వైద్య, ఆరోగ్యశాఖ ప్రక్షాళన: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్:వైద్య, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తానని, అంతా పారదర్శకంగా ఉండేట్లు చూస్తానని మంత్రి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.వె ద్య ఆరోగ్యశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బర్తరఫ్‌కు గురైన రాజయ్య స్థానంలో లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూపై ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
తాను పారదర్శకంగా ఉంటానని, సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తానన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు ఆసుపత్రికి చెందిన ఒక అధికారికి పారిశుధ్య ఇన్‌చార్జి బాధ్యత అప్పగిస్తామన్నారు. అక్కడి మార్చురీ అత్యంత భయంకరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
అధికారులకు కట్టుదిట్టమైన సూచనలు: తెలంగాణ మొదటి ప్రభుత్వంలో మొదటిసారిగా ఒక మంత్రిని అవినీతి ఆరోపణలతో తొలగించిన నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిపై ఒత్తిడి పెరిగింది. అవినీతి ఆరోపణలు, వైద్య పారామెడికల్ పోస్టుల భర్తీకి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అక్రమ అనుమతులు, ఎన్‌హెచ్‌ఎం నిధుల ఖర్చులో తలెత్తిన వ్యవహారాలపై ఆయన మొదటిరోజే తెలుసుకున్నట్లు సమాచారం.
అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ మంత్రి నిక్కచ్చిగా తన ప్రాధమ్యాలను వివరించినట్లు తెలిసింది. ఇకనుంచి అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. బుధవారం సచివాలయానికి వచ్చి ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు
గాంధీ ఆస్పత్రిని సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వైన్‌ఫ్లూ రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీ వైద్యులకు కితాబు ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ అదుపులోనే ఉందని, భయాందోళన చెందవద్దని మంత్రి చెప్పారు.
రక్త నమూనాల సేకరణ
ఓ వైపు స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నా... మరో వైపు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 40 మంది దీని బాధితులు ఉండగా, సోమవారం మరో 29 మంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఉస్మానియాలో 34 మంది నుంచి, ఫీవర్ ఆస్పత్రిలో ఐదుగురిని నుంచి, కేర్, అపోలో, యశోద, కిమ్స్, తదితర ఆస్పత్రుల నుంచి మరో 30 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు.