
ముజఫర్ పూర్: బీహార్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన బాలల మరణాలకు లిచీ పండ్లు కారణమా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడువాపును పోలిన వ్యాధి కారణంగా ఈ ప్రాంతంలో గత 12 రోజుల్లో దాదాపు 50 మంది పదేళ్ల వయసులోపు పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు అక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినా.. చాలామంది రక్తంలో చక్కర మోతాదులు అకస్మాత్తుగా తగ్గిపోయాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి అశోక్ కుమార్ సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశామని.. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పామని అశోక్ కుమార్ వివరించారు. ప్రస్తుతం శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో 40 మంది పిల్లలు ఇదే రకమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.
లిచీ పంటకు పేరు..
బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతం లిచీ పండ్లకు పెట్టింది పేరు. గతంలోనూ ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. వేసవిలో పిల్లలు తోటల్లో ఆడుకుంటూ ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారని.. ఈ క్రమంలో రాత్రి భోజనం మానేస్తూంటారు. అయితే లిచీ పండ్లలో ఉండే హైపోగ్లైసిన్ సైక్రోప్రొపైల్ అసిటిక్ ఆసిడ్ రాత్రి పూట రక్తంలోని చక్కెర మోతాదులను గణనీయంగా తగ్గించి వేస్తుందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. పదేళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే ఇతర ఆహారం ఏదీ తీసుకోక ముందు లిచీ పండ్లు తినకూడదని బీహార్ ఆరోగ్యశాఖ సూచించింది. ఒకవేళ పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండా లిచీ పండ్లు తిని ఉంటే రాత్రి వేళలో వీలైనంత తొందరగా ఆహారం తీసుకోవాలని సూచించింది.