
ఆశావహుల మెడపైపొత్తుల కత్తి
సాక్షిప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉండదని స్పష్టత రావడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశిం చారు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుకూలత ఉందని... ఇప్పుడే పోటీ చేయాలని కొత్త నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే పొత్తులు ఉండవని అన్ని రకాలుగా పోటీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సీసీఐ పొత్తు, టీఆర్‌ఎల్‌డీ విలీనం పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ రెండు పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలే చెబుతుండడంతో పోటీ చేసే ఆలోచనతో ఉన్న వారికి షాక్ తగిలినంత పనవుతోంది. సీపీఐ పొత్తుతో ఒక అసెంబ్లీ సీటు, టీఆర్‌ఎల్‌డీ విలీనంతో ఇంకో సీటు... కాంగ్రెస్‌కు తగ్గనున్నాయి.
టీఆర్‌ఎల్‌డీ విలీనం జరిగితే వరంగల్ పశ్చిమ సీటును ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐకి ఇచ్చే అసెంబ్లీ స్థానం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సీపీఐతో సర్దుబాటు, టీఆర్‌ఎల్‌డీ విలీనంతో రెండు సీట్లు పోతే కాంగ్రెస్ వారికి పది సీట్లు మాత్రమే ఉండనున్నాయి. ఇది కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు ఖరారైందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని ఇరు పార్టీల ముఖ్యలు చెబుతున్నారు. సీపీఐతో పొత్తులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కనీసం ఒక అసెంబ్లీ సీటును.. మొత్తం 12 సీట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రధానంగా మహబూబాబాద్ సీటును తమకు ఇవ్వాలని కోరుతోంది. 1967, 1994లో ఇక్కడ సీపీఐ గెలిచింది. 1972, 1989లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీటు విషయంలో సీపీఐ తీవ్రంగా పట్టుబట్టే అవకాశం ఉంది.
ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోత్ కవిత ఉన్నారు. కవిత తండ్రి డి.ఎస్.రెడ్యానాయక్ డోర్నకల్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రం వర్తింపజేసి మహబూబాబాద్‌ను సీపీఐకి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐ జిల్లాలో రెండో సీటు కోరితే స్టేషన్‌ఘన్‌పూర్ ఉంటుందని తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడంతో రెండు పార్టీలకు ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది.
రెండు పార్టీల పరిస్థితిని చూస్తే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గమే సీపీఐకి వెళ్తుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ఆ పార్టీలో చేరిన జి.విజయరామారావు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నర్థకంగా ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్, టీడీపీ ఇంచార్జీలు టీఆర్‌ఎస్‌లో చేరవడం వల్లే విజయరామారావు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు సీపీఐకి సీటు కేటాయిస్తే విజయరామారావుకు మళ్లీ ఆశాభంగం తప్పకపోవచ్చు.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేసే ప్రతిపాదనతో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్‌ఎల్‌డీ) ఉంది. విలీనం లేకున్నా పొత్తు కుదిరే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎల్‌డీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎల్‌డీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎల్‌డీ విలీనం జరిగినా, పొత్తు కుదరినా ఈ సీటు దిలీప్‌కుమార్‌కు పోతుంది. కాంగ్రెస్‌లోని 12 మంది నాయకులు వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌లో టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు.
టీఆర్‌ఎల్‌డీ విలీనం లేదా పొత్తు ప్రతిపాదనతో వీరందరిలో ఆందోళన నెలకొంది. వరంగల్ పశ్చిమ(హన్మకొండ) సెగ్మెంట్‌ను కాంగ్రెస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయిస్తోంది. 2004లో టీఆర్‌ఎస్‌కు ఈ సీటు ఇచ్చినప్పుడు మినహా ఇదే జరుగుతోంది. కపిలవాయి దిలీప్‌కుమార్ ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎల్‌డీ విలీనం జరిగినా... పొత్తు కుదిరినా దిలీప్‌కుమార్‌కు టిక్కెట్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.