ప్యాకేజీని 25 % పెంచండి
- ఆరోగ్య కార్డులపై 12 కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపం
- 10 శాతానికి సిద్ధమన్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలని రాష్ట్రంలోని 12 ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పునరుద్ఘాటించాయి. ఔట్ పేషెంట్లుగా వచ్చే ఉద్యోగుల నుంచి ప్రత్యేకంగా ఫీజు వసూలుకు అంగీకరించాలని మరోసారి విన్నవించాయి. సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
12 ప్రధాన ఆసుపత్రులు నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల ద్వారానే కాక మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంటు చేసుకునే పద్ధతిని కూడా జూన్ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారం కోసం లక్ష్మారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్‌ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎమ్మార్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఔట్ పేషెంట్లుగా ఉచితసేవలు అందించడం చాలా కష్టమని అందుకు ఫీజు వసూలు చేసేందుకు అంగీకరించాలని కోరారు. శస్త్రచికిత్సల ప్యాకేజీని 10 శాతం పెంచుతామని, ఔట్ పేషెంట్లపై ఫీజుకు అంగీకరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
15 శాతం పెంపుదలకు అంగీకారం?
సమావేశ వివరాలను లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వివరిస్తూ.. వారంలోగా ఆయా ప్రధాన ఆసుపత్రు ల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు మూడు రోజుల్లో వారొక నిర్ణయం తీసుకొని లేఖ రాస్తానని చెప్పారన్నారు. ఇదిలావుండగా శస్త్రచికిత్సలకు సంబంధించిన ప్యాకేజీని మధ్యస్థంగా అటు ప్రభుత్వానికి, ఇటు సూపర్‌స్పెషాలిటీలకు అంగీకారంగా 15 శాతం వరకు పెంచే సూచనలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర ఆసుపత్రులకు ప్రస్తుత ప్యాకేజీలనే అమలు చేయాలని భావిస్తున్నాయి.