బాల్‌ను పాదాలతో, మోకాళ్లతో గోల్‌వైపు తీసుకెళ్లి కాళ్లతోనో, తలతోనో గోల్ చేయడం ఉత్కంఠను రేపుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘పీలే’ లాగే వెనుతిరిగి రివర్స్ కిక్ కొడితే ఉత్సాహం రెండింతలు అవుతుంది. ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి ఓ ప్రమాదకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. క్రీడాకారులు తలతో ఫుట్‌బాల్‌ను కొట్టడం వల్ల సామాన్యులకన్నా మూడున్నర రెట్లు ఎక్కువగా మెదడు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఫుట్బాలర్లపైన అధ్యయనం జరిపిన ప్రముఖ డాక్టర్ బెన్నెట్ ఒమలు కనుగొన్నారు. అందుకని ఫుట్ బాల్ క్రీడలో తలతో బాల్‌ను కొట్టడాన్ని నిషేధించాలని, అది సాధ్యం కాకపోతే కనీసం 18 లోపు పిల్లలు అలా చేయకుండా నిబంధన విధించాలని ఆయన ప్రపంచ క్రీడాధికారులకు పిలుపు ఇచ్చారు. క్రీడల్లో రాణించడం కోసం చిన్న పిల్లలప్పటి నుంచి ఫుడ్‌బాల్ నేర్పిస్తున్నారని, అందులో భాగంగా వారు తలతో బాల్‌ను కొడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు మెదడు సంపూర్ణంగా అభివృద్ధి చెందదని, ఫుట్‌బాల్ దెబ్బల వల్ల వారిలో మెదడు అభివృద్ధి మందగిస్తుందని ఆయన హెచ్చరించారు. తలవొంచి బాల్‌ను కొట్టినప్పుడల్లా మెదడుకు కనిపించనంత సూక్ష్మ స్థాయిలో గాయం అవుతుందని, ఊహాత్మకంగా చెప్పడం లేదని సైంటిఫిక్‌గా చెబుతున్నానని ఆయన తెలిపారు. ఫుట్‌బాల్‌ను కొట్టేటప్పుడు తల అటూ ఇటు తిప్పుతారని, అప్పుడు కపాలం లోపల మెదటు అటూ ఇటూ ఊగుతుందని, ఫుట్‌బాల్ తగిలినప్పుడల్లా మెదడుకు ఒక చోట కాకుండా పలు చోట్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉందని, తొలుత దీని ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చని, గాయాలు పెరిగినప్పుడు, వయస్సు మీరినప్పుడు మెదడుకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయని ఆయన చెప్పారు. ఫుట్‌బాల్ వల్ల రిస్క్ ఉందనే విషయం 2002లో ప్రముఖ అమెరికా ఫుట్‌బాల్ ప్లేయర్ మైక్ వెబ్‌స్టర్‌కు అటాప్సీ చేసినప్పుడు ఆయన మెదడులో వచ్చిన మార్పులు గమనించానని అప్పటికే న్యూరాలజిస్ట్ అయిన బెన్నెట్ చెప్పారు. ఆయన 50 ఏళ్లకు మరణించాడని, అప్పటికే ఆయన మెదడులో అన్ని మార్పులు రాకూడదని ఆయన అన్నారు. మెదడుకు పునరుత్పత్తి లక్షణం లేదుగనుక దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఆ తర్వాత చాలా మంది ఫుట్‌బాలర్లపై పరీక్షలు జరపగా, వారిలో కొందరికి ‘క్రానిక్ ట్రామాటిక్ ఎన్సిఫాలోపతి’ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. దీనివల్ల డిమెన్షియా కూడా వస్తుందని ఆయన హెచ్చరించారు. తన హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న అమెరికా సాకర్ ఫెడరేషన్, 11 ఏళ్ల లోపు పిల్లలు తలతో ఫుట్‌బాల్ ఆడకుడదంటూ నిషేధం విధించిందని, 11 నుంచి 13 ఏళ్ల పిల్లలు పరిమితంగా ఆడాలంటూ ఆంక్షలు విధించిదని డాక్టర్ బెన్నెట్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్శిటీలోని మెడికల్ పాథాలజీ విభాగంలో అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. -
పసితనంపై మృత్యుపంజా
బిహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రభుత్వాసుపత్రి మృత్యుగీతం ఆలపిస్తోంది. అమ్మలా అక్కున చేర్చుకుని ఆదరించి స్వస్థత చేకూర్చాల్సిన ఆసుపత్రి పసిపిల్లల ప్రాణాలు హరిస్తోంది. కేవలం 17 రోజుల్లో అక్కడ 130మంది మరణించారు. ఆ ఒక్కచోటే కాదు... ఆ జిల్లాలోని వేరే ప్రాంతాల్లో, పొరుగునున్న చంపారన్, మోతీహరి జిల్లాల్లో సైతం ఇప్పటికి వేయిమందికిపైగా పిల్లలు మెదడు వాపు వ్యాధి లక్షణాలతో ఇలా ఆసుపత్రుల్లో చేరారు. ఇంకా చేరుతున్నారు. ఒకపక్క ప్రభుత్వా సుపత్రులన్నీ ఇలా వ్యాధి సోకిన పిల్లలతో కిటకిటలాడుతుంటే పశ్చిమబెంగాల్లో వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం వైద్య సిబ్బంది సమ్మె చేయడంతో అసలే అంతంత మాత్రంగా వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. ముజఫర్‌పూర్, దాని పొరుగు జిల్లాల్లో 1995 మొదలుకొని ఏటా ఇదే కాలంలో ఈ వ్యాధి ప్రబలుతున్నా వ్యాధికారక వైరస్ ఏమిటో, అదెందుకు వ్యాపిస్తున్నదో శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు. దాని సంగతలా ఉంచి కనీసం ఇది దాపురించే కాలానికి ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల్ని చేర్చుకుని చికిత్స అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలోనూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా దీన్ని అక్యూట్ ఎన్సెఫ లైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) అని పిలుస్తున్నా అది స్పష్టంగా ఫలానా కారణంగా వస్తుందని నిర్ధారించలేదు. వైరస్లు, బాక్టీరియా, ఫంగీ తదితరాలవల్ల ఈ సిండ్రోమ్ రావొచ్చునని, వడదెబ్బ తగలడం వల్ల సైతం ఇది ఏర్పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. (చదవండి : బిహార్‌లో హాహాకారాలు) ముజఫర్‌పూర్‌లో వ్యాధి గ్రస్తులైన పిల్లల్లో 98శాతంమందికి ఏఈఎస్‌తో పాటు హైపోగ్లైసీమియా లక్షణాలుంటున్నాయన్నది వైద్యుల మాట. ఇలాంటి స్థితి వియత్నాం, బంగ్లాదేశ్‌ల తర్వాత ముజఫర్‌పూర్‌లోనే కనిపిస్తున్నదని వారంటున్నారు. పౌష్టికాహారలోపం వల్ల లేదా సరైన తిండి తినకపోవడంవల్ల హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పడిపోవడం దీని లక్షణం. ఖాళీ కడుపున స్థానికంగా లభించే లిచీ ఫ్రూట్ తింటున్న పిల్లల్లో తీవ్రమైన జ్వరం రావడం, చూస్తుండగానే అయోమయావస్థలోకి వెళ్లడం లేదా పిచ్చివాళ్లుగా మారడం, చివరకు కోమాలోకి వెళ్లడం చూసి వీరందరికీ ఏఈఎస్తోపాటు హైపోగ్లైసీమియా కూడా ఉన్నదని తేలుస్తున్నారు. లిచీ ఫ్రూట్లో ఉండే హైపోగ్లైసిన్–ఏ అనే పదార్ధం విషపూరితమైనదని, మితిమీరి తింటే ఆ పదార్థం శరీరంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ పండ్లు అధికంగా లభించే మే, జూన్ మాసాల్లోనే పిల్లల్లో ఈ ప్రాణాంతక వ్యాధి బయటపడుతోంది. పైగా ఈ పండ్లు తిన్నాకే వారంతా మంచాన çపడుతున్నారు. కనుక వ్యాధి మూలాలు లిచీ ఫ్రూట్లో ఉండొచ్చునని లెక్కేస్తున్నారు. ముజఫర్‌పూర్‌లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేస్తామని, పిల్లలకు వందపడకల ఐసీయూ యూనిట్, వైరాలజీ ల్యాబ్ నెలకొల్పుతామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ పని ముందే జరిగుంటే సమస్య ఇంత ముదిరేది కాదు. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్డీఏ ప్రభుత్వం 2015లో ప్రకటించింది. దానికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి కూడా. కానీ ఎందుకో ఇంతవరకూ అది సాకారం కాలేదు. అంతకు చాన్నాళ్లముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది. మొన్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తామొస్తే ఆరోగ్య పరిరక్షణను ప్రాథమిక హక్కు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్రకటించారు. ఇలా ఎవరెన్నిసార్లు చెబుతున్నా ఆరోగ్యరంగానికి కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మన దేశంలో చికిత్సకు అవకాశమున్న వ్యాధుల వల్ల ఏటా 24 లక్షలమంది జనం చనిపోతున్నారంటే వైద్య సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ఇక్కడ ప్రతి లక్షమంది రోగగ్రస్తుల్లో 122మంది నాసిరకం వైద్యసదుపాయాల కారణంగా చనిపోతున్నారని లాన్సెట్ గ్లోబల్ సర్వే చెబుతోంది. ఇది బ్రెజిల్(74), రష్యా(91), చైనా(46), దక్షిణాఫ్రికా(93), బంగ్లాదేశ్(57) దేశాలతో పోలిస్తే చాలాఎక్కువ. ముజఫర్‌పూర్, దాని పొరుగునున్న జిల్లాల్లో పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడం, పౌష్టికాహార లోపం లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదు. కనీసం అక్కడ తగినంతమంది వైద్యులున్నా, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా పసివాళ్ల ప్రాణాలు ఇలా గాల్లో కలిసేవి కాదు. వ్యాధి సోకిన నాలుగు గంటల్లోగా పిల్లలకు 10 శాతం డెక్స్‌ట్రోజ్‌ను అందిస్తే వారు సత్వరం కోలుకునే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆమాత్రం సదుపాయమైనా అందుబాటులో లేదు. చిత్రమేమంటే బిహార్‌కు పొరుగునున్న ఉత్తరప్రదేశ్ తూర్పుప్రాంతంలో సైతం పౌష్టికా హారలోపం అధికంగా ఉంది. దేశంలో ఏటా సంభవించే పిల్లల మరణాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 35 శాతం. ముజఫర్‌పూర్‌ను స్మార్ట్ నగరంగా ప్రకటించమంటూ కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ప్రభుత్వం ఆమధ్య నివేదిక అందజేసింది. దాని ప్రకారం ఆ నగరంలో ప్రతి లక్షమంది రోగులకు 80మంది వైద్యులున్నారు. అక్కడి ఇతర జిల్లాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి గనుక ముజఫర్‌పూర్ చాలా మెరుగ్గా ఉన్నదని అనుకోవాలి. ఎందుకంటే చాలాచోట్ల లక్షమంది రోగులకు సగటున కేవలం ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఉన్నారు! సాధారణ పరిస్థితుల్లో కనీసం లక్షమంది రోగులకు వందమంది వైద్యులుండటం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలన్నిటికీ హితవు చెబుతోంది. పట్టించుకునేవారేరి? వైద్యరంగంపై సమగ్రమైన దృక్పథంతో వ్యవహరించి సమూల ప్రక్షాళన చేయడానికి అవసరమైన నిధులను, మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థ బాగుపడదు. అంతవరకూ ఈ మరణమృదంగం ఆగదు. -
బిహార్‌లో హాహాకారాలు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. -
లిచీ పండ్లకు.. పిల్లల ప్రాణాలు హరీ!
ముజఫర్ పూర్: బీహార్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన బాలల మరణాలకు లిచీ పండ్లు కారణమా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడువాపును పోలిన వ్యాధి కారణంగా ఈ ప్రాంతంలో గత 12 రోజుల్లో దాదాపు 50 మంది పదేళ్ల వయసులోపు పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు అక్యూట్ ఎన్సెఫలైటీస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినా.. చాలామంది రక్తంలో చక్కర మోతాదులు అకస్మాత్తుగా తగ్గిపోయాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి అశోక్ కుమార్ సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశామని.. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పామని అశోక్ కుమార్ వివరించారు. ప్రస్తుతం శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో 40 మంది పిల్లలు ఇదే రకమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. లిచీ పంటకు పేరు.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతం లిచీ పండ్లకు పెట్టింది పేరు. గతంలోనూ ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. వేసవిలో పిల్లలు తోటల్లో ఆడుకుంటూ ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారని.. ఈ క్రమంలో రాత్రి భోజనం మానేస్తూంటారు. అయితే లిచీ పండ్లలో ఉండే హైపోగ్లైసిన్ సైక్రోప్రొపైల్ అసిటిక్ ఆసిడ్ రాత్రి పూట రక్తంలోని చక్కెర మోతాదులను గణనీయంగా తగ్గించి వేస్తుందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. పదేళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే ఇతర ఆహారం ఏదీ తీసుకోక ముందు లిచీ పండ్లు తినకూడదని బీహార్ ఆరోగ్యశాఖ సూచించింది. ఒకవేళ పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండా లిచీ పండ్లు తిని ఉంటే రాత్రి వేళలో వీలైనంత తొందరగా ఆహారం తీసుకోవాలని సూచించింది. -
గోశాల ఘోష!
గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి. కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది. చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్ డ్రెయినేజీకి రూ.8 లక్షలు, కాంక్రీట్ ప్లాట్పామ్ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు. ఏం చేశారంటే.. సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్‌పాం నిర్మించారు. మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు. గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం. ఎస్కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ -
చిన్నారి ప్రాణం..కోరుతోంది ఆపన్నహస్తం..
ఎర్రగుంట్ల: అసలే పేద కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది.. ఎలాగోలా పిల్లలను చదివించు కుంటున్నారు.. ఈ నేపథ్యంలో వారిపై విధి చిన్న చూపు చూసింది. పెద్ద కుమార్తె నాగకల్యాణికి మెదడు, వెన్నెముకలకు సంబంధించిన వ్యాధి వచ్చింది... ఆర్థిక సమస్యలతో వారు ఇబ్బందులు పడుతున్నా... శక్తికి మించి పలు ఆసుపత్రుల్లో చూపించారు... తీరా ఆస్పత్రిలో ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో వారు కుంగిపోయారు. ఎర్రగుంట్ల నగర పంచా యతీ పరిధిలో కడప రోడ్డులోని మహేశ్వరనగర్ కాలనీకి చెందిన మాన పెద్దయ్య, నారా యణమ్మల కూతురు నాగకల్యాణి 8వ తరగతి చదువుతోంది. తండ్రి పెద్దయ్య నాపరాయి గనుల్లో ట్రాక్టర్‌కు కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి నారాయణమ్మ ఇంటి వద్ద నే ఉండి కూతురి ఆలనాపాలన చూస్తోంది. పుట్టిన మూడు నెలల నుంచే నాగకల్యాణికి మెదడుకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆర్థికలేమి కారణంగా ఈ వ్యాధిని నయం చేయించే విషయంలో వారు దృష్టి సారించలేకపోయారు. బాలిక వయసు పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత పెరగసాగింది. దీనికితోడు వెన్నెముక కూడా పనిచేయలేదు. దీంతో సరిగ్గా నడవలేని.. కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మాటలు కూడా సక్రమంగా రావడం లేదు. ఆమె తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రులతో పాటు కర్నూలు, తిరుపతిలలోని పెద్ద ఆస్పత్రుల్లో చూపించి మందులు ఇప్పించారు. ప్రస్తుతం సమస్య తీవ్రంగా మారింది. ఇలాగే కొనసాగితే బాలిక కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్య చేయించడానికి వారికి ఆర్థికి స్థోమత ఏదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిద్దామని ప్రయత్నిస్తే ఆ జాబితాలో ఈ జబ్బు లేదని వైద్యులు తెలిపారు. ఈ స్థితిలో ఓ వైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కన్న కూతురు.. మరోవైపు చేతిల చిల్లిగవ్వలేని దీన స్థితి మధ్య ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. దాతలు కరుణించి సాయం అందిస్తే తమ బిడ్డను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు. -
సూదితో మెదడకు చికిత్స
చెన్నై: మెదడులోని వ్యాధిని గుర్తించడంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కనుగొనే అవకాశం ఉన్న మెదడులోని గడ్డను కేవలం సూది సహాయంతో నిర్ధారించారు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రి (జీహెచ్)లోని మెదడు వ్యాధి నివారణ విభాగంలో కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధులకు ఆధునిక చికిత్సను అందిస్తున్నారు. తాజాగా ఈ విభాగానికి రూ.55 లక్షలతో అత్యాధునిక యంత్రం మంజూరైంది. స్ట్రియోటాక్సీ అనే పేరుగల ఈ యంత్రం సహాయంతో మెదడులో అతి సున్నితమైన ప్రాంతంలో, ఇతర పరీక్షలకు అందని క్లిష్టతరమైన వ్యాధులను సులభంగా కనుగొని చికిత్స చేయవచ్చని అక్కడి వైద్యులు చెబుతున్నారు. స్ట్రియోటాక్సీ యంత్రం పనితీరును వివరించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి డీన్ విమల, డిప్యూటీ డీన్ రంగరాజన్ జోతి మాట్లాడుతూ, మెదడులో గడ్డలు ఏర్పడితే వాటిని గుర్తించేందుకు రోగికి అనస్తీషియా (మత్తుమందు) ఇవ్వకుండా, శస్త్రచికిత్స చేయకుండానే గుర్తించవచ్చని తెలిపారు. రోగి స్పృహలో ఉండగానే తలలోకి సూదిని ప్రవేశింపజేసి మెదడులోని గడ్డలను తొలగించవచ్చని చెప్పారు. ఈ విధానం వల్ల తలకు అతిపెద్ద శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం తప్పుతుందని అన్నారు. అంతేగాక రోగి కొన్ని రోజుల్లో వ్యాధినయమై డిశ్చార్జి కావచ్చని తెలిపారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా ఇప్పటి వరకు 9 మందికి విజయవంతంగా చికిత్సలు జరిపినట్లు చెప్పారు. ఈరకమైన చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుండగా తాము పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు. -
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన రేణుక
కొత్తగూడ : మెదడు సంబంధ వ్యాధితో 12 రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ విద్యార్థి గొంది రేణుక(22) తుదిశ్వాస విడిచింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. మండలంలోని ముస్మి గ్రామానికి చెందిన రేణుక చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేది. ఇటీవల జ్వరం రావడం తో మెదడులో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు వైద్యం అందించే సమయానికే కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రేణుక పరిస్థితిపై ‘సాక్షి’లో కూడా ఈ నెల 24న ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆమెను మృత్యువు కబలించింది. రేణుక మృతితో ఆమె సహవిద్యార్థులు కన్నీరుమున్నీరయ్యూరు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ముస్మిలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు.