Laksmareddi
-
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఒక్కో వార్డును, వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించామని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
డాక్టర్ లక్ష్మరెడ్డికి పదోన్నతి
పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడిగా నియామకం జిల్లా జేడీగా విక్రంకుమార్.. ఉత్తర్వులు జారీ సాక్షి, సంగారెడ్డి: జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను ఆ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రంకుమార్ను జిల్లాకు బదిలీ చేసింది. ఈక్రమంలో లక్ష్మారెడ్డి వచ్చేవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు కృషి చేయటంతో పాటు కరువు కాలంలో పశువులకు మేత సమస్య రాకుండా లక్ష్మారెడ్డి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గోపాలమిత్ర సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేశారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం పదోన్నతి కల్పించటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
ప్యాకేజీని 25 % పెంచండి
ఆరోగ్య కార్డులపై 12 కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపం 10 శాతానికి సిద్ధమన్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలని రాష్ట్రంలోని 12 ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పునరుద్ఘాటించాయి. ఔట్ పేషెంట్లుగా వచ్చే ఉద్యోగుల నుంచి ప్రత్యేకంగా ఫీజు వసూలుకు అంగీకరించాలని మరోసారి విన్నవించాయి. సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. 12 ప్రధాన ఆసుపత్రులు నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల ద్వారానే కాక మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంటు చేసుకునే పద్ధతిని కూడా జూన్ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారం కోసం లక్ష్మారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎమ్మార్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఔట్ పేషెంట్లుగా ఉచితసేవలు అందించడం చాలా కష్టమని అందుకు ఫీజు వసూలు చేసేందుకు అంగీకరించాలని కోరారు. శస్త్రచికిత్సల ప్యాకేజీని 10 శాతం పెంచుతామని, ఔట్ పేషెంట్లపై ఫీజుకు అంగీకరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. 15 శాతం పెంపుదలకు అంగీకారం? సమావేశ వివరాలను లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వివరిస్తూ.. వారంలోగా ఆయా ప్రధాన ఆసుపత్రు ల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు మూడు రోజుల్లో వారొక నిర్ణయం తీసుకొని లేఖ రాస్తానని చెప్పారన్నారు. ఇదిలావుండగా శస్త్రచికిత్సలకు సంబంధించిన ప్యాకేజీని మధ్యస్థంగా అటు ప్రభుత్వానికి, ఇటు సూపర్‌స్పెషాలిటీలకు అంగీకారంగా 15 శాతం వరకు పెంచే సూచనలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర ఆసుపత్రులకు ప్రస్తుత ప్యాకేజీలనే అమలు చేయాలని భావిస్తున్నాయి. -
రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
రూ. 500 కోట్లతో ఏర్పాటు అనుబంధంగా వైద్యకళాశాల కూడా.. సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి అంగీకారం సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఉద్యోగులకు శుభవార్త. అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రామగుండంలో రూ. 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి అనుబంధంగా వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తన చాంబర్లో సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం సింగరేణి ఎదురుచూపు’ కథనానికి స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ. 500 కోట్ల ఖర్చును ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు భరిస్తాయి. ఎవరి వాటా ఎంతనేది వారే నిర్ణయించుకుంటారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో కార్మికులు, ఉద్యోగులకు నామమాత్రపు ఫీజుతో వైద్య సదుపాయం అందిస్తారు. ఆ ఫీజు, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తారు. సాంకేతిక, వైద్య సహకారాన్ని నిమ్స్ అందజేస్తుంది. సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం పొందాక తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆదిలాబాద్‌లోని రిమ్స్ పరిధిలో సెమీ అటానమస్‌గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 50 వేల కుటుంబాలకు ప్రయోజనం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న సింగరేణి సిబ్బంది దాదాపు 43 వేల మంది, ఎన్టీపీసీ సిబ్బంది 7 వేల మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారందరికీ రామగుండంలో ఏర్పాటు చేయబోయే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. -
గ్రామీణ వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు
సీఎం కేసీఆర్ హామీ ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధే ధ్యేయమని వెల్లడి ఛాతీ వైద్యశాల తరలింపునకు మద్దతిస్తామన్న డాక్టర్ల సంఘాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇచ్చే యోచనలో ప్రభుత్వముం దని సీఎం కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీతోపాటు ఇతర అంశాలపై చొరవ తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యశాలల అభివద్ధి కోసం ప్రభుత్వ చొరవ పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగర, పట్టణ ప్రాంతాల్లోని వారితో పోలిస్తే తక్కువ హెచ్ఆర్ఏ వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంటుందని హామీఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు వైద్యులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల నుంచి ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రుల వరకు అన్నింటినీ మెరుగు పరచాల నేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. కార్పొరేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ వైద్యరంగం మెరుగుకు త్వరలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తానని సీఎం ప్రకటించారు. ఛాతీ ఆస్పత్రి తరలింపునకు మద్దతు సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్‌లు విలేకరులతో మాట్లాడారు. ఛాతి ఆసుపత్రిని నగర శివారు వికారాబాద్‌కు తరలించడంతో అక్కడున్న మంచి వాతావరణం వల్ల రోగులు త్వరగా కోలుకోనే వీలుం టుందని చెప్పారు. ఛాతి వైద్యశాలను తరలించే విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీరేశం స్పష్టం చేశారు. అక్కడికి త్వరగా చేరుకునేందుకు సరైన రోడ్ల నిర్మాణం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. -
వైద్య, ఆరోగ్యశాఖ ప్రక్షాళన: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్:వైద్య, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తానని, అంతా పారదర్శకంగా ఉండేట్లు చూస్తానని మంత్రి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.వె ద్య ఆరోగ్యశాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బర్తరఫ్కు గురైన రాజయ్య స్థానంలో లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూపై ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తాను పారదర్శకంగా ఉంటానని, సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తానన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు ఆసుపత్రికి చెందిన ఒక అధికారికి పారిశుధ్య ఇన్చార్జి బాధ్యత అప్పగిస్తామన్నారు. అక్కడి మార్చురీ అత్యంత భయంకరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అధికారులకు కట్టుదిట్టమైన సూచనలు: తెలంగాణ మొదటి ప్రభుత్వంలో మొదటిసారిగా ఒక మంత్రిని అవినీతి ఆరోపణలతో తొలగించిన నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిపై ఒత్తిడి పెరిగింది. అవినీతి ఆరోపణలు, వైద్య పారామెడికల్ పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అక్రమ అనుమతులు, ఎన్హెచ్ఎం నిధుల ఖర్చులో తలెత్తిన వ్యవహారాలపై ఆయన మొదటిరోజే తెలుసుకున్నట్లు సమాచారం. అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ మంత్రి నిక్కచ్చిగా తన ప్రాధమ్యాలను వివరించినట్లు తెలిసింది. ఇకనుంచి అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. బుధవారం సచివాలయానికి వచ్చి ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు గాంధీ ఆస్పత్రిని సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వైన్‌ఫ్లూ రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీ వైద్యులకు కితాబు ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ అదుపులోనే ఉందని, భయాందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. రక్త నమూనాల సేకరణ ఓ వైపు స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నా... మరో వైపు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 40 మంది దీని బాధితులు ఉండగా, సోమవారం మరో 29 మంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఉస్మానియాలో 34 మంది నుంచి, ఫీవర్ ఆస్పత్రిలో ఐదుగురిని నుంచి, కేర్, అపోలో, యశోద, కిమ్స్, తదితర ఆస్పత్రుల నుంచి మరో 30 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. -
బరువు తగ్గడానికైతే ఓకే!
దీక్ష చేస్తానన్న నాగంపై మంత్రి లక్ష్మారెడ్డి వ్యంగ్య వ్యాఖ్య ‘కల్వకుర్తి ఎత్తిపోతల’ మూడోదశ పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గడానికి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నిరాహారదీక్ష చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ విద్యుత్‌శాఖ మం త్రి సి.లక్ష్మారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో దశ పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ సంక్రాంతి పండుగ తరువాత నిరాహారదీక్ష చేస్తానన్న నాగం ప్రకటనపై మంత్రి పైవిధంగా స్పందించారు. ఆదివారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీనే కల్వకుర్తి పథకం మూడోదశ పనులు ప్రారంభమయ్యాయని, ఇందుకోసం కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా విడుదల చేశామని చెప్పారు. తన నిరాహారదీక్ష వల్లే పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందడానికి నాగం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాగం మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి అవసరాలు తీరాకే మిగిలిన నీటిని జూరాల-పాకాల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాకు తరలిస్తారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అప్పటిదాకా ఈ పథకాన్ని ప్రారంభించబోమన్నారు. అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం తెలంగాణలోని అన్ని గిరిజన తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, టీపీఆర్టీయూ నేత హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.