ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో మానసిక సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెల్లువలో పడి మెదడుకు తగిన వ్యాయామం ఇవ్వడమే మరచిపోతున్నాం. ఐతే పోషకాహారం ద్వారా ఏ విధంగా మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చో ఈ కింది అధ్యయనాల ద్వారా తెలుసుకుందాం..
చాక్లెట్స్
మీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమా.. ఐతే మీకో గుడ్ న్యూస్! చాక్లెట్స్ బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కోకో బీన్స్‌లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురించిన నివేధిక తెలియజేస్తుంది. మామూలు చాక్లెట్లకంటే డార్క్ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ పండ్లు
ఆరెంజ్ పండ్లలో కూడా ఫ్లావోనాయిడ్స్ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనాలు వెల్లడించాయి.
టీ
మన అలవాట్లలో ముఖ్యమైనది ప్రతి ఉదయం ఒక కప్పు టీ తాగడం. దీనిలో అల్లం, మిరియాలువంటి భిన్న పదార్థాలను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం తెలిసిందే! ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట.
చేపలు
గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణ వరకు చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు డైమెన్షియా (చిత్తవైకల్యం) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.
ఆకు కూరలు
బ్రొకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్ డామేజ్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్‌పరిమెంటల్ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్ ‘కె’, బేటా కెరోటిన్, లూటిన్, ఫోలెట్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
శారీరక వ్యాయామాలు, యోగా, డిజిటల్ గాడ్జెస్‌ను తక్కువగా వాడటం వంటి అలవాట్లతోపాటు ఈ ఆహార అలవాట్లు కూడా పాటించడం వల్ల మీ మెంటల్ హెల్త్‌ను పదికాలాలపాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment