బరువు తగ్గడానికైతే ఓకే!
- దీక్ష చేస్తానన్న నాగంపై మంత్రి లక్ష్మారెడ్డి వ్యంగ్య వ్యాఖ్య
- ‘కల్వకుర్తి ఎత్తిపోతల’ మూడోదశ పనులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బరువు తగ్గడానికి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నిరాహారదీక్ష చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ విద్యుత్‌శాఖ మం త్రి సి.లక్ష్మారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో దశ పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ సంక్రాంతి పండుగ తరువాత నిరాహారదీక్ష చేస్తానన్న నాగం ప్రకటనపై మంత్రి పైవిధంగా స్పందించారు.
ఆదివారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీనే కల్వకుర్తి పథకం మూడోదశ పనులు ప్రారంభమయ్యాయని, ఇందుకోసం కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా విడుదల చేశామని చెప్పారు. తన నిరాహారదీక్ష వల్లే పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందడానికి నాగం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నాగం మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి అవసరాలు తీరాకే మిగిలిన నీటిని జూరాల-పాకాల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లాకు తరలిస్తారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అప్పటిదాకా ఈ పథకాన్ని ప్రారంభించబోమన్నారు.
అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం
తెలంగాణలోని అన్ని గిరిజన తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, టీపీఆర్‌టీయూ నేత హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.