మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన రేణుక
కొత్తగూడ : మెదడు సంబంధ వ్యాధితో 12 రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ విద్యార్థి గొంది రేణుక(22) తుదిశ్వాస విడిచింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. మండలంలోని ముస్మి గ్రామానికి చెందిన రేణుక చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేది. ఇటీవల జ్వరం రావడం తో మెదడులో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఆమెకు వైద్యం అందించే సమయానికే కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రేణుక పరిస్థితిపై ‘సాక్షి’లో కూడా ఈ నెల 24న ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆమెను మృత్యువు కబలించింది.
రేణుక మృతితో ఆమె సహవిద్యార్థులు కన్నీరుమున్నీరయ్యూరు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ముస్మిలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు.