హైదరాబాద్: నగర వైద్య చరిత్రలోనే తొలిసారిగా 65 ఏళ్ల మహిళకు వెన్నెముకలో స్టెంటింగ్ వేశారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కృష్ణచైతన్య ఈ అరుదైన చికిత్స చేశారు. అచ్చం గుండెకు స్టెంట్ వేసినట్లే ఎముకకు సైతం మెటల్ స్టెంట్ వేయడం ద్వారా రోగికి ఊరట కల్పించారు. కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ.. గత నెలలో ఓ మహిళ ఇంట్లో నేలపై పడిపోయింది. విపరీతంగా వెన్నునొప్పితో బాధ పడుతూ.. కనీసం నడిచే స్థితిలో లేకపోవడంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లగా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దాంతో ఆమెకు గ్యాస్టైటిస్, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ గ్రాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సృజన్ వద్దకు వెళ్లగా.. ఆయన తన వద్దకు పంపడంతో వెన్నెముక విరిగిన విషయం గుర్తించానని డాక్టర్ కృష్ణచైతన్య చెప్పారు. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయడం ముప్పుతో కూడుకున్నదని, సెడేషన్ మాత్రం ఇచ్చి స్టెంటింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్లు, ఇతర చిన్నపాటి సమస్యలు ఉన్న పెద్ద వయసువారికి వెన్నెముకలోని ఎముకలు విరిగితే ఈ చికిత్స చాలా ఉపయోగకరమన్నారు.
సాధారణంగా శస్త్ర చికిత్స చేసే 3– 4 గంటలు పట్టడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి శస్త్ర చికిత్సల్లో అయితే స్క్రూలు బిగిస్తామన్నారు, దాని వల్ల కోలుకోవడానికి కూడా చాలా నెలలు పడుతుందన్నారు. కానీ ఈ ప్రక్రియలో స్టెంట్‌ను కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ రంధ్రం ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. ఇది లోపలకు వెళ్లి ఎముక వద్ద విస్తరిస్తుందన్నారు. దానివల్ల ఎముక తన సాధారణస్థితికి వచ్చేస్తుందన్నారు. ఎలాంటి నొప్పి కూడా లేకపోవడంతో ఆపరేషన్ అయిన కొద్ది గంటలకే రోగి లేచి నడవగలిగారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment