- రూ. 500 కోట్లతో ఏర్పాటు
- అనుబంధంగా వైద్యకళాశాల కూడా..
- సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి అంగీకారం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఉద్యోగులకు శుభవార్త. అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రామగుండంలో రూ. 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి అనుబంధంగా వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తారు.
శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తన చాంబర్‌లో సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం సింగరేణి ఎదురుచూపు’ కథనానికి స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ. 500 కోట్ల ఖర్చును ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు భరిస్తాయి. ఎవరి వాటా ఎంతనేది వారే నిర్ణయించుకుంటారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.
ఇందులో కార్మికులు, ఉద్యోగులకు నామమాత్రపు ఫీజుతో వైద్య సదుపాయం అందిస్తారు. ఆ ఫీజు, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తారు. సాంకేతిక, వైద్య సహకారాన్ని నిమ్స్ అందజేస్తుంది. సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం పొందాక తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆదిలాబాద్‌లోని రిమ్స్ పరిధిలో సెమీ అటానమస్‌గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
50 వేల కుటుంబాలకు ప్రయోజనం
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న సింగరేణి సిబ్బంది దాదాపు 43 వేల మంది, ఎన్టీపీసీ సిబ్బంది 7 వేల మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారందరికీ రామగుండంలో ఏర్పాటు చేయబోయే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి.