మరమ్మత్తులకు గురైన ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం
గాంధీఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ముఖ్యమైన వైద్యయంత్రాలు పనిచేయక సేవల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో నిరుపేద రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిపై భారంపై వేసి దిక్కులు చేస్తున్నారు. ఆస్పత్రి రేడియాలజీ విభాగంలోని ‘మ్యాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్’ (ఎంఆర్‌ఐ) స్కానింగ్ యంత్రం వారం రోజులుగా పనిచేయడంలేదు.
దీంతో వందలాది మంది రోగులకు వైద్యసేవలు అందడంలో జాప్యం జరుగుతోంది. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయస్థితిలో వచ్చిన రోగులకు కొన్ని సందర్భాల్లో ఎమ్మారై స్కానింగ్ తప్పనిసరి. అటువంటి అత్యవసర కేసులను కేవలం సీటీ స్కానింగ్‌తో సరిపెడుతున్నట్టు సమాచారం. గాంధీ రేడియాలజీ విభాగంలో ప్రతిరోజు సుమారు 50 మందికి ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేస్తారు. వారం రోజులుగా ఈ యంత్రం మూలనపడడంతో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో సుమారు 350 మంది రోగులు ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతున్నాయి. వివిధ వార్డుల్లో వందలాది మంది రోగులు ఎమ్మారై స్కానింగ్ కోసం వారాల తరబడి వేచిచూస్తున్నారు. 2006లో ఏర్పాటు చేసిన ఎమ్మారై స్కానింగ్ మెషిన్ జీవితకాలం 12 ఏళ్లు. సదరు యంత్రం కాలపరిమితి 2018లో ముగిసింది. మరో ఎమ్మారై మెషిన్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి అధికారులు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు వైద్యశాఖ ఉన్నతాధికారుల ఫైళ్లలో మూలుగుతున్నాయి.
రెండు రోజులుగా ‘క్యాత్ ల్యాబ్’..
గుండెకు సంబంధించిన రుగ్మతలు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలను గుర్తించే ‘క్యాత్ ల్యాబ్’ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో రెండు రోజలుగా పనిచేయడంలేదు. యంత్రంలోని పీసీబీ బోర్డు మరమ్మతులకు గురవడంతో సేవలు నిలిచిపోయాయి. వైద్య చికిత్సలు అందక ఏ క్షణమైనా గుండె ఆగిపోతుందేమోనని రోగులు బిక్కుబిక్కు మంటున్నారు.
పట్టించుకోని నిర్వహణ సంస్థ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య యంత్రాల నిర్వహణ బాధ్యతలను ‘పేబర్ సింధూరీ’ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థకు నిపుణులైన టెక్నీషియన్లు లేరని, నిర్వహణ వ్యవహరాలను సంస్థ యాజమాన్యం పట్టించుకోవడంలేదని గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. గాంధీ ఆస్పత్రిలోని వైద్యయంత్రాలు పనిచేయడంలేదని లిఖిత పూర్వకంగా సమాచారం అందించినా నేటి వరకు సదరు సంస్థ స్పందించలేదని ఆస్పత్రి అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అందుబాటులోకి తెస్తాం:సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్
వైద్య యంత్రాలకు మరమ్మతులు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. యంత్రాలు పనిచేయడంలేదని పేబర్ సింధూరీ సంస్థతో పాటు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, వైద్య ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులతో మరమ్మతులు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment